ఐదేళ్లు ఆంధ్రను పాలించిన జగన్ జమానాలో రాష్ట్రం ‘పిచ్చోళ్ల స్వర్గం’గా భాసిల్లింది. అంటే అనేక ప్రాంతాల్లో దేవాలయయాలపై దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దేవతావిగ్రహాల ముక్కు, చెవులు కోసివేయబడ్డాయి. స్వయంగా శ్రీరాముడి విగ్రహం తలనే నరికేశారు. రథం తగులబెట్టారు. ఆలయాలపై రాళ్లు వేశారు. ఆలయాల్లో మత మూత్రాలు విసర్జించబడ్డాయి. ఈ అరాచకాలపై ఆగ్రహించాల్సిన.. హిందుత్వంపై పొలిటికల్ పేటెంట్ ఉన్న బీజేపీ నవరంధ్రాలూ మూసుకుని,జగనన్నతో ఉన్న మొహమాటంతో, చేష్టలుడిగి చేతులుముడుచుకున్నప్పటికీ.. హిందూ సమాజం భగ్గుమంది. విగ్రహాలను అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని రోడ్డెక్కింది. విశాఖ పొలిటికల్ స్వామి మినహా.. స్వాములు, పీఠాథిపతులు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల ధర్మాగ్ర హంతో హిందూ సమాజాన్ని దయతలచిన నాటి జగనన్న సర్కారు.. చాలా కష్టపడి.. శ్రమపడి.. బాధపడి.. అహోరాత్రులు అన్వేషించి ఎట్టకేలకూ ‘నిందితులను పట్టుకుని హిందూధర్మాన్ని రక్షించారు’. బాగుంది. కానీ తీరా పోలీసుల ఆయాసం కమ్ ఉబ్బసంతో కూడిన విచారణలో, చివరాఖరకు తేలిందేమిటంటే.. సదరు నిందితులు పిచ్చోళ్లంట! అవును. ఇంకొంచెం తెలుగులో శుద్ధంగా చెప్పాలంటే మతిస్థిమితం లేనివాళ్లట!! ఇదంతా చేసింది ఆ దిమాక్ లేనోళ్లేనట!!!
అవును. వాళ్లంతా ఆకు-పువ్వుకు తేడా తెలియని అమాయకులట. నీళ్లు-లిక్కరుకు తేడా తెలియని వెర్రిబాగులోళ్లట. అన్నానికి-అశుద్ధానికి, పెళ్లికి-చావుకు తేడా తెలియని వెర్రి పుష్పాలట. గుళ్లను మాత్రమే పగలకొట్టే కొండెర్రిపువ్వులట. ఐదువేళ్లు చూపించి ఇవి ఎన్ని వేళ్లంటే.. 15 వేళ్లు అని చెప్పే స్వాతిముత్యం కమల్‌హసన్లట. కాబట్టి..ఈ పిచ్చోళ్లకు ఆ దేవాలయాలపై దాడితో సంబంధం లేదని చావుకబురు చల్లగా చెప్పి, ఖాకీసార్లు కేసు మూసేశారు. జగన్ జమానాలో ఐదేళ్లపాటు.. హిందువులంతా మీడియాలో చూసిన చిత్రవిచిత్ర విన్యాసాలే ఇవి!
అదేదో సినిమాలో రావుగోపాల్రారావు చెప్పినట్లు.. దీని తస్సారవ్వలబొడ్డు.. ఈ పిచ్చోళ్లంతా ఏదో కూడబలుక్కున్నట్లు గుళ్లపైనే దాడులు చేస్తారేమిటో మరి? దాడులకు గురైన దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లోనే చర్చిలు, మసీదులు కూడా ఉంటాయి. కానీ ఈ పిచ్చోళ్లకు పాపం దేవాలయాలపైనే మోజెందుకో అర్ధం కాదు. ఈ పిచ్చోళ్ల బ్యాచ్ ఇప్పటిదాకా ఒక్క మసీదుగానీ, ఒక్క చర్చి జోలికి గానీ వెళ్లిన దాఖలాలు లేవు. బహుశా.. పిచ్చోళ్లకు అవంటే భక్తేమో మరి? పోనీ వచ్చిన ఆ పిచ్చోళ్లు వెంటనే తమ పని తాము చేసుకుపోయారా అంటే అదీ లేదు. తీరి కూర్చుని అమ్మవారి విగ్రహం కళ్లు, కాళ్లు, మెడ.. దేని పార్టులు దాన్ని విడదీసి, అక్కడే ‘ఒకటీ-రెండూ’ కానిచ్చేసిన పిచ్చోన్మాదం! కానీ అక్కడున్న డబ్బులు ముట్టకోరు. ఎందుకంటే పిచ్చోళ్లు కదా? పిచ్చోళ్లకు డబ్బులతో ఏం పని బాసూ?! మన పిచ్చితప్ప!? అలా జగనన్న ఐదేళ్ల ఏలుబడిలో లెక్కలేనన్ని దేవాలయాల్లో విగ్రహాలు, పిచ్చోళ్లబారిన పడ్డాయి. ఆవిధంగా ‘పిచ్చోళ్ల స్వర్గం’ ముందుకెళ్లింది!
కూటమి సర్కారు వచ్చింది కాబట్టి, ఇక ఏపీలో పిచ్చోళ్ల స్వర్గం ఉండదని హిందువులంతా నమ్మారు. ఎందుకంటే..అందులో సనాతన ధర్మపరిరక్షకుడి అవతారమెత్తిన జనసేన దళపతి పవన్ కల్యాణ్‌తో పాటు.. హిందుత్వాన్ని హక్కుభుక్తం చేసుకున్న భాజపా కూడా, తెదేపా కూటమిలో ఉంద న్న ధైర్యమన్నమాట! హిందువులు- దేవాలయాలపై దాడి వంటి జమిలి విషయాల్లో, భాజపేయులు రాజకీయ మొహమాటంతో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. సనాతన ధర్మాన్ని స్వీకరించిన పవన్ మాత్రం, ఎట్టి పరిస్థితిలో ఊరుకోకుండా ఉగ్రరూపమెత్తుతారన్న నమ్మకం అన్నమాట! అవసరమైతే మరోసారి కాషాయం కట్టి తిరుమలకు కాలినడకన వెళ్లి, ధర్మాగ్రహం ప్రకటిస్తారన్న మాట! ఈ నమ్మకంతోనే హిందువులు కూటమికి చేయెత్తి జైకొట్టారు.
కానీ.. తీరా రెండ్రోజుల క్రితం తిరుమలలో కనిపించిన ఓ పిచ్చోడిని చూసి, హిందువులకు మళ్లీ ‘పిచ్చోళ్ల స్వర్గం’ మొదలయిందా అన్న భయం ఆవహించింది. సోమవారం తిరుమల ఘాట్‌రోడ్‌లో.. 18 కిలోమీటర్లు ఏక బిగిన కొత్త స్కూటర్‌పై ప్రయాణించిన అంజాద్‌ఖాన్ అదే పిచ్చోడు, అలిపిరి టోల్‌గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీని దాటేసి, వాహనాలను కొట్టేసి కొండెక్కేశాడు. దీనిని గమనించిన సెక్యూరిటీ, వైర్‌లెస్ సెట్ల ద్వారా పైకి సమాచారం అందించారు. దానితో ఆయాసం కమ్ ఉబ్బసంతో కూడిన నీరసం ఆవహించిన సెక్యూరిటీ అధికారులు, ‘చాలా కష్టపడి’ తిరుమల చేరిన అంజాద్‌ఖాన్‌ను పట్టుకున్నారట. ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు ‘ఏంది ఈ యవ్వారం’ అని అడిగితే.. ‘‘ఏం లేదప్పా.. ఇతగాడి పేరు అంజాద్‌ఖాన్. కొంచెం మెంటల్. అంటే మానసిక పరిస్థితి సక్కంగా లేదు. రుయాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చాడులేప్పా. కిందకు తోలుకెళుకెళుతున్నాం లే’’ అని సీఐ చావుకబురు చల్లగా చెప్పారట.
దానితో ‘నాయాల్ది.. కత్తి అందుకో జానకీ’.. అని పాత సినిమాలో కృష్ణంరాజు డైలాగు చెప్పినంత కోపమొచ్చింది హిందూ సమాజానికి! జగన్ జమానాలో చెప్పిన డైలాగులే, కూటమి హయాంలోనూ డెలివరీ కావడమే వారి కోపానికి అసలు కారణం. ఏలికల సెక్యులర్ చల్లని మనసు పుణ్యాన తిరుపతిలో మసీదులు, చర్చిలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ మన అంజాద్‌ఖాన్ అనే పిచ్చోడు అక్కడికి వెళ్లకుండా.. రెండు లీటర్ల పెట్రోల్ పోసుకుని మరీ కొండెందుకెక్కినట్లు? అదే లోకల్‌గా ఉన్న మసీదు, చర్చిలకు వెళితే పెట్రోలు కూడా ఆదా అయ్యేది కదా? కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు.. అంజాద్ భాయ్‌కు మెంటల్ ఉండి, రుయా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే.. మధ్యలో ఎలా రోడ్డుమీదకు కొత్త స్కూటర్‌తో ఎంటరయ్యాడు?
అసలు దిమాక్ సక్కంగా ఉన్నోళ్లకే కొత్త స్కూటర్.. అందునా నెంబర్ కూడా ఇవ్వని కొత్త స్కూటరు ఇవ్వరు కదా? మరి ‘పాగల్’గానికి కొత్త స్కూటర్ ఎట్లిచ్చారు? అసలు అంజాద్ అనే వాడికి పిచ్చి ఉన్నట్లు డాక్టర్లు తేల్చారా? లేదా? ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?.. మెడపై తల ఉన్న ఏ పిచ్చోళ్లకైనా వచ్చే సందేహాలివి! కానీ గమ్మత్తుగా పోలీసులకు మాత్రం, ఇలాంటి సందేహాలు రాకపోవడమే వింత. బహుశా ఖాకీల మెడలు ప్రత్యేకమేమో?
పోలీసులను పక్కనపెడితే.. ప్రజల చే యి పట్టుకుని నడిపించే మీడియా బుద్ధి ఏమైంది? జగన్నాయకుడి సన్నిథిలో జరిగిన ఇంత పెద్ద వార్తను ఎక్కడ?.. ఏ పేజీలో ప్రింట్ చేయాలో కూడా తెలియని బుర్రతక్కువ మేధావులతో మీడియా నడిపిస్తున్నారా?.. అసలు పేరుగొప్ప ఈనాడు, సాక్షి వంటి మోతుబరి పత్రికల్లో ఈ వార్త ఎక్కడ వచ్చిందో తెలిస్తే నోటితో నవ్వరు. ఇంకోదానితో నవ్వుతారు.
తిరుపతి లోకల్ ఎడిషన్‌లో, అదికూడా జిల్లాపేజీల్లో.. ఎవర న్నా చదువుతారేమోనని, జాగ్రత్తగా లోపలిపేజీల్లో అచ్చొత్తారు. అన్నట్లు జగనన్న సతీమణి భారతీరెడ్డి వదిన నడుపుతున్న సాక్షి పత్రిక అయితే.. అంజాద్‌ను మతిస్థిమితం లేని వాడిగా ముందే సర్టిఫికెట్ ఇచ్చేసింది. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గన్నట్లు!
మరి అదే మోతుబరి మీడియా గత రెండురోజుల నుంచి పాస్టర్ ప్రవీణ్ మరణంపై పుంఖానుపుంఖాల కథనాలు పోటీలు పడి మరీ వండివార్చాయి. పాస్టరు గారు కొన్న మందుబాటిళ్ల వైన్‌షాపుల నుంచి.. తూలుకుంటూ బండి తిప్పిన ఫొటోలు, వీడియోలు.. ప్రవీణ్ ఆ మధ్యలో ఎక్కడ కు వెళ్లారంటూ పెద్ద పెద్ద బీజీలు వేసి, ప్రేక్షకుల దుంపతెంచాయి. కానీ తిరుమలపైకి ఒక అన్యమతస్తుడు వెళ్లిన వార్త గానీ.. ఎందుకు వెళ్లాడన్న కథనం గానీ రాస్తే ఒట్టు. ఇదీ మీడియా సామాజిక, సెక్యులర్ బాధ్యత!