– ఆక్వా రంగంలో దేశంలోనే ఏపీ మేటి
– మత్స్యకారులకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, వంగా గీత, డా. గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ ప్రెస్ మీట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతూ వైఎస్సార్సీపీ బృందం మంత్రికి వినతి పత్రం సమర్పించింది.అనంతరం వైఎస్‌ఆర్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వంగా గీతా విశ్వనాథ్, డాక్టర్ ఎం. గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎంపీ మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ…
దేశ చరిత్రలోనే తొలిసారిగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ చేపట్టింది.
విజయనగరం జిల్లాకు సంబంధించి చింతపల్లి, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి, రాజయ్యపేట… ఈ మూడు కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. రూ. 75కోట్లతో పీఎంఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటితో పాటుగా మన రాష్ట్రంలో తరచుగా నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చాలాసార్లు చేపల వేటకు సంబంధించి గొడవలు జరగడం, పరస్పరం కేసులు పెట్టుకోవడంతో పాటు శాంతిభద్రతల అంశం ఉత్పన్నమవడం జరుగుతోంది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పులికాట్ సరస్సులో మేట వేసిన ఇసుకను డ్రెజ్జింగ్ చేయడానికి 45 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరడం, దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రానికి ఇంత ఆదాయం తెస్తున్న, ఆక్వా కల్చర్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ ఆథార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు కృష్ణాజిల్లా లేదా తూర్పు గోదావరి జిల్లాలో భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. సిబా కార్యాలయాన్ని వెంటనే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరాం. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించి 2లక్షల 16వేల హెక్టార్లు ఆక్వా, ఫిష్ కల్చర్ సాగు జరుగుతోంది. వీటిపై సుమారు 3లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలోనే ఆక్వా కల్చర్‌కు సంబంధించి విదేశీ మారకద్రవ్యం 43వేల కోట్ల రూపాయిలు ఆర్జిస్తే.. దానిలో 15,600 కోట్లు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే భాగస్వామ్యం కావడం గర్హించదగ్గ విషయం.
భారతదేశంలోనే అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులకు ఏపీ కేంద్రం అవడమే కాకుండా, ఈ రంగాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఆర్బీకేల ద్వారా ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం, ఆక్వా రైతులకు అవసరం అయిన సీడ్, ఫీడ్ అందిచడమే కాకుండా, ఆక్వా ఉత్పత్తులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి, ఆక్వా రైతాంగానికి ఇన్యూరెన్స్ పాలసీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో పాటుగా కేంద్రం కూడా మెరుగైన తోడ్పాటును అందించడానికి తమ వంత సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.అలాగే ఆక్వా రంగానికి సంబంధించి పవర్ టారిఫ్‌కు కూడా తోడ్పాటును అందించాలని కోరాం. ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను కేంద్రం గతంలోనే విశాఖ జిల్లా బండారుపల్లిలో రూ.40కోట్లతో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం… కోవిడ్ సమయంలో కాలయాపన కావడం జరిగింది. వాటన్నింటిని రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి మళ్లీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌తో మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
విశాఖ పరిసర ప్రాంతాల్లో తరచూ నేవల్ ఈవెంట్ జరగటం, ఆ సమయంలో కనీసం నెలపాటు వేట నిషేధించడంతో ఆ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నేవల్ వారి నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ మత్స్యకారులకు పదివేలు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరటం జరిగింది.
అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి చొరవతో పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న 25మంది మత్స్యకారులను వాళ్ల స్వస్థలాలకు చేర్చడం జరిగింది. బతుకుతెరువు కోసం గుజరాత్ పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లి… అనుకోకుండా పాకిస్తాన్‌కు బందీలుగా చిక్కుకున్న మత్స్యకారులను కాపాడటానికి, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. సాధ్యమైనంత త్వరలో కేంద్రమంత్రితో పాటు మత్స్యశాఖ అధికారులు రాష్ట్రంలో పర్యటించి, ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు.
ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ..
పులికాట్ సరస్సు మొత్తం విస్తీర్ణంలో 440 చ. కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ, 200 చ. కిలోమీటర్లు తమిళనాడులోనూ ఉంది. చేపల వేట సమయంలో రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో లోతు తక్కువ ఉండటం వల్ల మన మత్స్యకారులు వేటకు వెళ్లలేకపోతున్నారు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం దాదాపు రూ.48కోట్లు బడ్జెట్ అవసరమని, దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలను కోరడం జరిగింది. దానికి మంత్రిగారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రివర్యులను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. విజయనగరం జిల్లా ఎచ్చెర్లలోని బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీల ఏర్పాటుకు కేంద్రమంత్రిగారిని అడగటం జరిగింది. విజయనగరం, ఎచ్చెర్ల నియోజకవర్గంలో జెట్టీలు లేకపోవడం వల్ల మత్స్యకారులు వలసలు వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులకు చదువు లేకపోవడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ప్రాంతాలకు వెళ్లడంతో ఆయా దేశాలకు బందీలుగా చిక్కుతున్నారు. బందీలుగా చిక్కినవారిని విడిపించడానికి ముఖ్యమంత్రిగారితో పాటు ఎంపీ మోపిదేవి వెంకటరమణగారు ఎంతో కృషి చేశారు. జీవనాధారం లేకపోవడం వల్లే తాము ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు చెప్పడంతో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ గారు బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావల్సి ఉంది కాబట్టి, వాటిని మంజూరు చేయాలని మంత్రివర్యులను కోరడం జరిగింది. ఫిషింగ్ హార్బన్ ఏర్పాటుతో వలసలను నివారించడానికి వీలుంటుంది.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ…
అత్యధిక మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరప్రాంతం కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మత్స్యకారుల కష్టాలు, ఇబ్బందులను తొలగించడానికి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. డీజిల్ సబ్సిడీతోపాటు మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే తక్షణమే మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేలా చర్యలు చేపట్టారు. మత్స్యకారులందరికీ గృహాల మంజూరుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, వారికి స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఉప్పాడ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ సెంటర్, తొండంగి ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఫిష్ ల్యాండింగ్ అడిగాం. మరోవైపు తీర ప్రాంతం అంతా కోతకు గురై మత్య్సకారుల గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. ప్రధానమైన రోడ్లు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిని కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతి కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం.