ఆ దేవాలయాలను ప్రభుత్వ చెర నుంచి విడిపించండి

– కోర్టు తీర్పుపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం

రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని రూ.5 (అయిదు) లక్షల లోపు వార్షిక ఆదాయం మాత్రమే ఉన్న హిందూ దేవాలయాలన్నిటినీ ఆయా’ ఆలయాల అర్చకులకే అప్పగించాలనీ, వాటి పాలన బాధ్యతలనుంచి దేవాదాయ శాఖ తప్పుకోవాలని, ఏపి హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.

విదేశీ పాలనకు ముందు మన దేశంలో హైందవ ధర్మం, దేవాలయం కేంద్రంగానే కొనసాగిందని గుర్తు చేసిన సోము వీర్రాజు, ఈ తీర్పు వలన,రాష్ట్రంలో కొన్ని దేవాలయాలలోనైనా అర్చకులు, పురోహితుల నిర్వహణతో ఆయా ఆలయాలకు, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకూ పూర్వపు మహర్దశ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక తీర్పును రాష్ట్ర బిజెపి స్వాగతిస్తోందన్నారు.

హైందవ సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు దేవాలయాలు వేదికలుగా, అర్చకులు సమన్వయకర్తలుగా పనిచేయడం ద్వారా మాత్రమే, మన ధర్మాన్ని మనం రక్షించుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఇతర మతాల ప్రార్ధనామందిరాలపై, ఆస్తులపై లేని ప్రభుత్వ పెత్తనం ! హిందూ దేవాలయాలు, ఆస్థులపైనే ఎందుకూ అంటూ ప్రశ్నించారు ?

ఈ అంశంపై బిజెపి వాదనకు బలం కలిగేలా వచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో అన్ని ఆలయాల విముక్తికి నాంది కావాలని సోము వీర్రాజు అకాక్షించారు. దేవాలయాల నిర్వహణ,నిత్య దీప దూప నైవేద్యాల విషయంలో 1987 సం.లో నాటి ప్రభుత్వం చేసిన చట్టం తర్వాత చిన్న,చిన్న దేవాలయాలు ఆలనా పాలన లేకుండా, ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి గురిఅయ్యాయని గుర్తు చేస్తూ, ఇందువల్ల గ్రామాల్లో అన్యమత విస్తరణకు, ప్రచారానికి దోహదం చేసిందన్నారు.

దేవాదాయ అధికారుల జీతభత్యాలు,చిన్న దేవాలయాల నిర్వహణకు గుదిబండగా మారాయని, న్యాయస్థానం తీర్పుతో వీటిని ఇప్పటికైనా ప్రభుత్వ చెర నుండి విడిపించాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇంకా తాత్సారం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రహస్య /పరోక్ష ఏజండా పనిచేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.