Suryaa.co.in

Editorial

తెలంగాణలో తెలుగుదేశం దారెటు?

– టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకమా? అనుకూలమా?
– ఇప్పటిదాకా కేసీఆర్‌ సర్కారుపై పెదవి విప్పని తెలంగాణ తమ్ముళ్లు
– ప్రాజెక్టుల నుంచి ఫాంహౌస్‌ కేసు వరకూ మౌనమే
-కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలకు దూరం
– కాంగ్రెస్‌, బీజేపీ విధానాలనూ ప్రస్తావించని బాబు
– ఉప ఎన్నికల్లో మొఖం చాటేస్తున్న వైనం
– కాసాని చేరిక సభలోనూ కేసీఆర్‌ పాలనను ప్రస్తావించని బాబు
– రామగుండంలో ప్రధాని పర్యటనపైనా మౌనమే
– గత విజయాలకే బాబు ప్రసంగం పరిమితం
– మాజీలను తిరిగి రమ్మన్న పిలుపు
– కాసాని కొత్తగా సాధించేదేమిటి?
– తెలంగాణలో ఎవరితో యుద్ధం చేయాలి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త సైన్యాధ్యక్షుడు వచ్చారు. ఆయనతో తెలుగుదేశాధీశుడు ప్రమాణం చేయించారు. కొత్త దళపతి ప్రమాణాస్వీకారానికి, తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దానితో కొన్నేళ్ల తర్వాత భాగ్యనగరంలో పసుపు సందడి కనిపించింది. సిటీలో ట్రాఫిక్‌ జామయింది. పార్టీ నేతల జోష్‌ తమ్ముళ్లకు కిక్కు ఇచ్చింది. అంతా బాగానే ఉంది. మరి… వారినుద్దేశించి మాట్లాడిన పార్టీ అధినేత, తరలివచ్చిన తమ్ముళ్లలో జోష్‌ పెంచారా అంటే లేదు. సర్కారుపై సమరశంఖం పూరించమని చెప్పారా అంటే అదీ లేదు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారా అంటే అదీ లేదు. పోనీ ఎవరితో యుద్ధం చేయమని పిలుపునిచ్చారా అంటే ఆ ముచ్చటా లేదు.

మరి కొత్త సైన్యాధ్యక్షుడు ఎవరితో యుద్ధం చేయాలి? మరి ప్రత్యర్థి ఎవరో తెలియకుండా గాల్లో యుద్ధం చేయాలా? గాల్లో కత్తులు తిప్పాలా? అసలు పార్టీకి ప్రత్యర్ధి ఎవరు? ఇంతకూ కేసీఆర్‌ సర్కారుకు అనుకూలమా? వ్యతిరేకమా? సర్కారును విమర్శించాలా? వద్దా ? కాంగ్రెస్‌-బీజేపీపై వైఖరి ఏమిటి? ఇలాంటి మందుగుండు సామాగ్రి, అస్త్రశస్త్రాలు లేకుండానే బరిలోకి దిగిన కొత్త దళపతి, కొత్తగా వచ్చి సాధించేదేమిటి? కాసాని జ్ఞానేశ్వర్‌ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తెలుగుతమ్ముళ్ల సందేహాలివి!

అనేకపార్టీల్లో పనిచేసిన రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌, తిరిగి తెలుగుదేశం గూటికి చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు, తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి అప్పగించారు. గురువారం కాసాని అధ్యక్ష ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని విడిచి, ఏపీకి వెళ్లిన చాలా ఏళ్ల తర్వాత … హైదరాబాద్‌లో టీడీపీ జండాలు, ఫ్లెక్సీలు, బంటింగులు భారీగా కనిపించాయి. కాసాని బలప్రదర్శన దెబ్బకు, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ గంటలపాటు జామయిపోయింది. తెలంగాణ జిల్లాల నుంచి, తెలుగుతమ్ముళ్లు భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు.

అయితే.. వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చిన నేపథ్యంలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగం, ఎవరిలోనూ చైతన్యం రగిలించలేకపోయిందన్న వ్యాఖ్యలు టీడీపీtstdp1నేతల నుంచి వినిపించాయి. చంద్రబాబు తన ప్రసంగంలో, తాను సీఎంగా నిర్మించిన హైటెక్‌ సిటీ, అవుటర్‌ రింగ్‌రోడ్‌, సైబరాబాద్‌, ఎయిర్‌పోర్టు నిర్మాణాలతోపాటు, తీసుకువచ్చిన ఐటీ కంపెనీల గురించే ప్రస్తావించారు. తాను ఆనాడు అవన్నీ తీసుకురాకపోయి ఉంటే, ఇప్పుడు ఇంత సంపద పెరిగేదేనా? అని ప్రశ్నించారు.

ఇన్ని చెప్పిన చంద్రబాబునాయుడు.. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు గురించి దిశానిర్దేశం చేయకపోవడం, కార్యకర్తలను విస్మయపరిచింది. కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు.. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎలాtstdp-display వ్యవహరించాలని, కార్యకర్తలకు స్పష్టత ఇవ్వకపోవడం వారిని నిరాశపరిచింది. టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనా వైఫల్యాలపై ఆందోళన చేయాలని, చంద్రబాబు పిలుపు ఇస్తారని ఆశించిన తమ్ముళ్లకు, మళ్లీ భంగపాటు ఎదురయింది. సీఎంకు ఆహ్వానం లేకుండా.. రామగుండం వస్తున్న ప్రధాని పర్యటనపైనా, చంద్రబాబు స్పందించలేదు.

దేశాన్ని కుదిపేసిన ఫాంహౌస్‌ వ్యవహారంపైనా.. చంద్రబాబు స్పందిస్తారని ఆశించిన తమ్ముళ్లకు, ఆయన మౌనం నిరాశ పరిచింది. ఓవైపు ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై.. కాంగ్రెస్‌-బీజేపీ విరుచుకుపడుతుంటే, దానిపై చంద్రబాబు స్పందిస్తారని కార్యకర్తలు ఆశించినా ఫలితం సున్నా. చివరకు కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల కూడా ప్రాజెక్టుల్లో అవినీతిపై విరుచుపడుతున్న విషయాన్ని పార్టీనేతలు గుర్తు చేస్తున్నారు. దానితో తమ పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? అన్న సందిగ్థం.. పార్టీ అధినేత ప్రసంగం తర్వాత కూడా, కార్యకర్తల్లో కొనసాగడమే ఆశ్చర్యం.

బక్కని నర్శింహులు అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ, టీఆర్‌ఎస్‌పై వైఖరిని చంద్రబాబు స్పష్టం చేయలేదు. కనీసం కాసాని అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా, పార్టీ విధానమేమిటో చెప్పకపోవడం పార్టీ నేతలను విస్మయపరిచింది. దీనితో కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వచ్చి, ఏం సాధిస్తారన్న సందేహాలు సహజంగానే తెరపైకొచ్చాయి.

అసలు తెలంగాణలో పార్టీ విధానం ఏమిటి? ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? టీఆర్‌ఎస్‌ను విమర్శించాలా? వద్దా? అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉండాలా? శత్రుపక్షంగా ఉండాలా? కాంగ్రెస్‌-బీజేపీపై పార్టీ విధానం ఏమిటి? అన్న కీలక అంశాలపై స్పష్టత లేకుండా, ఎవరితో యుద్ధం చేయాలన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

పైగా కేవలం ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన కాసాని వల్ల.. పారీక్టి వచ్చే ప్రయోజనమేమిటన్న ప్రశ్నలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో ముదిరాజ్‌ సామాజికవర్గ సంఖ్య ఎక్కువ. రాష్ట్ర విభజనకు ముందుకు కాసానికి, ముదిరాజ్‌ వర్గంలో విపరీతమైన ఇమేజ్‌, పట్టు ఉండేది. ఆ సమయంలో ఆ సామాజికవర్గం, టీడీపీకి మద్దతుదారుగా ఉండేది. విభజన తర్వాత టీడీపీ నాయకత్వం తెలంగాణను విడిచిపెట్టడంతో, ముదిరాజులు తలా ఒక పార్టీ వైపు వెళ్లారు.

ఆ క్రమంలో ముదిరాజ్‌లు టీఆర్‌ఎస్‌ వైపు గంపగుత్తగా మొగ్గుచూపారు. తర్వాత ఆ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌.. టీ ఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరడంతో, యావత్‌ ముదిరాజ్‌ సామాజికవర్గం బీజేపీ వైపు మళ్లింది. ఇప్పుడు ఈటల ఒక్కరే, ముదిరాజ్‌ ఏకైక నేతగా ఆవిర్భవించారు. ఈ నేపథ్యంలో, ముదిరాజ్‌ సామాజికవర్గానికి నాయకత్వం వహిస్తున్న కాసానికి.. పార్టీ పగ్గాలిచ్చినా ప్రయోజనం ఏమిటన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.

దానికితోడు పార్టీ నుంచి పెద్ద తలలు నిష్ర్కమించడంతో, ఇప్పుడు తృతీయ శ్రేణి నేతలే మిగిలారు. సభ్యత్వాలు కాసానికి పెద్ద సవాలు. పార్టీ విధానం ఏమిటన్న దానిపై స్పష్టత లేకుండా, పార్టీలో ఎవరు చేరతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో, పోటీ చేయకుండా పార్టీ చేతులెత్తేసింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లోనూ నామమాత్రపు పోటీనిచ్చింది. జిల్లాల్లో పార్టీ ఆఫీసులు సగం వరకూ పనిచేయడం మానేశాయి. ఈ క్రమంలో పార్టీని గాడిలో వేయడం, కాసానికి కత్తిమీద సామేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

LEAVE A RESPONSE