– 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో రెండు పేలుళ్లు
– దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలగా, అక్కడికి 150 మీటర్ల దూరంలో మరో పేలుళ్లు సంభవించింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి ఈ దాడికి పాల్పడ్డారు.
దీంతో 18 మంది మరణించగా, మరో 130 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ భత్కల్ ను ప్రధాన నిందితుడిగా తేల్చింది. మరో ఐదుగురు ఉగ్రవాదులకు ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించి వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టింది.
సుదీర్ఘ విచారణ తర్వాత నిందితులు ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.