Suryaa.co.in

Telangana

పీవీ తెలంగాణ ఠీవీ

– భారతదేశ ఆణిముత్యం
– భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
– పీవీ స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి

తెలంగాణ బిడ్డగా, పరిపాలనాదక్షుడుగా, భారతదేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకున్నపుడు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది, జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, భారత దేశ ఆణిముత్యమని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.

భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి కృషిని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. బహుభాషాకోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా స్వర్గీయ పీవీ నరసింహారావు బహుముఖీన పాత్ర అజరామరమన్నారు.

కొద్దికాలమే పనిచేసినా.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సంస్కరణవాద పరిపాలన నేటికీ ఆదర్శనీయమని కొనియాడారు.
వారి కృషికి సరియైన గౌరవం దక్కలేదనే బాధను వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనే తెలంగాణ ప్రజాకాంక్షను పరిగణలోకి తీసుకుని ‘పీవి ని తెలంగాణ ఠీవి’ గా ప్రపంచానికి చాటిన ఘనత నాటి బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ గారు గుర్తు చేశారు.

పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా…భవిష్యత్తు తరాలు వారి కృషినుంచి స్పూర్తి పొందే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.

నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా…పీవీ 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసామని తెలిపారు. పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు,. పీవీ రాజకీయ వారసత్వం కొనసాగింపుగా తన వారసురాలు సురభి వాణీదేవి కి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిందని తెలిపారు.

పీవీకి భారతరత్న కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చామన్నారు.
పీవీ కృషికి గుర్తింపుగా వంగర, లక్నెపల్లి లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడంతో పాటు,వరంగల్‌, కరీంనగర్‌, వంగర, ఢిల్లీ తెలంగాణా భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

పీవీ ఘనకీర్తిని స్మరించుకోవడం అంటే తెలంగాణ బిడ్డలు తమ గొప్పతనాన్ని తాము గుర్తు చేసుకోవడమేనని కేసీఆర్ వివరించారు.
ఈ దిశగా వారి వారి కీర్తిని చాటుకుంటూ ప్రజా సంక్షేమం దిశగా స్పూర్తివంతమైన పాలనను అందించడం ద్వారామాత్రమే పీవీ నరసింహారావు కి మనం ఘన నివాళి అర్పించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

LEAVE A RESPONSE