– డ్రగ్, కెమికల్ కంపెనీలకు పేద ప్రజల భూములతో ఏం సంబంధం?
– మల్టీనేషనల్ కంపెనీలకు ట్యాక్స్ సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు?
– రేవంత్ రెడ్డికి బానిసలుగా అధికారులు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచర్ల పరిధిలో సుమారు 1350 ఎకరాలతో పాటు మరో 1500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని ఆలోచన చేస్తున్నట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నరు. కొంతమంది దళారులు, మధ్యవర్తులు అసైన్డ్ భూములు పొందిన వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మరికొంత మంది పట్టా భూములు కలిగి ఉన్నవారి నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రయత్నం చేసింది. భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతుల నుంచి రూ. 40 లక్షల విలువైన భూమిని కేవలం రూ. 10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలు తమ గ్రామాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కలెక్టర్ ని పంపించగా.. ప్రజలు నిరసన తెలిపారు. స్వయాన కలెక్టర్ తమపై దాడి చేయలేదని ప్రకటించారు. అయినా 1500 మంది పోలీసులు 4 గ్రామాలపై పడి రాత్రికి రాత్రి కొంతమందిని అరెస్ట్ చేసి హింసించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ పెట్టి.. యుద్ధభూమిని తలపించేలా ఓట్లేసి గెలిపించిన ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసిస్తున్నారు. బాధిత ప్రజలు, రైతులకు మద్దతుగా వెళ్లిన ఎంపీ డీకే అరుణని పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిని మాత్రం 50 కార్ల కాన్వాయ్ తో, 300 మందితో పంపించారు. వారు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను దూషిస్తూ సంతకాలు పెట్టకుంటే మీ పిల్లలు జైళ్లలో మగ్గే పరిస్థితి వస్తుందని భయపెట్టారు. అధికారులు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బానిసలుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం హెలికాప్టర్లతో సర్వే చేశారు. రైతుల నుంచి కోట్లాది రూపాయల విలువైన 14 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఆఖరుకు ఆ భూములను ఫోర్త్ ఎస్టేట్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారమదంతో ప్రజల భూములు గుంజుకుంటూ, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గం.
రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఇండ్లు కూలగొడుతోంది. మూసీ ప్రక్షాళన పేరుతో వేలకోట్ల దందా చేస్తున్నరు. గతంలో జీఎంఆర్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం విలువైన భూములిచ్చిన రైతులు.. ఇప్పుడు టాయిలెట్లు శుభ్రం చేస్తూ, అడ్డమీది కూలీలుగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు.
బాసుల ఆదేశాల కోసం, వారి ప్రేమను పొందాలనుకోవడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకోవడం మంచిదికాదని అధికారులను హెచ్చరిస్తున్నం. భూములు తీసుకోవడానికి వస్తే అధికారులను తన్ని తరమండంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి… అధికారంలోకి రాగానే ప్రజల భూములను గుంజుకుంటున్నరు.
డ్రగ్, కెమికల్ కంపెనీలకు పేద ప్రజల భూములతో ఏం సంబంధం..? అతి తక్కువ ధరకు భూములు కొట్టేయాలనుకోవడం తగదు. మల్టీనేషనల్ కంపెనీలకు ట్యాక్స్ సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు?
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, భూములు లాక్కుంటూ భయానక వాతావరణం సృష్టించాలనుకోవడం మంచిది కాదు.రాష్ట్రంలో గత ప్రభుత్వం గిరిజనులు, దళితులకు సంబంధించిన లక్షల ఎకరాల భూములను ప్రాజెక్టుల పేరుతో గుంజుకొని వారి ఉసురుపోసుకున్నది. నేడు రేవంత్ ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తున్నది. తమ భూములు గుంజుకోవద్దని అడ్డుకున్న పాపానికి రైతులకు బేడీలు వేసి, కేసులు పెట్టిన పాపం సీఎం రేవంత్ రెడ్డిది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రతినిధులను కూడా బాధిత ప్రజలకు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటూ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రజల నుంచి ప్రభుత్వం భూములు సేకరించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి కదా? పేద ప్రజలు, రైతుల పక్షాన బిజెపి అండగా ఉంటుంది. తెలంగాణ ప్రజానీకం అండగా నిలుస్తుంది.
సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు దీలీప్ ఆచారి , సునీత , కట్టా సుధాకర్ , బీజేపీ నాయకులు సుధాకర్ గండే , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.