– జంతువధ కారకులపై కేసులు పెట్టాలి
– టూల్ కిట్ సాయంతో ఎదురుదాడి
– రేవంత్ విఫల సీఎం
– కాబట్టే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం
– రేవంత్ రెడ్డి కాంగ్రెస్ – బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి
– చంద్రబాబు కోసమే ఆదిత్యనాథ్‌ను నియమించారా?
– జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
– టీడీపీ తర్వాత బీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీ
– డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల తెలంగాణపై ప్రభావం
– కేటీఆర్ మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్
హైదరాబాద్: రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు కేసులెలా పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో మేం లేము. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.
కేసుల ఉపసంహరణ సరిపోదు.. జంతువధ కారకులపై కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేయిస్తున్నారు. భారీగా ఖర్చు చేసి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడికి పాల్పడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు అసాధ్యమనే కాంగ్రెస్ దీక్షకు రాహుల్ గాంధీ వెళ్లలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు.
రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరు చెప్పులు మోస్తే.. ఇంకొకరు బ్యాగులను మోస్తున్నారు. 16, 17 నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు. మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు. రేవంత్ విఫల సీఎం కాబట్టే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటుంది.
నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని రేవంత్ ఆలోచిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వెనుక వేల కోట్ల బాగోతం ఉంది. కంచ గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. వేల కోట్ల రూపాయాల బాగోతం 2,3 రోజుల్లో చెబుతా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి. దేశంలోని పవర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ నంబర్ వన్‌గా ఉండాలి అని కేటీఆర్ అన్నారు.
గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడి జలదోపిడీ జరుగుతోంది. భూకంపం, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కు చెదరలేదు. కేసీఆర్‌పై కోపంతో నీళ్లు వదిలేశారు.. పంటలు ఎండుతున్నాయి. ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా పెట్టుకున్నారు.
ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీ తరపున వాదించారు. ఆదిత్యనాథ్ దాస్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా? ఏపీ, చంద్రబాబు కోసమే ఆదిత్యనాథ్‌ను నియమించారా? కృష్ణాలో అన్ని జలాశయాలు నిండాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావం తెలంగాణలోని ఫార్మా, ఐటీ రంగాల ఎగుమతులపై ఉంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం మినహా, మిగిలిన ఆదాయం అంతా తగ్గిపోయిందని పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకుంటోందని కేటీఆర్ అన్నారు. హన్మకొండలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే, 3 వేల ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ చరిత్రలో రజతోత్సవ సభ అతిపెద్దదిగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడతామని కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెల వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.