Home » బీజేపీ కి ఓటు వేస్తే… రిజర్వేషన్లపై పోటు

బీజేపీ కి ఓటు వేస్తే… రిజర్వేషన్లపై పోటు

-రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర
-అసిఫాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు నీరు, పోడు భూములు, గిరిజనేతరుల పహానీ సమస్యలు ఉన్నాయి.కేసీఆర్, మోదీ పాలనలో ఆదిలాబాద్ నిర్లక్ష్యానికి గురైంది. మోదీ గోండులకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. సోయం బాపూరావుకు టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ దొరలా, అమిత్ షా దొరలా.. గూడెం నగేష్ కూడా ఒక దొరనే.

మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ లో ఆడబిడ్డకు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. చదువుకున్న ఆడబిడ్డ..సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఆత్రం సుగుణ. ఆత్రం సుగుణను గెలిపించండి… మీ సమస్యలపై కొట్లాడుతుంది. నేను సీఎం అవగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు నిధులు విడుదల చేశా. అమరుల కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించాం.

సీసీఐ సిమెంటు పరిశ్రమ మూతపడినా మోదీ, కేసీఆర్ పట్టించుకోలేదు. వందరోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ది.బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. 1881నుంచి ప్రతీ పదేళ్లకోసారి జనగణన చేపట్టడం సంప్రదాయంగా వస్తోంది. కానీ 2021 లో బీజేపీ జనగణన చేపట్టలేదు… బీసీ జనగణన చేపట్టలేదు. బీసీ జనగణన చేపడితేనే రిజర్వేషన్లు పెంచడం సాధ్యమవుతుంది. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఇవన్నీ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో భాగమే.

బీజేపీ కి ఓటు వేస్తే… రిజర్వేషన్లపై పోటు వేస్తుంది. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం మీ చేతుల్లోనే ఉంది. బీజేపీని ప్రశ్నిస్తున్న నాపై అమిత్ షా ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టిస్తుండు. బీఆరెస్ ఎన్నో అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు. అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదు. మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులను కూడా ఎదిరించే శక్తి మీ రేవంతన్నకు వస్తుంది. మనమంతా బీజేపీ కుట్ర రాయాజకీయలను తిప్పి కొట్టాలి. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి.

పోడు భూముల పట్టాలు,గిరిజనేతరుల పహానీ సమస్యలు తీరాలంటే ఆత్రం సుగుణ గెలవాలి. కొమురం భీమ్ ప్రాజెక్టు కట్టాలంటే ఆత్రం సుగుణ గెలవాలి. బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు.. గాడిద గుడ్డు తప్ప. ఆత్రం సుగుణను లక్ష మెజారిటీతో గెలిపించాలి.

Leave a Reply