– గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ఎగుమతులు, రాయతీలపై చర్చించిన ప్రతినిధులు
– సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి
అమరావతి : గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో భేటీ అయ్యారు. గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలతో పాటు కూలీల కొరత, రాయల్టీ, గత ఐదేళ్లుగా తగ్గిన ఎగుమతులు, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వంటి వాటి పైనా సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమకు పూర్వ వైభవం రావాలంటే… అందరికీ ఉపయుక్తంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలని వ్యాపారులు కోరారు.
అదే విధంగా విద్యుత్ రాయితీతో పాటు వివిధ రకాల పారిశ్రామిక రాయితీలనూ కల్పించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి గొట్టిపాటికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సానుకూలంగా స్పందించారు. గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు