– చంద్రబాబు చెప్పినా చెవికెక్కని కొందరు మంత్రులు
– ఇంకా శాఖలపై పట్టు పెంచుకోని మరికొందరు
– ‘వీకెండ్స్ మినిష్టర్స్’ మరికొందరు
– శని, ఆదివారాలు పరాయి రాష్ట్రాలలో షికార్లు
– నియోజకవర్గాలను కుటుంబసభ్యులకు వదిలేసిన ఇంకొందరు
– మరికొందరు నాన్ సీరియస్ మంత్రులు
– జిల్లాల్లో సమన్వయం సాధించని పలువురు మంత్రులు
– విపక్షాలపై ఎదురుదాడిలో చాలామంది మంత్రులు ఫెయిల్
– పాసు మార్కులు తెచ్చుకోలేని కొందరు మంత్రుల తీరుపై పెదవి విరుపు
– ఎవరికి ఎన్ని మార్కులు?
– మంత్రుల పనితీరుపై ‘సూర్య’ పరిశీలన
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి ప్రభుత్వం అధికారం లోకి ఐదునెలల దాటింది. అద్భుతం, అనన్యం, అనితర సాధ్యమైన ఫలితాలు సాధించి.. గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొలువుదీరిన మంత్రులు, ఆ పదవులకు న్యాయం చేస్తున్నారా? ఎంతో నమ్మకంతో తమకు కట్టబెట్టిన పదవుల్లో రాణిస్తున్నారా? సొంత శాఖలపై పట్టుతో పాటు, జిల్లా-నియోజకవర్గాల్లో సమన్వయం సాధిస్తున్నారా? ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? లేక నియోజకవర్గాలను కుటుంబసభ్యులకు వదిలేశారా? అటు ప్రజలు, ఇటు కూటమి కార్యకర్తలను మెప్పిస్తూ అందుబాటులో ఉంటున్న మంత్రులెంతమంది? అసలు ఈ ఐదునెలల్లో వారికి వచ్చే మార్కులెన్ని? ఇదీ ఇప్పటి మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్.
151 స్ధానాలు సాధించిన వైసీపీని కూకటివేళ్లతో పెళ్లగించి.. 96 శాతం స్ట్రైక్‌రేటు సాధించి గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి సర్కారులో, కొలువుతీరిన మంత్రుల్లో పనిమంతులెవరు? నామమాత్రంగా పనిచేస్తుందెవరన్న అంశం సహజంగా ఆసక్తిరేపేదే. ఈ క్రమంలో రెండున్నర లక్షర మందికి పైగా పాఠకులున్న ‘సూర్య’ డిజిటల్ యంత్రాంగం, ఆ దిశగా విస్తృత పరిశీలన నిర్వహించింది.
మంత్రుల సొంత నియోజకవర్గాలు-జిల్లాలో సమన్వయం.. విపక్షాలపై ఎదురుదాడి… బంధుప్రీతి..అవినీతి ఆరోపణలు.. సొంత శాఖలపై పట్టు.. ప్రజలకు అందుబాటు వంటి ప్రధాన అంశాల ప్రాతిపదికన నిర్వహించిన పరిశీలనలో తేలిన ఫలితాలివి. కొందరు మంత్రులు నిజాయితీపరులైనప్పటికీ.. వారు నియోజకవర్గాలను పట్టించుకోవ డం లేదు. కూటమి ధర్మాన్ని పాటించడం లేదు.
ఫలితంగా వారి నిజాయితీ వృధా. ఇంకొందరు మంత్రులు నియోజకవర్గాలకు వెళ్లే సందర్భాలు తక్కువ. మరికొందరు.. కొడుకులు-కూతుళ్లు-అల్లుళ్లు-భార్యలకు ఆ నియోజకవర్గాలు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన పరిస్థితి. మరికొందరు యువ మంత్రులు వీకెండ్స్‌లో హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్ , థాయలాండ్, శ్రీలంకలో సేదదీరుతున్న పరిస్థితి. ఇంకొందరు హైదరాబాద్‌లో గడుపుతున్న వైనం. ఏతావతా సొంత శాఖలపై పట్టు పెంచుకుని, నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటున్న మంత్రుల సంఖ్య తక్కువే. వీటి ప్రాతిపదికగా రూపొందించిన ప్రోగెస్ రిపోర్టు ఇది.
వీరిలో నారా లోకేష్ కేవలం ముఖ్యమంత్రి తనయుడి హోదాలో కాకుండా.. తానూ ఓ మంత్రిగా వ్యవహరిస్తూ పరిశ్రమిస్తున్నారు. చంద్రబాబునాయుడు తనయుడు అన్న అర్హత, ఎన్నికల్లో పోటీ చేసే వరకే పనికొచ్చినప్పటికీ.. గెలిచి నిలిచిన తర్వాత తానేమిటో నిరూపించుకునేందుకు శ్రమిస్తున్నారు.
ఓ వైపు మంగళగిరి ఎమ్మెల్యే హోదాలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న లోకేష్ , మరోవైపు మంత్రిగా తన శాఖపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యలో రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఇవి కాక అధికారుల బదిలీలు, పార్టీ వ్యవహారాలు, పదవుల పంపిణీపైనా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతో ఆయనొక్కరే వీటిపై కసరత్తు చేస్తున్నారు. అందువల్ల ఆయనకు 80 మార్కులు దక్కడం సహజం.
ఇక మహిళ, తొలిసారి మంత్రి అయినప్పటికీ.. తన శాఖపై నిరంతరం సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు, జిల్లా పర్యటనలు, నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్న బీసీశాఖ మంత్రి సవిత 70 మార్కులు, సొంత నియోజకవర్గం-జిల్లా-ప్రాజెక్టుల పనితీరు- పర్యటనలో బిజీగా ఉన్న మంత్రి రామానాయుడుకు 70 మార్కులు, నియోజకవర్గానికి సమయం తక్కువ కేటాయించినా, సొంత శాఖపై పట్టు సాధిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 65 మార్కులు, జిల్లా-నియోజకవర్గం-సొంత శాఖకు సమయం కేటాయిస్తున్న మంత్రి నారాయణకు 65 మార్కులు, జిల్లా పర్యటనలు-సొంత శాఖపై నిరంతర సమీక్షలు, సొంత నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు 60 మార్కులు లభించాయి.
మంత్రి వంగలపూడి అనిత 50, నాదెండ్ల మనోహర్ 50, దుర్గేష్ 50, పార్ధసారథి 45, అనగాని సత్యప్రసాద్ 40, గొట్టిపాటి రవికుమార్ 40, బిసి జనార్దన్‌రెడ్డి 40, టిజి భరత్ 40, పయ్యావుల కేశవ్ 40, కొల్లు రవీంద్ర 30, స్వామి 35, అచ్చెన్నాయుడు 35, రాంప్రసాద్‌రెడ్డి 35, ఫరూఖ్ 35, కొండపల్లి శ్రీనివాస్ 35, సంధ్యారాణి 30, ఆనం రామనారాయణరెడ్డి 30, వాసంశెట్టి సుభాష్ 25 మార్కులు సాధించారు.
మంత్రి దుర్గేష్‌కు మంచి పేరు, వివాదరహితుడన్న ముద్ర ఉన్నప్పటికీ .. ఆయన తన నియోజకవర్గాన్ని, ఆరోపణలున్న నాయకులకు వదిలేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడ కూటమి నేతల్లో సమన్వయం తక్కువంటున్నారు.
ఇక మంత్రి వాసంశెట్టి సుభాష్ చుట్టూ పాత వైసీపీ నేతలే కనిపిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇక్కడ టీడీపీ-జనసేన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, మంత్రి శాఖాపరంగా ఇంకా వెనుకబడి ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాసంశెట్టి నియోజకర్గంలో కూటమి సమన్వయం సున్నా. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వాసంశెట్టి, ఇప్పటికీ టీడీపీ శ్రేణులతో మమేకం కాలేకపోతున్నారన్నది మరో విమర్శ.
మంత్రి సంధ్యారాణి బాధ్యతలనుంచి తప్పించుకుంటారన్న పేరు లేక పోలేదు. ఇక పార్టీలో సీనియర్ అయిన ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ధికశాఖ నుంచి వైసీపీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ైవె నంతోపాటు, సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపరన్న విమర్శ కూడా లేకపోలేదు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎదురుదాడిలో అనుభవం ఉన్న కేశవ్, ఏ కారణం చేతనో మౌనం వహిస్తున్నారు. చివరకు తన శాఖకు సంబంధించి మీడియాలో వస్తున్న ఆరోపణలపైనా ఎదురుదాడి చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మంత్రి గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ ఇంకా తమ శాఖలపై పట్టు సాధించలేదని, చాలా అంశాల్లో నాన్ సీరియస్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది.