ఇసుక విధానంపై లారీ ఓనర్ల ఆందోళన

– మూడు రోజులుగా నిలిచిపోతున్న వాహనాలు
– జెపి బిల్లులతోనే కొనసాగుతున్న ఇసుక ర్యాంపులు
– దిక్కుతోచని స్థితిలో లారీ యాజమాన్యం

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదవారికి ఇసుకను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటుచేసిన విధానం ద్వారా ఇసుక ర్యాంపులను లీజుకు తీసుకున్న అందాని గ్రూప్స్ పై ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా లారీ ఓనర్లు అసోసియేషన్ యూనియన్ సభ్యులు ధ్వజమెత్తారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో గల ఇసుక ర్యాంపు వద్ద మంగళవారం ఇసుక తవ్వకాలు ర్యాంపుల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలను వారి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 30వ తారీకున ఇసుక ర్యాంపులు మూత పెట్టారని,ఈనెల ఏడో తేదీ నుంచి తిరిగి తెరిచారని అయితే జిల్లాకు ఒకటి,రెండు ఇసుక ర్యాంపులు మాత్రమే తెరవడంతో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ర్యాంపుల నిర్వహణ చేసేది ఎవరనేది కూడా తెలియడంలేదన్నారు .

గతంలో ఇసుక ర్యాంపులు నిర్వహించిన జెపి కన్స్ట్రక్షన్స్ వారి బిల్లులతోనే ప్రస్తుతం సైతం ఇసుకర్యాంపులను నిర్వహిస్తున్నారని,ఈ బిల్లులతో ఇసుకను లోడ్ చేసుకున్న లారీలను ప్రభుత్వ అధికారులు నిర్దాక్షిణ్యంగా ఆపివేసి , గత సంస్థ వారికి చెందిన బిల్లులతో ఇసుకను ఏ విధంగా తరలిస్తున్నారని ప్రశ్నిస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. జిల్లాకి ఒకటి,రెండు ర్యాంపులు మాత్రమే తెరవడం వల్ల ఇతర జిల్లాల నుండి సైతం ఇసుక కోసం ఇక్కడకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ప్రస్తుతం ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న సిబ్బంది డబ్బులు కట్టించుకోవడం కోసమే బాధ్యతలు వహిస్తున్నారని,లారీల్లో ఇసుక నింపడం పై ఎటువంటి బాధ్యత వహించడంలేదన్నారు.

లారీల్లో ఇసుక లోడ్ చేయడానికి మూడు నాలుగు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డ్రైవర్లకు కనీసం మంచినీళ్లు సైతం దొరకడం లేదని వారి జీతాల భారం సైతం తమపై పడుతుందని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇసుక ర్యాంపులను మూడు జోన్లుగా విభజించి జోన్ వన్ ప్రతిమ కన్స్ట్రక్షన్స్ కు అప్ప చెప్పడం జరిగిందని, అయితే బిల్లులు మాత్రం పాత జేపీ కంపెనీవి ఇస్తున్నారని వారు తెలిపారు.

వాహనాలలో ఇసుకను తక్కువగా లోడ్ చేసి పంపుతున్నారని,వెంటనే ప్రభుత్వం ఇసుక విధానాన్ని సవరించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ఏర్పరచాలని లారీ ఓనర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ యూనియన్ ప్రెసిడెంట్ రావూరి రాజా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జొన్నాడ లారీ యూనియన్ ప్రెసిడెంట్ నల్లమిల్లి జ్యోతి రెడ్డి,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ యూనియన్ సభ్యులు బండారు సత్తిబాబు,మానే జగదీష్, కవురు నాగరాజు, బలుగు కేదారేశ్వరుడు, గరగపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply