ఎవరి గుండెలు ఆగిపోతాయ్?

– సోషల్‌ మీడియాలో ధర్మానపై పేలుతున్న సెటైర్లు
– అధికారం రాకపోతే వేలాది గుండెలు ఆగిపోతాయట
– వాలంటీర్లు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉండాలట
– కుదరదని సీఈసీ చెప్పినా ఖాతరు చేయని మంత్రి ధర్మాన
– వాలంటీర్లకు సర్వీసు రూల్సులేవని వింత వాదన
– ధర్మాన వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం
– ‘గుండెలు ఆగుతాయ’నే వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా ఎన్నికల సంఘం హెచ్చరికలంటే అన్ని పార్టీలకూ హడల్. సీఈసీ చెబితే ఎవరైనా చచ్చినట్లు పాటించి తీరాల్సిందే. దానికి రంధ్రాన్వేషణలు- అడ్డదారులు వెతికి, ఆదారిలో వెళితే ఆ పార్టీలకు చుక్కలు చూపించడం ఈసీకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి సీఈసీ ఆదేశాలనే ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తూ.నా బొడ్డు అని తీసిపారేయడం వివాదానికి తీసింది. పోనీ ధర్మాన ఏమైనా జూనియరా అంటే కానే కాదు. జగనన్న క్యాబినెట్‌లోనే సీనియర్ మంత్రి. చట్టంలోని ధర్మసూక్ష్మం బాగా తెలిసిన దిట్ట. అలాంటి ధర్మాన చేసిన అధర్మప్రసంగం ఒకటి వెలుగులోకి వచ్చి, ఇప్పుడాయనను చిక్కుల్లోకి నెట్టింది.

శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయి, అవి చివరకు ఎన్నికల సంఘం వరకూ చేరడం చర్నీయాంశమయింది. ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ ఏజెంట్లుగా పెట్టకూడదని ఎన్నికల సంఘం విస్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినా సరే మంత్రి ధర్మాన, దానిని ఖాతరు చేసినట్లు లేరు.

పైగా వాలంటీర్లకు ఉద్యోగుల మాదిరిగా సర్వీసు రూల్సు గట్రా ఉండవుకాబట్టి.. పోలింగ్ బూత్‌లో ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ఆలోచిస్తున్నామని చేసిన వ్యాఖ్య, రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. దీనిపై టీడీపీ-జనసేన-కాంగ్రెస్ ఇంతెత్తున లేచి.. ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో, ధర్మాన తానొక్కరే ఇరుక్కుంది కాకుండా, పార్టీనీ ఇరుకునపెట్టినట్టయింది.

అంతేనా? ఈసారి జగన్ ప్రభుత్వం రాకపోతే.. కొన్నివేల గుండెలు ఆగిపోతాయంటూ చేసిన వ్యాఖ్య, సోషల్‌మీడియాలో సెటైర్లవర్షం కురిపిస్తోంది.

జగన్ ప్రభుత్వం రాకపోతే ఎవరి గుండెలు ఆగిపోతాయి? ఎందుకు ఆగిపోతాయి? వారికి కార్డియక్-లివర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించి, ఆరోగ్యశ్రీతో బాగు చేయించవచ్చు కదా? పోనీ జగనన్న ప్రభుత్వం రాకపోతే బూమ్‌బూమ్, ప్రెసిడెంట్‌మెడల్ లాంటి మందు కంపెనీల ఓనర్ల గుండెలు ఆగిపోతాయా? లేక ఇసుక తమ్ముడి గుండె ఆగిపోతుందా? అని కామెంట్లు పెడుతున్నారు.

అదీగాకపోతే కడపలో రెడ్డిగారి ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీల గుండె ఆగిపోతాయా? సలహాదారులకు అప్పనంగా దోచిపెడుతున్న కోట్లాదిరూపాయలు ఆదా అవడం వల్ల, వారి గుండెలు ఆగిపోతాయా? సొంత మీడియాకు అడ్వర్టైజ్‌మెంట్లు ఆగిపోవడం వల్ల గుండెలు ఆగిపోతాయా? అదేదో కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా మంత్రిగారూ?.. అంటూ నెటిజన్లతోపాటు, వైసీపీ రాజకీయ ప్రత్యర్ధుల సోషల్‌మీడియా సైనికులు.. కడుపుబ్బనవ్వించే సెటైర్లు కుమ్మరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రిగారు సర్దుకుని.. తాను అలాఅనలేదని, మీడియానే తన వ్యాఖ్యలు వక్రీకరించిందని ప్లేటు మార్చినా ఆశ్చర్యం లేదండోయ్!

Leave a Reply