– తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం
– చివరి గింజవరకు కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధం
జనవరి రెండో వారంలో రైతుల పక్షాన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తర్వాత అనేక రకాల హామీలిచ్చింది.కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితమైంది తప్ప.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏ హామీని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం అన్నరు.. 9వ తేదీన రుణమాఫీ ఫైలుపై సంతకం పెడతామన్నరు. అరకొర రుణమాఫీ మాత్రమే చేశారు. కాంగ్రెస్ ది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీది చేతల ప్రభుత్వం కాదు.. ఇది మాటల, కోతల ప్రభుత్వం మాత్రమే. రైతు భరోసా పేరిట అనేక రకాల కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు.
కౌలు రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో ఏయే పంటలు సాగు చేస్తున్నారు.. ఏ గ్రామంలో రైతులు ఎంత సాగు చేస్తున్నారు.? ఎంతమంది రైతుకూలీలు ఉన్నారనే అన్ని రకాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ దరఖాస్తుల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
రుణమాఫీకి వాయిదాలతో కోత పెట్టారు. రైతు భరోసాకు కూడా కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నరు. కేంద్రం రైతులను ఆదుకునేలా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులకు అనేక హామీలిచ్చింది. రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నది. ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలపై రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు.పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలకు రూ. 500 చొప్పున అదనంగా బోనస్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇస్తమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. కనీసం వరిధాన్యానికి కూడా ఇవ్వడం లేదు. కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ అంటూ సన్నాయినొక్కులు నొక్కింది.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి అవమానించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి, రైతుల చేతికి సంకెళ్లు వేసి అవమానం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడుస్తోంది.
ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 13 నెలలుగా నీరుగారుస్తోంది. గతేడాది నవంబరు 30వ తేదీన పాలమూరులో రైతుపండుగ పేరుతో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ విడతలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తున్నట్లు చెక్కును ప్రదర్శించారు. కాని ఆ డబ్బు ఇంతవరకు పూర్తిగా రైతుల ఖాతాల్లో జమకాలేదు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70-80 శాతం వరకు పంటలపై ఎంఎస్ పీ పెంచింది. చివరి గింజ ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఎంఎస్ పీ కంటే తక్కువ ధరలో ధాన్యం అమ్ముకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.
కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ఎంఎస్ పీకి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా.. నెలల తరబడి రైతుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో పేరుకుపోయేలా, వర్షాలకు తడిసిముద్దై మొలకెత్తేలా వ్యవహరించి, రైతులకు అన్యాయం చేసింది.
ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదు. కేంద్ర ప్రభుత్వమే పైసలు చెల్లిస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అయినా ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రైతులు ఎంతధాన్యం పండించినా, చివరి గింజవరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది.
క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు మండీ హమాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి నయాపైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు నొప్పేంటి..?
జనవరి 1వ తేదీన నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ లో రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది. అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం, రాజకీయ సంక్షోభం, ఆర్థిక మాంధ్యం కారణంగా ఎరువుల ధరలు పెరిగాయి. అయినప్పటికీ రైతుల మీద భారం పడకుండా పెరిగిన ఎరువుల ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులను ఆదుకుంటోంది.
కేంద్ర ప్రభుత్వం యూరియా మీద కేంద్ర ప్రభుత్వ సబ్సిగడీ మొత్తం ప్రతి బస్తా (యూరియా 45 కేజీలు) కు రూ. 2,236 ఇస్తున్నది. అంటే.. రూ. 2,503 ధర ఉన్న యూరియాపై రూ. 2,236 మేరకు సబ్సిడీ చెల్లిస్తున్నది. అంటే.. దీనిపై రైతులు చెల్లిస్తున్నది కేవలం రూ. 267 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ. 33 వేల కోట్ల మేరకు ఎరువుల సబ్సిడీ రైతులకు అందిస్తున్నది.
జనవరి రెండో వారంలో రైతుల పక్షాన రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహశీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తాం.