నల్గొండకు జానా రెడ్డి గారి అబ్బాయి!

-ఒకే ఒక్కడు రఘువీర్
– నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ ఖరారు
– పటేల్ కు నచ్చజెప్పిన సీఎం
-రఘువీర్ కు ఓకే చెప్పిన మంత్రులు

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, హుజూర్నగర్ కు చెందిన నాగన్న, నర్సిరెడ్డి పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కానీ టికెట్ కోసం ప్రధానంగా పోటీ జానారెడ్డి తో పాటు తనయుడు రఘువీర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి మధ్య నెలకొంది ఇదిలా ఉంటే పటేల్, రఘువీర్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. దీంతో పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం తప్పకుండా కల్పిస్తానని రేవంత్ రెడ్డి, జానారెడ్డి హామీ ఇచ్చి నచ్చ చెప్పినట్లు సమాచారం. హామీ పట్ల సంతృప్తి చెందిన రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డి కె టికెట్ కేటాయించాలని పార్టీకి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా రఘువీర్ పేరును ప్రతిపాదన చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జానారెడ్డి, రఘువీర్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ మిర్యాలగూడ దేవరకొండ నియోజకవర్గాలలో కుందూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు పరిధిలో రఘువీర్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

2014 నుంచి టికెట్ ఆశిస్తున్న రఘువీర్
కుందూరు రఘువీర్ రెడ్డి 2014 నుంచి మిర్యాలగూడ శాసనసభ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు 2014లో నల్లమోతు భాస్కరరావు కు, 2018 లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు టికెట్ కేటాయించడంతో అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేశారు.

గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ బి ఎల్ ఆర్ కు టికెట్ కేటాయించడంతో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఆయన గెలుపుకు పనిచేయడంతో పాటు ఆర్థికంగా కూడా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలకు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే.

గెలుపు కూడా ఖాయమే
నల్గొండ పార్లమెంటు పరిధిలో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తప్ప , మిగతా ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.. మూడున్నర లక్షల మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాకుండా ఈ పార్లమెంటు పరిధిలోనే ఇద్దరు మంత్రులు ఉండడం కూడా గెలుపు అత్యంత సునాయసమని చెప్పొచ్చు.

Leave a Reply