– ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.541.68 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం చేశారన్నారు. పంట పొలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు.
ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు నగదు జమ పడేది అని ఎదురుచూపులు చూసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ధాన్యం కొనుగోలుపై పటిష్ట ప్రణాళిక అమలు చేసిందన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు అకౌంట్లోకి జమ అవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఇది కూటమి ప్రభుత్వం – మంచి ప్రభుత్వం
ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 గంటల నుంచి 48 గంటల్లో నగదు జమ చేసే విధానం అమలులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పు, పశ్చిమ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 741 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 31489 మంది రైతుల నుంచి 2,35,410.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు రూ.541.68 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో రూ. 516.21 కోట్లు చెల్లింపు చేయడం జరిగిందన్నారు. 24 గంటల్లోపు రూ.501.34 కోట్లు రైతులు ఖాతాలో జమ చేశామని, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసిన నగదు మొత్తం రూ. 14.87 కోట్లు అని తెలిపారు.
ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా ప్రభుత్వం వాట్సాప్ చార్ట్‌బోర్డ్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక వాయిస్ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.