Suryaa.co.in

Telangana

క్రీడా విజేతలకు రేవంత్‌రెడ్డి అభినందనలు

మన రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం సచివాలయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు, భవిష్యత్తు టోర్నీలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి, వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.

ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సహం అందిస్తుందని అన్నారు. అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సాయం, ఉద్యోగావకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నదని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా విజేతలందరూ తమ పతకాలను, అవార్డులను సగర్వంగా ముఖ్యమంత్రికి చూపించారు. ముఖ్యమంత్రి గారు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. హుసాముద్దీన్ (బాక్సింగ్ మరియు కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత), ఈషా సింగ్ (షూటింగ్ , ఆసియా క్రీడలు 2023 బంగారు పతక విజేత), ఆసియా క్రీడలు 2023లో పాల్గొన్న నిఖత్ జరీన్ (బాక్సింగ్‌లో కాంస్య పతకం), కినాన్ చెనై డారియస్ (షూటింగ్‌లో బంగారు పతక విజేత), అగసర నందిని (అథ్లెటిక్స్‌లో కాంస్య పతక విజేత), ఎన్. సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్) పి. గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్). పారా అథ్లెట్, పారా గేమ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన జీవన్‌జీ దీప్తి ముఖ్యమంత్రిని కలిశారు

LEAVE A RESPONSE