Suryaa.co.in

Telangana

రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం

– ధాన్యం కొనుగోలులో కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి
– రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి
– వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి
– ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం
– 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలి
– జూన్ 2న ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో
– వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నా.

రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి.

అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి.

ఒక్క నిముషం వృధా చేయొద్దు. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.

పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి.

భూభారతి పేద రైతులకు చుట్టం. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయండి. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం. క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంది. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి. మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలి. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండి.

క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి. 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలి. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి.

LEAVE A RESPONSE