– చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు?
– చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా?
– ఇది చాలా తీవ్రమైన అంశం
– ప్రతివాదిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
– ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే వ్యక్తిగత బాధ్యత
– 16న తదుపరి విచారణ
– హెచ్‌సియు భూములపై రేవంత్ సర్కారుకు ‘సుప్రీం’ తలంటు
– సర్కారు చర్యలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
– సుప్రీం ఆదేశాలతో సంకటంలో రేవంత్ సర్కార్
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాల ఆందోళనను బేఖాతరు చేస్తూ రేవంత్‌రెడ్డి సర్కారు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తలంటింది. చెట్లు కొట్టేసేందుకు సీఈసీ అనుమతి తీసుకున్నారా? చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు?
అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఒకవేళ మా ఆదేశాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే బాధ్యత. ఆమెను కూడా కేసులో ప్రతివాదిగా చేర్చండి. మూడురోజుల్లో వందల ఎకరాల చెట్లు కొట్టేయడం సామాన్య విషయం కాదు. ఇది తీవ్రమైన అంశమని అక్షింతలు వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డి సర్కారు నైతికంగా అప్రతిష్ఠపాలు చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం, ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కోర్టు చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది.
ఇది చాలా తీవ్రమైన అంశం అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టనుంది.
చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడింది.
తెలంగాణ ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగిన సంగతి తెలిసిందే. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు.