పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు

ఎస్సైకి గాయాలు

కటగిరి: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్సై నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం ఇచ్చారు..
వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు డక్కిలి పోలీసులు బయల్దేరి స్మగ్లర్లను అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు ఛేజింగ్‌తో వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్లు తమ కారుతో పోలీసు వాహనంపైకి దూసుకెళ్లి ఢీకొట్టారు. అనంతరం దుండగులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సైకు ముఖంపై గాయాలయ్యాయి. వెంకటగిరిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply