రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో మంత్రికి విజయసాయి రెడ్డి ప్రశ్న
న్యూఢిల్లీ, జూలై 31: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద వచ్చే ఫిర్యాదులపై దర్యాప్తు జరిపేందుకు, సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అయితే బాధిత మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిందనో లేదా ఫిర్యాదు దురుద్దేశంతో కూడుకున్నదనో అంతర్గత కమిటీ నిర్ధారిస్తే సంబంధిత మహిళపై చర్యలకు సిఫార్సు చేసే అధికారం కమిటీకి ఉంటుంది.
ఫిర్యాదు చేసిన వారినే శిక్షించే వెసులుబాటు కల్పించిన కారణంగా ఈ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి బాధిత మహిళలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతోందో చెప్పాలని రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఎంఎస్ఎంఈ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మను ప్రశ్నించారు. దీనికి మంత్రి జావాబిస్తూ లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాలలో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన మీదటే వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.