పబ్బు .. రేవ్ పార్టీ ..

294

పబ్బు అంటే : బార్ లాంటిది . యువతను ఆకట్టుకొనేలా సీటింగ్ . డిస్కో లైట్స్ . మ్యూజిక్ సిస్టం . డాన్స్ లు .
రేవ్ పార్టీ అంటే : హుషారెక్కించే ఫాస్ట్ బీట్ మ్యూజిక్ కు అలుపు సొలుపు లేకుండా డాన్స్ చేయడం .
అర్ధ రాత్రి దాటాక కూడా ఎలా డాన్స్ చేస్తారు ?
రెడ్ బుల్ లాంటి హై ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు . ఇందులో గ్లూకోస్ బాగా ఎక్కువ .
మరి మాదక ద్రవ్యాలు ?
ప్రతి రేవ్ పార్టీ లో మాదక ద్రవ్యాలు వాడుతారు అని చెప్పలేము . కానీ ఇటీవలి కాలం లో మాదక ద్రవ్యాల వాడకం బాగా పెరిగింది . అదే సమయం లో రేవ్ పార్టీ లో పాల్గొన్న వారంతా మాదక ద్రవ్యాలు వాడారు అని చెప్పలేము .
నిన్న ఎలా పట్టుకొన్నారు ?
టాస్క్ ఫోర్స్ పోలీస్ లు రైడ్ చేసి పట్టుకొన్నారు .
టాస్క్ ఫోర్స్ అంటే ?
సిటీ పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేసే విభాగం . స్థానిక పోలీస్ ల కు సమాచారం ఇవ్వకుండా, నిన్న ఈ రైడ్ చేసారు . అంటే సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగింది .
అంటే అప్పటికప్పుడు వెళ్లి రైడ్ చేసారా ?

ఉండొచ్చు . కానీ చాలా సార్లు ఫలానా చోట ఇలాంటివి జరుగుతుంటాయి అని సమాచారం అందుకొని పోలీస్ లు ముందుగా నే ఏర్పాట్లు చేసుకొంటారు . తమ మనుషుల్ని రంగం లో దించుతారు . అక్కడ స్టాఫ్ కొంత మంది సాయం తీసుకొంటారు . లోపల ఉన్న వారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వుంటారు . సరైన సమయానికి మిగతా పోలీస్ లో రంగ లోకి దిగి మొత్తం సీజ్ చేస్తారు . అక్కడ ఉన్న వారికి తప్పించుకొనే అవకాశం ఉండదు . టాస్క్ ఫోర్స్ రైడ్స్ చాలా మటుకు ఇలాగే ఉంటాయి . దీన్నే డెకాయ్ ఆపరేషన్ అంటారు .
ఎందుకు చేశారు ?
నగరం లో అలాగే తెలంగాణ రాష్ట్రం లో { ఆ మాటకు వస్తే కరోనా కాలంలో దేశంలో అనేక చోట్ల } మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరిగి పోయింది . దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది . నాలుగేళ్ళ కింద మాదక ద్రవ్యాల కేసును సరిగా హేండిల్ చేయలేదన్న అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ఈ సారి ఈ సమస్య పై సీరియస్ గా ఉంది . నగరంలోని ఇద్దరు పోలీస్ కమిషనర్ లు నిక్కచ్చిగా పని చేసేవారే . ఈ నేపథ్యంలోనే రాత్రి రైడ్ జరిగింది .

పట్టుబట్ట వారందరూ దోషులా ?:
ముందుగా రెండు మాటలు చెప్పుకోవాలి .
చట్టం .. నైతికత
నైతికం .. అనైతికం .. దీని గురించి అందరికీ తెలిసిందే .
పబ్బు కు పోవడం చట్ట వ్యతికరేకం కాదు. ఒంటి గంట దాటి పబ్ వాడు తెరిచి ఉంచి మద్యం సరఫరా చేస్తే అది అక్కడ ఉన్న కస్టమర్స్ పైకి నేరంగా మారదు . అంత దాక అక్కడ ఏమి చేసారు ? ఎంత తాగారు .. ఇవి నైతిక విలువల కు సంబదించిన అంశం .

మరి నేరం ఏమిటి ?
అక్కడ మాదక ద్రవ్యాలు వాడారు అని చెప్పడానికి ఆధారాలు దొరికాయి . నిజానికి అలాంటి సమాచారం మేరకే టాస్క్ ఫోర్స్ రైడ్ చేసారు . కానీ అక్కడ వున్నవారు అందరూ మాదక ద్రవ్యాలు తీసుకొన్నారు అని చెప్పలేము . అలాంటి అవకాశాలు తక్కువే . అదే సమయం లో మాదక ద్రవ్యాలు బాగా వాడారు అనేది స్పష్టం .

ఎవరు దొరికారు ?
పోలీసులు 142 పేర్లతో లిస్ట్ విడుదల చేసారు . ఇందులో హోటల్ స్టాఫ్ పేర్లే ఎక్కువ . కొంత మంది ప్రముఖుల పిల్లల పేర్లు తొలగించారు అని ప్రచారం జరుగుతోంది . వీరు ఇచ్చిన లిస్ట్ లో ఎక్కువ మంది 25 – 32 వయసు వారు . టీన్ ఏజ్ గ్రూప్ కాదు .
మాదక ద్రవ్యాలు తీసుకొన్న వారికి శిక్ష పడుతుందా ?
ఇంకా పడడం ఏంటి ? పడి పోయింది కదా !
అదేంటి అనుకొంటున్నారా ?
పోలీసులు, పేర్లు , తండ్రి పేరు, ఏజ్, అడ్రెస్స్, సెల్ ఫోన్ నంబర్స్ తో లిస్ట్ బయట పెట్టారు. అది ముందుకుగా ఒకరికి .. తరువాత ఇంకొకరికి .. మీడియా కు .. వాట్సాప్ ఏజ్ లో రేపటికల్లా దేశం అంతా పాకి పోతుంది .

“ఏంటి మీ వాడు ఫలానా పబ్ లో దొరికాదంట కదా ? డ్రగ్స్ తీసుకొన్నాడంట కదా ? అయ్యో .. జైలు శిక్ష పడుతుందేమో” .. ఇలా రాబొయ్యే నెల రోజులు వారికి మీడియా .. బంధువులు .. తెలిసిన వారు .. తెలియని వారు .. పరామర్శ .. విమర్శ.. సానుభూతి .. చీత్కారం .. ఇది చాలు కదా… శిక్ష . అక్కడ వెళ్లి మాదక ద్రవ్యాలు తీసుకున్నవారు ఎవరో .. తీసుకోని వారు ఎవరో కానీ .. లిస్ట్ వచ్చేసింది . మీడియా శోధన. విమర్శలు . సమాజంలో చిన్న చూపు .. పరువు పోయింది
ఆ తల్లి తండ్రులకు ఇక కొన్ని వారాల పాటు నిద్ర వుండదు . కోర్ట్ లు ఇంత బలమైన శిక్ష విధించగలుగుతాయా ?
చివరిగా ఒక మాట !
పిల్లల్ని వారి బతుకు బతకనివ్వాలి .
వారి తరపున తల్లితండ్రి కస్టపడి అలివిగాని ఆస్తులు సంపాదిస్తే వారికి లైఫ్ లో ఛాలెంజ్ ఏమి ఉంటుంది? సంపాదించాల్సిన అవసరం ఏముంటుంది ?
కష్టపడడం .. మంచి పేరు… డబ్బు సంపాదించడం .. దీనికి మించిన థ్రిల్ లైఫ్ లో ఏదీ ఉండదు .
పిల్లలకు ఆ థ్రిల్ ను దూరం చేసి రాబొయ్యే పది తరాలకు సరిపడా నువ్వే సంపాదిస్తే నీ వారసులు పబ్ లో చెమటలు కారుస్తారు . కొకెయిన్ లో థ్రిల్ వెతుక్కొంటారు . ఆరోగ్యం .. ఆనందం .. పరువు , మర్యాద… అన్నీ మూసి నది మురికి నీటిలో కలిసిపోతాయి పాలు ఇదే నేటి గబ్బు నిజం .

– అమర్నాథ్ వాసిరెడ్డి