Suryaa.co.in

Andhra Pradesh

ఫిబ్రవరి రెండవ వారాంతం లోగా ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బొత్స తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారేమో తెలియదు.

ప్రజాసేవలో డాక్టరేట్ అందుకున్న మంత్రి నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే టికెట్, కొడుకుకి పక్క నియోజకవర్గంలో ఎంపీ టికెట్ కేటాయించారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నలుగురికి టికెట్లు ఖరారు చేసినట్లు తెలిసింది. కడప నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు ఎంపీగా పోటీ చేయనున్నారు. వై వి సుబ్బారెడ్డి కి రాజ్యసభ, ఆయన కొడుకుకి లోక్ సభ టికెట్ ఇస్తారని తెలుస్తోంది.

వైకాపా ప్రభుత్వ హయాంలో బాగుపడిన కుటుంబాలనే ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందన్నారు. వైకాపాకు అభ్యర్థులు దొరకక ఆందోళన చెందుతుంటే, మరొకవైపు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి పార్టీలోకి మమ్మల్ని తీసుకుమ్మంటే, మమ్మల్ని తీసుకోమని కోరే వారి సంఖ్య ఎక్కువ. ఎవరికి సీటు ఇవ్వాలో బేరిజు వేసుకోవడంలో వారు తల మునుకలయ్యారు.

ఎన్నికల విధుల్లో నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే ఉపాధ్యాయులను కొనసాగించాలని నిర్ణయించింది. దొంగ ఓట్ల విషయం ఎన్నికల కమిషన్ పగడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దీనితో వైకాపా నాయకత్వానికి మింగుడు పడడం లేదు.

సొమ్ములు ఇచ్చేవారు దొరికితే అగ్రవర్గాలకు సీటు కేటాయిస్తూ, ఎవరూ దొరకని చోట బీసీలకు సీట్లను ఇస్తూ,తమది బీసీల పార్టీ అని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. బీసీ నేతలైన పార్థసారధి, సంజీవ్ కుమారులు పార్టీని వీడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎవరు టికెట్లు ఇచ్చిన కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులకే ఇవ్వాలి. బొత్స సత్యనారాయణ సతీమణికి టికెట్ ఇచ్చి, తాము బీసీలకు టికెట్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాల వరకే వారు బీసీలు. కేంద్ర ప్రభుత్వ కులాల జాబితాలో వారు బీసీలు కాదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

బీసీల పార్టీ అంటే టిడిపి

టిడిపి అంటే బీసీలు, బీసీలు అంటే టిడిపి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బీసీలకు తామేదో మేలు చేసినట్లుగా వైకాపా ప్రభుత్వం తప్పుడు పబ్లిసిటీని చేసుకుంది. కుర్చీ, బెంచీ తో పాటు రూపాయ నిధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ నిజాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్తాం. ప్రజల్లోకి వెళ్లి ఈ నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.

ప్రజాక్షేత్రంలోకి ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లి వివరిస్తాం. వ్యక్తిగత దూషణలు, వ్యక్తుల జీవితాలలోకి తొంగి చూడడ మనేది తమ విధానం కాదన్నా రఘురామ కృష్ణంరాజు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైకాపా ఎత్తుగడ బెడిసి కొట్టిందన్నారు . మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య లు చెప్పినట్లుగా సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాసి, కాపుల మధ్య విభేదాలను సృష్టించాలని చూశారు.

అయితే ఇప్పుడు కాపులు సంఘటితమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. వైకాపా నాయకులను ముద్రగడ పద్మనాభం తనయుడు ఛీ కొట్టినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

LEAVE A RESPONSE