Suryaa.co.in

Andhra Pradesh

హోంశాఖ- ప్రెస్ కౌన్సిల్ దృష్టికి మీడియాపై దాడులు

-టీడీపీ-జనసైనికుల సంయుక్త సమరం భేష్
– టీడీపీ-జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయకమిటీ తీర్మానాలు

విజయవాడ : వైసీపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన కలసి పనిచేస్తున్న వైనంపై ఇరు పార్టీలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట ప్రయోజనాల కోసం చంద్రబాబు-పవన్ కల్యాణ్ సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఇరు పార్టీల శ్రేణులు ఆమోదించాలని, ఇటీవల రాష్ట్రంలో మీడియా సంస్థలు-ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు చేస్తున్న అనాగరిక దాడులను, కేంద్ర హోం శాఖ-ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని విజయవాడలో జరిగిన టీడీపీ-జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తీర్మానించింది.

తీర్మానంలోని అంశాలు ఇవే..

కృతజ్ఞతలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను… సమగ్ర అభివృద్ధిని… ప్రజల క్షేమాన్నీ దృష్టిలో ఉంచుకొని తెలుగు దేశం – జనసేన పార్టీలు కలసి ప్రజా క్షేత్రంలో పని చేయాలని నిర్ణయం తీసుకున్న ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కి, పవన్ కల్యాణ్ కి ఈ సమావేశం ధన్యవాదాలు తెలియచేస్తోంది. ఈ పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించి క్షేత్ర స్థాయిలో కలసి పని చేస్తున్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు.

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ఆడపడుచులకు రక్షణ కరవైంది. యువతకు భవిష్యత్తుపై ఆశలు కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం బాధ్యతగా భావించి తెలుగుదేశం – జనసేన ఒక తాటిపై నిలిచి ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ కూటమిని విజయం దిశగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇరు పార్టీల అధ్యక్షులు చేస్తున్న అవిరళ కృషికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ఈ సమావేశం తీర్మానించింది.

మీడియాపై గూండాగిరి ప్రజాస్వామ్యానికి హానికరం
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా రంగంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామం. ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతో మీడియా ప్రతినిధులు, మీడియా కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు పాలక పక్షమే చేస్తుండటం వైసీపీ నైజాన్ని వెల్లడిస్తోంది.

వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో.. నేతల అరాచకాలు.. పాలకుడి వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో పత్రికలు, ఛానెళ్లు ప్రజలకు తెలియచెబుతున్నాయి. వీటిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం- మీడియా సంస్థలు, పాత్రికేయులను కట్టడి చేసేందుకు జీవోలు ఇచ్చి కేసులు నమోదు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ఎంపిక చేసిన మీడియా సంస్థలు, పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లపై దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ పాలన మొదలైన కొద్ది నెలలకే తుని నియోజకవర్గంలో సత్యనారాయణ అనే విలేకరిని హత్య చేశారు.

మీడియాపై అప్పటి నుంచి దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకర్లు పరమేశ్వరరావు, వీరశేఖర్ లపై చేసిన మూక దాడులు… కర్నూలులో ఈనాడు కార్యాలయంపై చేసిన రాళ్ళ దాడి, ధ్వంసం ఘటనలను ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది.

మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశం తీర్మానిస్తుంది.

LEAVE A RESPONSE