Suryaa.co.in

Telangana

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి

– విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారి సమీక్షలు చేయండి
– జెన్ కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ రాబోయే 5, పది సంవత్సరాలకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్ అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రజా భవన్ లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

2023లో మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్, 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2029-30 నాటికి ఎంత మేరకు డిమాండ్ పెరుగుతుంది, అదే పద్ధతిలో 2030-35, 2047 సంవత్సరాలకు ఏర్పడే విద్యుత్తు డిమాండ్ అందుకు అనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవనం, పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగనున్న విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంచనాలు రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది ఇ 0దుకు గాను ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు సంవత్సరానికి 12,500 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి అన్నారు. నిరుపేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం వీటి విలువ2 వేల కోట్ల వరకు ఉంది అది భవిష్యత్తులో పెరిగి మూడు వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది .

మొత్తంగా ఉచిత విద్యుత్ పథకాలకు భవిష్యత్తులో 17 వేల కోట్ల వరకు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఎనర్జీని పెద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకుని వేగంగా కార్యాచరణ చేపట్టాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది ఈ పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నాం, మొత్తం సోలార్ పంపు సెట్లు వినియోగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

2030-31, 2035 నాటికి థర్మల్ విద్యుత్తు కు ఉండే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాల క్రితం నిర్మించిన రామగుండం, కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ల స్థానంలో కొత్తవి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుచేసి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో 2019 లోనే మూసి వేసాం. అక్కడ 500 ఎకరాల స్థలం, బొగ్గు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అక్కడ అవకాశం ఉందని డిప్యూటీ సీఎం సూచించారు. 62.5 మెగావాట్ల సామర్థ్యంతో నిజాం కాలంలో ఏర్పాటుచేసిన రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాలం చెల్లిపోవడంతో మూసి వేసాం. అక్కడే 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో డైరెక్టర్లు అందుకు తగిన విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

అందరి దృష్టి ప్రస్తుతం తెలంగాణ రెడ్ కో పైనే ఉంది, తెలంగాణ రెడ్ కో దేశానికి రోల్ మోడల్ గా నిలవాలని డిప్యూటీ సీఎం సమావేశంలో ఆకాంక్షించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనిచేసేందుకు రెడ్కోకు కావలసిన సిబ్బంది, ఏ స్థాయి సిబ్బంది కావాలో సవివరంగా ఓ నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు రెడ్ కో కు ఉంటుందని సమావేశంలో డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

డైరెక్టర్లు అందరికీ కావలసినంత స్వేచ్ఛను ఇస్తున్నాం, ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలను పూర్తి చేయండి, విద్యుత్ శాఖ అభివృద్ధికి కావాల్సిన ఆలోచనలు చేయండని డిప్యూటీ సీఎం కొత్తగా నియామకమైన డైరెక్టర్లను కోరారు.

దావోస్ లో, హైదరాబాదులో, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి ఒప్పందలపై రోజువారి సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ, జెన్కో రెండు శాఖలను సమన్వయం చేసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, జెన్కో సి.ఎం.డి హరీష్, రెడ్కో vcmd అనిలా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE