Suryaa.co.in

National

నింగికెగసిన పీఎస్ఎల్వీ- సీ 60

– ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 60ని సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు.

భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే, వ్యోమనౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.

పీఎస్‌ఎల్వీ సీ 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువు ఉండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ – 60 రాకెట్ చేర్చనుంది.

ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి. డాకింగ్ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో రోధసీలో ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలని అనుసంధానం చేసేలా శాస్త్రవేత్తలు వీటిని డిజైన్ చేశారు.

LEAVE A RESPONSE