Suryaa.co.in

Andhra Pradesh

నాలుగేళ్లు ఎక్కడ నిద్రపోయావు తల్లీ ?

-జగనన్న బాణం షర్మిలకి ఇప్పుడు నిజాలు తెలిశాయా?
-ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో?
-నాలుగేళ్లు అన్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే గొంతు పెగల్లేదే?
-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్

డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి నప్పుడు రాజన్న కూతురి స్వరం ఎందుకు మూగబోయింది? రాష్ట్రంలో మద్యం పేరుతో జగనన్న మారణ హోమం చేస్తుంటే ఎందుకు పెదవి విప్పలేదు?

యుద్ధభూమిలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే.. మగాళ్లు ఎక్కువ మంది చనిపోతున్నారని బిజెపి చీఫ్ పురందేశ్వరి గారు నిలదీసినప్పుడు మీ చెవులకి ఆ ఆర్తనాదం వినిపించలేదా? ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో?

బీజేపీ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంది.. నాలుగున్నర ఏళ్లు కోమాలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట కాదా?

అన్న రాష్ట్రాన్ని అప్పుల ఊభి లోకి కూరుకు పోయేలా చేస్తుంటే ఏనాడైనా రాష్ట్ర ప్రజల కోసం పెదవి విప్పావా తల్లీ? బిజెపి చీఫ్ పురందేశ్వరి గారు గుండెలదిరేలా.. వాగ్బాణాలు విసురుతుంటే ఏనాడైనా సంఘీభావం తెలియజేసావా రాజన్న కూతురా?

తెలంగాణ పోలీసులు నిన్ను క్రేన్ మీద ఎత్తుకు పోతుంటే ఇప్పుడు రాజకీయ ఆశ్రమం ఇచ్చిన నీ రాహుల్ బాబా.. అప్పుడు ఏం చేసినట్టు? ఎందుకు నీకు మద్దతు తెలుపలేదు..? సాక్షాత్తు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఇచ్చిన మద్దతుకి కృతజ్ఞతలు తెలిపిన నోరు ఇదేనా?

ప్రత్యేక హోదా సాధ్యం కాదు కాబట్టి.. దానికి సరి సమానమైన ప్యాకేజీ ప్రకటిస్తే..నాడు మద్దతు తెలిపిన చంద్రబాబు కానీ.. పాతిక సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న మీ జగనన్న గాని పొద్దు తిరుగుడు పువ్వుల్లా మారారు తప్ప.. బీజేపీ మొదటి నుంచి ఒకే స్టాండ్లో వుంది భారతీయ జనతా పార్టీ కాదా?

సొంత చిన్నాయాన్ని నీ కుటుంబ సభ్యులే మర్డర్ చేస్తే.. ఏనాడైనా పెదవి విప్పి మాట్లాడావా? అన్న అవినీతిలో వాటాలు అడిగావు తప్ప.. ఎప్పుడైనా సరే అన్న అవినీతి గురించి మాట్లాడావా? నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం నడుస్తుంది అని చెప్పిన నువ్వు సడన్ గా పొద్దుతిరుగుడు పువ్వులా దిశ మార్చు కున్నావు తప్పా..బీజేపీ ఎప్పుడూ ఒకేలా వ్యవహారిస్తుంది బంగారు తల్లీ..

బిజెపి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది తప్ప జగనన్నలా లూటీ చేయడం కోసం కాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అప్పనంగా లూటీ చేసిన మీరు బిజే పిని విమర్శించడానికి అర్హులేనా?

అమరావతి మహిళల డొక్కల పై బూట్ కాళ్ళు పడుతుంటే మీలో స్త్రీత్వం ఎప్పుడైనా స్పందించిందా? అమరావతి రైతులను సందర్శించి ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా ? ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ అవుతుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా?

దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎప్పుడైనా మీ గుండె కదిలిందా? బిజెపి సిద్ధాంతం మీద బతికే పార్టీ. రాజకీయ అవకాశాల కోసం అడ్డమైన గడ్డి తినే పార్టీ కాదు గుర్తుంచుకోండి.

LEAVE A RESPONSE