అంబేడ్కర్ స్పూర్తితో బి.సి జనగణన కోసం పోరు చేయాలి
ప్రపంచమంతా వర్గ అసమానతలు ఉంటే ఇండియాలో వర్గ అసమానతలతో పాటు కుల అసమానతలు కూడా ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ఇండియాలో కుల అసమానతల ద్వారానే వర్గ అసమానతలు నిర్మితమైనాయి. మన దేశం కన్నా ఘోరమైన అసమానతలు, అణచివేత, బానిసత్వం ఉన్న దేశాలు కూడా ఆ బానిసత్వం నుండి విముక్తి చెందాయి. కానీ మన దేశంలో బానిసత్వం నుండి ఇప్పటికి విముక్తి దొరకడం లేదు. మన దేశ బానిసత్వములో కులం ఇమిడి ఉందని ఆ కుల నిర్మూలన జరగకుండా బానిసత్వం పోదని సూత్రీకరించిన కొద్ది మంది మహానుబావుల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒకరు.
ప్రపంచ జ్ఞానిగా ప్రసిద్ధి గాంచిన అంబేడ్కర్ ను నేడు కొన్ని వర్గాలకు పరిమతం చేస్తూ చూడడం అవగాహన రాహిత్యమే కాక బాధాకరమైన సందర్భంలో ఆ మాహానుభావుడి 65 వ వర్ధంతిని దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మెజారిటీ దేశ ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడంవల్లనే నేడు అంబేడ్కర్ కొన్ని వర్గాల ప్రతినిధిగా చూడబడుతున్నాడు. అంబేడ్కర్ అంటే రాజ్యాంగం రాసాడు, వీధి దీపాల క్రింద కూర్చొని చదువుకున్నాడు, పాఠశాలలో అంటరానితనంతో అవమానించబడ్డాడు, రాజ్యాంగములో దళిత గిరిజనులకు విద్య, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాడని మాత్రమే చాలా మందికి తెలుసు.
అంబేడ్కర్ అంటే అందరివాడు అనే విషయం ఆ మాహానుభావుడు దేశంలోని వివిధ వర్గాల విముక్తి కోసం చేసిన పోరాటం గురుంచి క్షుణ్ణంగా తెలుసుకుంటే మాత్రమే అర్ధమవుతుంది. బ్రాహ్మణీయ అగ్రవర్ణాల వారు స్వాతంత్ర్య పోరాటంలో తల మునకలైన వేళ అంబేడ్కర్ మాత్రం దేశంలోని మెజారిటి ప్రజల విముక్తి కోసం పోరాటం కొనసాగించారు. స్వాతంత్రం పూర్వం దేశంలోని బహుజన ప్రజల హక్కుల కోసం, అంటరానితనం నిర్మూలన, కుల నిర్మూలన కోసం పోరాటం చేసాడు. స్వాతంత్ర పోరాటం కన్నా మా ప్రజల హక్కులే ముఖ్యమని బ్రిటిష్ వారితో వాదించి ఎన్నో హక్కులు సాధించాడు. స్వాతంత్ర పోరాటంలో బహుజన ప్రజలు కలిసి రావాలంటే స్వాతంత్రం వస్తే బహుజన ప్రజలకు ఒరిగేదేంటి, ఒనగూరే హక్కులేంటని స్వాతంత్ర ఉద్యమంలో ముందున్న గాంధీ, నెహ్రు, వల్లబాయి పటేల్ ను నిలదీసి ఎన్నో హక్కులను సాధించిన అంబేడ్కర్ అన్ని వర్గాల వారని గమనించాలి.
ఓటు హక్కు ప్రదాత
ఆ కాలంలో అందరికి ఓటు హక్కు ఉండేది కాదు ప్రభుత్వానికి పన్ను చెల్లించే వాల్లు, మెట్రుకలేషన్(10 వ తరగతి) చదివిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. మనుధర్మ శాస్త్రం ప్రకారం వేల ఏండ్ల నుండి విద్య కు దూరమైన బహుజన ప్రజలకు, స్త్రీలకు ఓటు హక్కు లేని ఆ కాలంలో దేశంలో ప్రతి మనిషికి ఒకటే విలువ ఉండాలని అందరికి ఓటు హక్కు కల్పించాలని(వన్ మాన్ వన్ వాల్యూ) బ్రిటిష్ వారితో పోరాడి అందరికి ఓటు హక్కు కల్పించి అంబేడ్కర్ అందరివాడయ్యాడు. యుద్ధాలలో నెత్తురు పారించి సాధించే విజయానికన్నా ఎలాంటి నష్టం లేకుండా ఓటుతో ఎక్కువ విజయాలను సాధించవచ్చని, తరతరాలుగా అణచివేయబడ్డ బహుజన వర్గాల విముక్తి ఓటు హక్కుతోనే సాధ్యమని తెలియజెప్పిన అంబేడ్కర్ ఆలోచన నేడు పలితాలనిస్తుంది. ఓటు ఎంతటి విలువైనదో, ఎంతటి బలమైన ఆయుధమో ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో తేటతెల్లమైంది. డబ్బుతో, అధికార బలంతో, ప్రలోబాలతో ఓటర్లను కొనవచ్చునని విచ్చలవిడిగా, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన కెసిఆర్ ను రహస్య ఓటు ద్వారా నెత్తురు చిమ్మకుండా ప్రజలు ఓడించారు. కెసిఆర్ లాంటి తీవ్రవాద రాజకీయాలు చేస్తున్న నాయకులను, పార్టీలను ప్రత్యక్షంగా ఎదుర్కోలేని బలహీన వర్గాల ప్రజలకు అంబేడ్కర్ కల్పించిన ఓటు ఆయుధమే అండగా నిలుస్తుంది.
డబ్బుకన్నా, ప్రలోభ పథకాల కన్నా జ్ఞానమే ముఖ్యం
మహాత్మ జ్యోతిబా పూలే చనిపోయిన ఏడాది తర్వాత జన్మించిన అంబేడ్కర్ పూలే తన గురువని ప్రకటించుకొని పూలే చూపిన బాటలో బహుజనుల, స్త్రీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసారు. బహుజన ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్ పోరాటం చూసిన బ్రిటీష్ వారు అంబేడ్కర్ ను పిలిచి ఎన్ని వేల కోట్లు ఇస్తే మీ బహుజన ప్రజలు బాగుపడుతారో చెప్పండి మంజూరు చేస్తామని అన్నారు. అందుకు బదులుగా అంబేడ్కర్ మాట్లాడుతూ మా అమాయక ప్రజలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చిన నాలుగేండ్లలో తినిపెడతారు. నేను చదువుకొని, సమాజాన్ని చదివి జ్ఞానవంతుణ్ణి అయి ప్రశ్నించడం వల్లనే మీరు ఇలా అడుగుతున్నారు కదా నా లాగా 50 మందిని మీ లండన్ కు పంపించి జ్ఞానవంతుల్ని చేయండి వారు నా బహుజన ప్రజలను ఇంకా చైతన్యం చేస్తారని చెప్పి 50 మందిని లండన్ లో చదివే విధంగా చేయడంవల్లనే అందులో ఒకరైన కె ఆర్ నారాయణన్ స్వాతంత్రానంతరం మన దేశానికి రాష్ట్రపతి అయ్యారనే విషయం చాలా మందికి తెలియదు.
అంబేడ్కర్ స్ఫూర్తిగా బి.సి జనగణన కోసం పోరు చేయాలి
స్వాతంత్ర పోరాటం కన్నా మా శూద్ర ప్రజల హక్కులే మిన్న అంటూ బహుజన ప్రజలను ఒక్క తాటిపై తెచ్చిన అంబేడ్కర్ కు ఎదురుతిరిగిన వల్లబాయి పటేల్ నీవు దళితుడవు నీవు దళితుల గురుంచి మాత్రమే మాట్లాడాలి బి.సి ప్రజల గురుంచి నీవు మాట్లాడకూడదని బి.సి ప్రజలను అంబేడ్కర్ నుండి ఆనాడే దూరం చేశారు. బి.సి లు అంబేడ్కర్ కు దూరం కావడం వల్లనే బ్రిటిష్ కాలంలో సాధించిన చట్ట సభల్లో రిజర్వేషన్లు బి.సి లకు దక్కకుండా పోయినాయి. బి.సి లకు చట్ట సభల్లో, ఉన్నత విద్య, ఉద్యోగాల్లో హక్కులు లేకుండా చేసింది వల్లబాయి పటేల్ అనే విషయం బి.సి లకు తెలియనంత కాలం మూడు వేల కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి పటేల్ విగ్రహం పెట్టి ఉక్కు మనిషి అంటే బి.సి లు రోజు మొక్కే బానిసత్వములో ఉంటారు. ఇప్పడు బి సి లకు నిజమైన శత్రువులెవరో బి.సి లు తెలుసుకోవాలి.
దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయి
సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా కావాలని, ఓట్లు మావి సీట్లు మీవా? ప్రతి ఉత్పత్తిలో మేము, స్వాతంత్ర పోరాటం నుండి మొదలుకొని ప్రతి ఉద్యమంలో మేము అయినా మేమంటే లెక్క లేదా అంటూ బి.సి లు కదం తొక్కే సమయం ఆసన్నమైంది. అడవుల్లో సంచరించే పులుల లెక్కలు తేల్చే పాలకులు బి.సి ల లెక్కలు ఎందుకు తీయడం లేదని పోరాటానికి సిద్ధమవుతున్నారు. దేశంలో 60 శాతంగా ఉన్న బి.సి ల లెక్కలు బయటపడితే ఈ దోపిడి పాలకుల పునాదులు కదులుతాయని భయపడుతున్నారు. బి.సి ల జన గణన చేసిన చేయకున్నా ఎస్సి, ఎస్టీ లకు నష్టం ఏమి లేదు. రాజకీయ, సామాజిక రంగాల్లో వారి వాటా వారికున్నందున వారు బి.సి జనగణన పట్ల పెద్దగా పట్టించుకోవడం లేదు. బి.సి జనగణన వల్ల ఆధిపత్య కులాలు అక్రమంగా అనుభవించే అవకాశాలు మాత్రం పోతాయని బి.సి జనగణనకు ఆధిపత్య రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నారు.
తరతరాలుగా ఉత్పత్తిలో శ్రమలో పాల్గొని మానవాళి మనుగడకు, అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్న బి.సి లంటే లెక్కలేకుండా పోయింది. లెక్కలేని బి.సి ల ఓట్లు మాత్రం బి.సి లను లెక్క చేయని పాలకులకు కావాలా? లెక్క చేయని పాలవర్గాలకు బి.సి లు ఓట్లు వేయడం బి.సి ల తప్పే అవుతుంది. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి, మానవాళి మనుగడకు చమటోడ్చిన బి.సి లు అధికారానికి, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడమే కాకుండా జనగణన లేకుండా ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా దేశంలో జనగణన ఉద్యమంతోనే ఆత్మగౌరవ, రాజ్యాధికారం ఉద్యమం జరగాలి. పార్టీలకు, సంఘాలకు, రాష్టాలకు, ప్రాంతాలకు అతీతంగా జనగణన ఉద్యమం చేయాలి.
రాజ్యాధికారానికి రాజకీయ పార్టీ కావాలి
పీడిత అనగారిన వర్గాల ప్రజలు రాజ్యమేలిన నాడే బహుజనుల విముక్తి జరుగుతుందని బహుజన రాజ్య స్థాపన జరగాలంటే ఓటు హక్కు రాగానే సరిపోదని ఆ ఓటు ద్వారా మనం రాజ్యమేళాలని అందుకోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేరున ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేడ్కర్ ను బ్రాహ్మణీయ అగ్ర వర్ణాలు ఓడించారు. ముస్లింలు గెలిచిన సీటు నుండి ఒకరు రాజీనామా చేసి ముస్లింలు అంబేడ్కర్ ను పార్లమెంట్ కు పంపారు. ముస్లింలు ఈ దేశ మూలవాసులేనని శూద్రులకు ముస్లింలకు రక్త సంబంధాలున్నాయని చేసిన వాస్తవ బోధనలవల్లనే ముస్లింలు అంబేడ్కర్ కు దగ్గరయ్యారు. దళిత బహుజన ముస్లింల ఐక్యత కొనసాగితే స్వాతంత్రానంతరం అధికారం వారికే పోతుందని గమనించిన గాంధీ మూక కావాలనే జిన్నా ను ముందుకు తెచ్చి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ గా విభజించి బహుజన ముస్లింల ఐక్యత దెబ్బదీసి దేశానికి నేటికి ఆరని మంట చేశారు. రాజ్యాధికారమే మన మాస్టర్ కీ అని అంబేడ్కర్ బోధిస్తే మన బహుజన ప్రజలు మాత్రం ఆ మాస్టర్ కీ ని అగ్రవర్ణాల చేతికే ఇచ్చి పాలించమంటున్నారు. ఏ బానిసత్వం వీడమని అంబేడ్కర్ చెప్పాడో మనవాళ్ళు అదే బానిసత్వం కొనసాగిస్తూ ప్రజాస్వామిక బానిసత్వములో మునిగి దోపిడీ వర్గాలనే పాలకులుగా గెలిపిస్తున్నారు.
అంబేడ్కర్ ను మించిన త్యాగశీలి లేరు
త్యాగం మరింత త్యాగం…
పోరాటం మరింత పోరాటం…
అదొక్కటే మనల్ని విముక్తి చేస్తుందని అంబేడ్కర్ ఆచరణాత్మక ఉద్యమం చేసాడు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా దేశ పీడిత వర్గాల విముక్తి కోసం, అనగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడమే కాకుండా తన నలుగురు పిల్లలకు, భార్య కు సరైన ఆహారం లేక పౌష్టికాహార లోపంతో చనిపోయారు. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసి కూడా మూలవాసి ప్రజల విముక్తి కోసమే తన ప్రయాణం కొనసాగించి త్యాగధనుడయ్యాడు. హక్కులు, అధికారమే కాకుండా జీవన విధానం గూర్చి కూడా ఎంతో లోతుగా, బౌతికవాదిగా ఆలోచించిన అంబేడ్కర్ “నేను హిందువుగా పుట్టాను (పుట్టుక నా చేతిలో లేదు) కానీ హిందువుగా మరణించను” అని చెప్పి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం, సమానత్వం కలిగిన బౌద్ధ ధర్మాన్ని ఐదు లక్షల మందితో నాగపూర్ లో స్వీకరించడమే కాకుండా దేశ మూలవాసి ప్రజలంతా బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తేనే బహుజన ప్రజల బానిస సంకెళ్ళు తొలిగిపోతాయని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14 రోజు జయంతి వేడుకలు చేసుకునే అంబేడ్కర్ వాదులు ఆయన చూపిన జీవన మార్గం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన అక్టోబర్ 14 మాత్రం పెద్దగా పట్టించుకోనందునే బహుజన ప్రజలు మత బానిసత్వం నుండి బయటకు రాలేక పోతున్నారు.
మహిళల పక్షపాతి
దేశంలో సగబాగమైన మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ చట్టసభల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని హిందు కోడ్ బిల్లు పెడితే అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అందుకు నిరసనగా తన మంత్రి పదవికే రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు. అటవీ ప్రాంతాలకు పరిమితమైన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం కోసం అమాయకులైన వారి ప్రాంతాల్లో ఆదివాసేతరులు చొరబడకూడదని రాజ్యాంగములోని షెడ్యూల్ 5 ద్వారా ఎంతో రక్షణ కల్పించాడు. దేశంలో కుప్పలుగా వెలసిన అంబేడ్కర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అంబేడ్కర్ చూపిన పే బాక్ టు సొసైటీ అనే మార్గాన్ని పెద్దగా పట్టించుకున్నవారు కానరావడంలేదు. దళితులకే పరిమితమైన అంబేద్కర్ సంఘాలు ఇప్పటికైనా అంబేడ్కర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశాడని అందరివాడని గమనించి సంఘాలను అన్ని వర్గాల వారితో నిర్మాణం చేయాలి.
అంబేడ్కర్ చూపిన బౌద్ద ధర్మంతో పాటు జనవరి ఒకటిన శౌర్య దివాస్ ను, డిసెంబర్ 25 న మనుధర్మ శాస్త్ర దహన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అంబేడ్కర్ వాదులపై, బహుజన సంఘాలు, ఉద్యోగ సంఘాలపై ఉంది. జనవరి ఒకటిన బీమా కోరేగామ్ వద్ద మూలవాసి ప్రజలు పీష్వా బ్రాహ్మణ సైన్యాన్ని ఓడించిన రోజుగా బహుజన ప్రజలు శౌర్య దివాస్ జరుపుకోవాలి. దేశ మూలవాసులను అత్యంత హీనంగా చూసి, దారుణంగా అణచివేయడానికి కారణమైన మనుధర్మ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25 న అంబేడ్కర్ మొట్టమొదటి సారిగా తగలబెట్టిన స్పూర్తి కొనసాగించి ప్రతి సంవత్సరం బహుజన ప్రజలు మనుధర్మ శాస్త్రం తగలబెట్టి బహుజన ప్రజలను చైతన్యం చేయాలి లేదంటే మనుధర్మాన్ని పోలిన రాజ్యాంగాన్ని మన పాలకులు మరోసారి మన ముందుకు తెచ్చే ప్రమాదముంది.
చిన్న రాష్ట్రాల వల్ల అధికార వికేంద్రీకరణ జరిగి అనగారిన వర్గాల అభివృద్ధి జరుగుతుందని భావించిన అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడింది అలా ఏర్పడిన తెలంగాణలో దళితుడినే ప్రధమ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ విషయాన్ని పక్కకు నెట్టడమే కాకుండా ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రిని కూడ ఊడబీకాడు. అంబేడ్కర్ రాజ్యాంగములో పొందుపరిచిన ఆర్టికల్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని అంబేడ్కర్ 125 వ జయంతి నాడు అంబేడ్కర్ కు 125 అడుగుల పెద్ద విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దెగ్గర పెడతానని చెప్పి ఇదేండ్లయినా ఆ ఊసు లేదు.
దళితుల కోసం, బి.సి ల కోసం,మహిళా హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, అందరికి ఓటు హక్కు కోసం, చిన్న రాష్ట్రాల కోసం ఇలా అన్ని వర్గాల కోసం పోరాడి ఎన్నో హక్కులు సాధించిన అంబేడ్కర్ అంటే అందరివాడని ఇప్పటికైనా అర్ధం చేసుకోని ఐక్యతగా ముందుకెళ్లి బహుజన ప్రజల విముక్తి కోసం పోరాడాలి.
(డిసెంబర్ 6 డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా)