Suryaa.co.in

Andhra Pradesh

కష్టపడేవారికి బీజేపీలోనే గుర్తింపు

– కన్నాను అభినందించిన బీజేపీ జాతీయ నేత సత్య
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ జాతీయ కార్యద ర్శి సత్యకుమార్ అభినందించారు. గుంటూరులో వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయిన సత్య, మాజీ మంత్రి కన్నా నివాసానికి వెళ్లి, ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనడానికి, కన్నా నియామకమే నిదర్శనమన్నారు. దీనిని ప్రతి ఒక్క నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఇది పదవి అని కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ అందరి లక్ష్యమని, దానికోసం కలసిపనిచేస్తామన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పురందేశ్వరి, సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్లతో కలసి రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నద్దా, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి మోదీకే సాధ్యం: సత్య
దేశంలో అభివృద్ధి ఒక్క ప్రధాని మోదీకే సాధ్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. గుంటూరులో హిందూ ఫార్మసీకాలేజీలో ఏర్పాటుచేసిన సేవ-సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, మోదీ జీవిత చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. దానిని సందర్శించిన అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశం కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్-దానికి మద్దతునిచ్చే పార్టీలు వారి కుటుంబాల కోసం పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. దేశప్రజలు సరిహద్దు సమస్యలను మోదీకి వదిలి, సుఖంగా నిద్రపోతున్నారంటే మోదీ పాలనదక్షత ఎలాంటిదో అర్ధం చేసుకోవాలన్నారు. మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత ఈ దేశంలో అన్ని రంగాల్లో వచ్చిన మార్పులను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కార్యకర్తలు ముందుండాలన్నారు. ప్రజలు బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చారంటే , సమస్యల పరిష్కారం బీజేపీకే సాధ్యమన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

LEAVE A RESPONSE