– క్షత్రియ వర్గానికి ఎట్టకేలకూ న్యాయం
– క్యాబినెట్‌లో క్షత్రియులకు దక్కని చోటు
– డిప్యూటీ స్పీకర్‌తో భర్తీ చేసిన బాబు
– రాజు మాటల ప్రవాహానికి ఇక బ్రేకులు
– ఇప్పుడైనా ఐపిఎస్ సునీల్‌పై చర్యలు తీసుకుంటారా?
– చర్యలు తీసుకోకపోతే సర్కారు అభాసుపాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో నాలుగేళ్లు అవిశ్రాంతంగా వైసీపీ సర్కారుపై పోరాడి.. జగన్‌కు వ్యతిరేకంగా గజ్జెకట్టి తిరిగిన అప్పటి ఎంపి, ఇప్పటి ఉండి టీడీపీ ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. నిజానికి ఇది ఆయన ఊహించని పదవి. మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశించిన ఆయనకు డిప్యూటీ స్పీకర్ లభించింది. రాజకీయాలు అలాగే ఉంటాయి.
జగన్ సర్కారుపై పోరాడేందుకు వణికిపోయిన నాటి రోజుల్లో.. ఆయనపై ప్రత్యక్ష యుద్ధం చేసిన ఏకైక నాయకుడు రఘురామరాజు. ఆయన గళం విప్పి, హైకోర్టు-సుప్రీంకోర్టులో న్యాయపోరాటాలు, ప్రధాని, హోంమంత్రి, ఆర్ధిక మంత్రికి జగన్ సర్కారు అవినీతిపై ఫిర్యాదుల వర్షం కురిపించిన తర్వాతనే.. టీడీపీ-జనసేన పోరాటం ప్రారంభం కావటం ప్రస్తావనార్హం.
చివరకు సీఐడీ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిని, నరకపు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన రఘురామరాజుకు, దేశ విదేశాల్లో లెక్కలేనంతమంది అభిమానులు తోడయ్యారు. దానితో ఆయన సెలబ్రిటీ లెజండరీగా మారారు. ఆయనను ఆ స్థాయికి చేర్చేందుకు రఘురామరాజు ‘రచ్చబండ’ దోహదపడింది.
నిజానికి ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడుగురు క్షత్రియ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దానితో క్షత్రియ కోటాలో రఘరామరాజును మంత్రిపదవి వ రిస్తుందని, ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. అది రాకపోవడంతో, స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ‘జగన్ సభలో లేచి నిలబడితే.. మాట్లాడింది చాల్లే ఇక కూర్చో’మని జగన్‌ను ర్యాగింగ్ చేస్తారన్న విచిత్ర చర్చ కూడా సోషల్‌మీడియాలో జరిగింది.
అది కూడా రాకపోవడంతో.. ఒకసారి టీటీడీ చైర్మన్, మరోసారి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఇస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి, సీఎం చంద్రబాబునాయుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. క్షత్రియులను క్యాబినెట్‌లో తీసుకునే అవకాశం లేకపోవడంతో, దానిని ఈరకంగా భర్తీ చేయడం ద్వారా ఆ వర్గాన్ని సంతృప్తిపరిచినట్టయింది.
కాగా ఐదేళ్ల నుంచి తన రచ్చబండ తోపాటు.. మీడియా ఇంటర్వ్యూలలో చెలరేగిపోతున్న రఘురామరాజు మాటల ప్రవాహానికి, డిప్యూటీ స్పీకర్ పదవి ఆనకట్ట వేసినట్టయింది. తన అభిప్రాయాలను నేరుగా, సూటిగా, లౌక్యంగా, ఎవరికి తగలాలో వారికే తగిలేలా మాట్లాడే రఘురామరాజు.. ఇకపై అంత స్వేచ్ఛగా పెదవి విప్పే అవకాశం ఉండదు. సో.. ఇక ఫైర్ బ్రాండ్ రఘురామకృష్ణంరాజును.. కేవలం డిప్యూటీ స్పీకర్‌గానే చూడాలన్నమాట. మళ్లీ క్యాబినెట్ విస్తరణ వరకూ ఆయనలా ‘ఉండి’పోతారన్నమాట.
ఇక జగన్ జమానాలో రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన.. ఐపిఎస్ అధికారి పివి సునీల్‌పై చర్యలు తీసుకోకపోవడం, చాలాకాలం నుంచి విమర్శలకు గురవుతోంది. స్వయంగా రాజు సైతం అనేక చానెళ్ల ఇంటర్వ్యూలలో తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ప్రభుత్వం సునీల్‌ను ఇప్పటిదాకా ఎందుకు సస్పెండ్ చేయడం లేదని.. ఆయన కులాన్ని చూసి భయపడుతోందా? అంటూ రాజు సూటిగా ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు.
ఇప్పుడు ఐపిఎస్ అధికారి సునీల్‌పై ఫిర్యాదుదారైన రఘురామరాజు, కీలకమైన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. మరి ఇప్పుడైనా ఆయన ఫిర్యాదు చే సిన సునీల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందా లేదా? అన్న కొత్త అంశానికి తెరలేచింది. ఒకవేళ సునీల్‌పై చర్య తీసుకోకపోతే.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుకే విలువ లేదన్న తప్పుడు సంకేతాలతో, ప్రభుత్వం అప్రతిష్ఠ మూటకట్టుకునే ప్రమాదం ఉంది. సునీల్‌పై చర్యలు తీసుకుంటేనే, డిప్యూటీ స్పీకర్ విలువను ప్రభుత్వం కాపాడినట్టవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నర్సాపురం నియోజకవర్గానికి పదవుల పండగ
కాగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని కూటమి నాయకులను వరసగా పదవులు వరిస్తున్నాయి. నర్సాపురం ఎంపి శ్రీనివాసవర్మ కేంద్రమంత్రిగా ఉండగా, నర్సాపురం నియోజకవర్గానికే చెందిన ఎంఏ షరీఫ్ ప్రభుత్వ సలహాదారుగా, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు ఏపీఐసీసీ చైర్మన్‌గా, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి వరించడం విశేషం.