నీట్ పీజీ 2022 ని వాయిదా వేయండి

– కేంద్రమంత్రికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ

పరీక్షలను వాయిదా వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర ఆరోగ్య శాఖామంత్రికి లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ..

నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో, సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది.

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షకు హాజరవుతున్న 1.7 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది విద్యార్థుల నుండి వస్తున్న అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకోవాలి. పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడానికి కూడా విద్యార్థులకు సమయం లేకుండా పరీక్షా తేదీలు ప్రకటించారు.

మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కౌన్సిలింగ్ కి హాజరుకావాలో లేక పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాలో తేల్చుకోలేక విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారు. కోవిడ్ రెండో దశ సందర్భంగా వేసిన డ్యూటీల కారణంగా చాలా మంది ఇంటర్న్ షిప్ పూర్తి చేయలేకపోయారు.

ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా ప్రజలకు సేవ చేసిన వారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. విద్యార్థుల భవిష్యత్తు, అర్హులందరికీ అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేసి వారి కోరిక మేరకు నీట్ పీజీ 2022 ని వాయిదా వేయాలని కోరుతున్నాను.

Leave a Reply