ప్రెస్ క్లబ్ పై కిష్కింద రచ్చ

– ప్రెస్ క్లబ్ చరిత్ర, నిర్మాణం పై వాస్తవ వివరాలు వెల్లడించిన సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు

విజయవాడ గాంధీనగర్ లోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూ డబ్ల్యూజే) అనుబంధ ప్రెస్ క్లబ్ గురించి కొందరు జర్నలిస్టు ముసుగులో వాట్సప్లలో చేస్తున్న కిష్కింద రచ్చ గురించి .. యూనియన్ సీనియర్ నేతగా, ప్రెస్ క్లబ్ పునాదులు దగ్గర నుంచి ఇప్పటివరకు దాని అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తిగా.. జర్నలిస్టు మిత్రులందరికీ అవగాహన నిమిత్తం వాస్తవాలను మీ దృష్టికి తెస్తున్నాను.

1970లో నాటి ముఖ్యమంత్రి గౌ.. కీ.శే. కాసుబ్రహ్మనందా రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి ల సహకారం తో ప్రత్యేక జి.ఓ. ద్వారా రైవస్ కెనాల్ గట్టుపై కొంత స్థలాన్ని ఏపీయూ డబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ కు యివ్వడం జరిగింది. 1971లో ముఖ్యమంత్రి గౌ.కీ.శే. బ్రహ్మ నంద రెడ్డి గారు ఆ స్థలంలో apuwj భవనం అందులో నిర్వహించే ప్రెస్ క్లబ్ కు శంకుస్థాపన చేశారు. ఆ పిదప ఆనాడు వున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు మ్యూజికల్ నైట్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కొందరు ప్రముఖులు, దాతలు నుండి విరాళాలు సేకరించడం ద్వారా నిధులు సమకూర్చి ఏపీయూడబ్ల్యూజే కార్యాలయ భవనాన్ని నిర్మించడం, 1975లో నాటి ముఖ్యమంత్రి కీ.శే. జలగం వెంగళరావు భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

నాడు విజయవాడ వార్తా పత్రికలకు రాజధానిగా భాసిల్లినది. అన్ని పత్రికలలోని సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు పత్రికా సంపాదకులు ఏపీయూడబ్ల్యూజే లో సభ్యులుగా వున్నారు. ప్రముఖ జర్నలిస్టులు, సంపాదకులు కీ.శే. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహనరావు, సి. రాఘవాచారి, పరకాల పట్టాభి రామారావు, బొమ్మారెడ్డి, పొత్తూరి పుల్లయ్య మధుసూదనరావు, వికెయం. తిలక్, జి. ఉపేంద్రబాబు, పి. వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి తదితరులు ఏపీయూడబ్ల్యూజే నాయకులుగా ప్రెస్ క్లబ్, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసారు. 1967లోనే యూనియన్ ప్రెస్ క్లబ్ కు కార్యవర్గాలు ఏర్పాడ్డాయి. ఆ తరువాత, యూనియన్లో వున్న కొందరు స్వార్ధ ప్రయోజనాలతో, వ్యాపారకాంక్షతో యూనియన్ నుండి వేరే యూనియన్లలో చేరడమో, కొత్త యూనియన్లను పెట్టుకోవడమో జరిగింది.

అలా వెళ్ళిపోయిన వారిలోని కొందరు ఇటీవల ప్రెస్ క్లబ్ లో తమకు సభ్యత్వం కావాలని ఇది అందరిది అని జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతర యూనియన్లలో సభ్యులుగా వుండి, ఏపీయూడబ్ల్యూజే అధ్వర్యంలోని ప్రెస్ క్లబ్ లో సభ్యత్వాన్ని కోరడం సిగ్గుచేటు. అయినా కూడా ప్రెస్ క్లబ్ సభ్యత్వం తమకు యివ్వాలని ఫిర్యాదు చేసిన వారిలో ఎవ్వరూ కూడా ఏనాడు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకుంటే ప్రెస్ క్లబ్ బైలా ప్రకారం అర్హులకు సభ్యత్వం ఇవ్వడానికి అభ్యంతరం వుండదు. అలా చేయకుండా తగుదునమ్మా అని అధికారులకు ఫిర్యాదు చేయడం, ఆ విషయాలను, వార్తగా వాట్సప్ లో పోస్టు పెట్టడం ఏమాత్రం సముచితం కాదు.

అలా పోస్టు పెట్టి న వారిలో కొందరు తెల్లవారితే ప్రెస్ క్లబ్ లోనే తిష్టవేసి ఉండే వారు కూడా మమ్మల్ని ప్రెస్ క్లబ్లోకి అనుమతించడం లేదని, లైట్లు, ఫ్యాను వేసుకోవడం లేదని అధికారుల వద్ద నంగనాచి మాటలు చెప్పడం సిగ్గుమాలిన చర్య. కార్పోరేషన్ నీటి సరఫరా విభాగం అధికారులకు ప్రెస్ క్లబ్ నీటి బకాయిలను చెల్లించలేదని, అక్రమంగా నీరు ఉపయోగించుకొంటున్నారని, సమావేశాలు నిర్వహించుకునే ప్రజా సంఘాల వారికి ఇబ్బంది కలుగ చేయడమే కాకుండా అదేదో ఘనకార్యమైనట్లు చంకలు గుద్దుకొని వాట్సప్ లలో పెట్టడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం.

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలోని ప్రెస్ క్లబ్ సమస్య విజయవాడ సబ్ కలెక్టర్ వద్ద విచారణలో వుండగా వాట్సప్ లో పోస్టింగ్ లు పెట్టడం ప్రెస్ క్లబ్ ను బద్నాం చేసే బ్లాక్ మెయిలింగ్ చర్య తప్ప మరొకటి కాదు. వేళ్ల మీద లెక్కించ దగ్గ ఇలాంటి వారి బెదిరింపులకు వేలాది మంది సభ్యత్వం గల ఏపీయూడబ్ల్యూజే భయపడదు. విజయవాడలోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంపై యాజమాన్య హక్కు యూనియన్ దే అనేది నగ్నసత్యం.

ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అపరిష్కృతంగా ఉన్న లీజు పెంపుదలకు సంబంధించిన అంశాన్ని యూనియన్ ప్రాసెస్ చేస్తుంది. ఇది యూనియన్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారం. నలుగురైదుగురు కలిసి దురుద్దేశపూరితంగా ప్రెస్ క్లబ్ పై బురదజల్లే తప్పుడు చర్యలను యూనియన్ ఏకగ్రీవంగా ఖండిస్తున్నది.

ప్రెస్ క్లబ్ నీటి బకాయిలు చెల్లించవలసి వుంటే తప్పకుండా చెల్లించడానికి సిద్ధంగా వున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగం అధికారులు యూనియన్, ప్రెస్ క్లబ్ బాధ్యులకు ఎట్టి ముందస్తు నోటీసు యివ్వకుండా నీటి కనెక్షన్ కట్ చేయడం సామాజిక న్యాయానికి విరుద్ధం. అందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము.

Leave a Reply