Suryaa.co.in

Telangana

కమీషన్ల కోసం రేవంత్ ప్రయత్నం

– ఎన్టీపీసీ లేఖలకు రేవంత్ ఎందుకు స్పందించడం లేదు?
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్

విద్యుత్ కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై విచారణ జరిపించకుండా మీనమేషాలు లెక్కపెడుతోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. చవకగా వచ్చే విద్యుత్ ని కాదని కమీషన్ల కోసం ఇతర సంస్థల నుండి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పాలన విషయంలో బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని దుయ్యబట్టారు.

పాలన పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై దృష్టిపెట్టారని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను అంధకారంగా మార్చొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ , కిషోర్ పోరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా భవిష్యత్తు తెలంగాణకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. థర్మల్ ప్రాజెక్టులో 85శాతం విద్యుత్ ను రాష్ట్రానికే కేటాయించాలని, బొగ్గు కేటాయింపులో అన్ని ఆమోదాలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి విభజన చట్టంలో నిర్దేశించడం జరిగింది.

అందుకు అనుగుణంగా మొదటిదశలో 1600మెగావాట్లతో కూడిన సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు రెండవ దశను 2016-17వ సంవత్సరంలో రూ.17,739కోట్ల అంచనాలతో రూపొందిస్తే 2022-23వరకు ఆ ధరలతో తిరిగి మళ్లింపు చేయాల్సి ఉందని పీపీఏ కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు.

ఆర్టీఐ ద్యారా ఎన్టీపీసీ తాజాగా అందించిన సమాచారం ప్రకారం …అక్టోబర్ 23 నుండి జనవరి 29వరకు తెలంగాణ ప్రభుత్వానికి మూడు లేఖలు రాశారు. దేశంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అవసరాలను అందుకునే విధంగా ఎన్టీపీసీ కెపాసిటీ పెంచడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు ఇప్పుడు నిజమని తెలుస్తోంది.

చవకగా వచ్చే విద్యుత్ ని కాదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఇతర సంస్థల నుండి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ తరుఫున మేం కూడా చెప్పినం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏ లను కుదుర్చుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోంది.పీపీఏ లు కుదుర్చుకోవాలని గత ఏడాది అక్టోబర్ 5న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచిస్తే లెక్కచేయలేదు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనవరి 9వ తేదీన ఒక లేఖ, జనవరి 29వ తేదీన 2వ లేఖ రాస్తే స్పందించలేదు.

ఫిభ్రవరి 10వ తేదీ లోగా స్పందించకపోతే వేరే రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని చెప్పినప్పటకి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించలేదు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే ఇంత హెచ్చరించినా ఎందుకు పట్టించుకోవట్లేదు.? గత బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు నడవాలనుకుంటున్నారా..?

రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో విద్యుత్ కొరత వస్తదని గమనించి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.11,572 కోట్ల నిధులిచ్చింది. మొదటిదశలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగింది. రెండవదశ నిర్మాణం కోసం రూ.17,539కోట్లు కేటాయించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు.

వేసవి మొదలవకముందే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి.కరెంటు కోతలతో రాత్రి సమయంలో పొలం దగ్గరికి వెళ్లిన రైతు పాముకాటుకు గురై చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.ఎన్టీపీసీతో పీపీఏ కుదుర్చుకొని కరెంటు కోరతలు అధిగమించవచ్చు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదు.

తక్కువ రేటుకే ఎన్టీపీసీ ద్వారా కరెంటిస్తామని ముందుకు వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు..? 100రోజుల్లో రోజుకు 18గంటలు పని చేసినా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఎన్నికలు సమీపించడంతో గేట్లు తెరుస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి .. మరి, విద్యుత్ ఒప్పందాల సంగతి ఎవరు చూడాలి. పాలనను గాలికి వదిలేసి వాటాల పంపకాల కోసం ఒప్పందాలను ఖాతర్ చేయడం లేదా..?

చత్తీస్ ఘడ్ రాష్ట్రంతో 12ఏండ్ల విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకుని తెలంగాణ డిస్కంలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా..? యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో జరిగిన అవినీతిని బయట పెడతామని స్వయంగా ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.

అవినీతి విషయంలో విచారణ జరిపి బాధ్యుల మీద, అక్రమార్కుల మీద చర్య ఎందుకు తీసుకోవడం లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేడిగడ్డ ప్రాజెక్టులో, ధరణిలో, భూ మాఫియాలో జరిగిన అవినీతి మీద విచారణ చేసి బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

అవినీతిపరులతో కలిసి వాటాలు పంచుకోవడానికేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ మూడుసార్లు ఉత్తరాలు రాసినా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యుత్ మీద దృష్టి సారించి, తెలంగాణను అంధకారం లోకి నెట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా.

LEAVE A RESPONSE