Suryaa.co.in

National

కేటీఆర్ పై కేసు నమోదు పాలనలో భాగం

– శాఖా పరమైన విచారణ జరుగుతోంది
– విద్యా రంగానికి 25 వేల కోట్లు కేటాయించాము
– విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం
– కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం
– విధాన పరమైన అంశాలపై పోరాటం ఉంటుంది
– చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

చెన్నై: ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారము లో రాజకీయ పార్టీగా మేము చేసింది ఏమీ లేదు. ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చాయి, నాటి మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు శాఖ పరమైన విచారణ జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైనా విచారణ సంస్థల ముందుకు వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
మంగళవారం చెన్నైలో ఓ ప్రముఖ సంస్థ విద్యా రంగంపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది, గ్లోబలైజేషన్ తో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రచారం చేసేందుకు గాంధీజీ యంగ్ ఇండియా పత్రికను స్థాపించారు దాని స్ఫూర్తిగా మేము యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ఈ పాఠశాలలో అడ్మిషన్స్ ఇస్తామని అన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు వందల కోట్ల వ్యయంతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నాం అన్నారు. టీచింగ్ స్టాఫ్ మొత్తం పాఠశాలలో ఉండే లా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం, క్రికెట్, ఫుట్బాల్ భారీ క్రీడా మైదానాలు ఈ పాఠశాలలో ఉంటాయని తెలిపారు.

రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏదో కోల్పోయామనే ఆవేదన చెందొద్దని మా ముఖ్యమంత్రి తన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి సినిమా ప్రదర్శించేందుకు థియేటర్ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్, బెస్ట్ డైట్ ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మూలంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో చేరారని తెలిపారు. లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని బయటికి వస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ వారి వద్ద లేకపోవడంతో ఉపాధి లభించడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ని స్థాపించింది, దానికి చైర్మన్ గా మల్టీ నేషనల్ కంపెనీ ఆనంద్ మహేంద్రా లాంటి వారినీ చైర్మన్గా నియమించింది అని తెలిపారు.

పురాతన కాలం నుంచి ఉన్న ఐటిఐలు పాత లేత్ మిషన్స్ తో ఉన్నాయి. వాటిని మారిన కంప్యూటర్ యుగానికి అనుగుణంగా రాష్ట్రంలోని సుమారు 65 ఐటిఐ లను అప్ గ్రేడ్ చేశాం అన్నారు. ప్రాపర్ స్కిల్స్ నేర్పడానికి వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చాం అని తెలిపారు.

విద్య పెట్టుబడితో గొప్ప మానవ వనరులను ఉత్పత్తి చేయవచ్చు.. తద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. మా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈ ఆర్థిక సంవత్సరం 21 వేల కోట్లు కేటాయించింది, అవి సరిపోవు రాబోయే రోజుల్లో వాటిని పెంచాలి అని నిర్ణయించాం అన్నారు. 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

గత పది సంవత్సరాలు పాలించిన వారు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు. మేము అధికారంలోకి రాగానే హాస్టల్ విద్యార్థుల డైట్ కాస్మోటిక్ ఛార్జీల పరిస్థితిపై సమీక్షించి 40 శాతం డైట్ చార్జీలు, 25% కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. సీనియర్ అధికారులు హాస్టళ్లను విసిట్ చేయాలని, అక్కడే ఒక రాత్రి బస చేయాలని, మహిళా అధికారులు విద్యార్థినిల వసతి గృహాల్లో వస చేయాలని ఆదేశాలు జారీ చేశాము. మంత్రులు కూడా ఒక సదుద్దేశంతో హాస్టలను విజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అమలు చేస్తున్నామని తెలిపారు.

విద్యను బలోపేతం చేయడంలో భాగంగా మేము అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు పెంచాం, కొత్తగా డీఎస్సీ నిర్వహించి 6వేల టీచర్లను నియమించాం, 35 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు నిర్వహించాము అని తెలిపారు. మేము అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం.
రాష్ట్రంలో మాకు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనిపించడం లేదు, ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేదు అన్ని పార్టీలు ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. బావ స్వేచ్ఛపై మా ప్రభుత్వానికి విశ్వాసం ఉంది ఆయా పార్టీలు వారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఇచ్చామని వివరించారు.

ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగంపై అచంచల విశ్వాసం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో బలమైన సంబంధాలు ఉండాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం గా మేము కోరుకుంటున్నాము .. అయితే విధానపరమైన అంశాలపై ఎప్పటికీ పోరాడుతామని డిప్యూటీ సీఎం తెలిపారు.

మాది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.. నెహ్రూ ఆర్థిక విధానమే మా విధానం అని డిప్యూటీ సీఎం తెలిపారు. మౌలిక వసతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయలేం, అవి లేకుండా సంపదను సృష్టించడం సాధ్యం కాదు… సంపద లేకపోతే సంక్షేమం సాధ్యం కాదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మిశ్రమ ఆర్థిక విధానంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ ఐటి, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్డు వంటి బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వీటికి అదనంగా ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, ఓ ఆర్ ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ క్లస్టర్లు నిర్మించి రాష్ట్ర సంపాదన పెంచి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దేశంలో తలసరి ఆదాయాన్ని లెక్కించే విధానం సరిగా లేదని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే మేము రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం అందుకు తగిన విధంగా రాష్ట్ర సంపదను అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు.

LEAVE A RESPONSE