– ఆర్టీసీలో చరిత్రాత్మక ఘట్టం
– 136 మందికి తిరిగి విధుల్లోకి తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం
– సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, దివ్యలకు ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి చొరవతో, ఆర్టీసీ యాజమాన్యం అంగీకారంతో ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యయనానికి తెర లేచింది. ఆర్టీసీలో చరిత్రత్మాక ఘట్టం మంగళవారం ఆవిష్కృతమైంది.
వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించబడ్డ 136 మంది ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఇందులో కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, సెక్యూరిటీ గార్డ్స్ వంటి వాళ్ళు ఉన్నారు.
ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన దాదాపు 472 మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ తప్పులను క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీఎం ప్రజావాణిలో ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు కొన్ని నెలల క్రితం విజ్ఞప్తి చేశారు.
చిన్నారెడ్డి, దివ్య రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఆర్టీసీ ఉద్యోగుల అంశాన్ని తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా సెర్ప్ సీఈఓ, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య మెంబర్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెంబర్ కన్వీనర్ గా కమిటీ వేశారు.
త్రీమెన్ కమిటీ ఆర్టీసీ ఉద్యోగుల విషయాన్ని పరిశీలించి తొలి విడతగా 136 ఉద్యోగులకు తిరిగి విధుల్లోకి తీడుకుంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 336 మంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వినేందుకు బ్యాచ్ వారీగా తేదీలను ఖారారు చేసి షెడ్యూల్ ప్రకటించారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు చిన్నారెడ్డి, దివ్య సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు ధన్యవాదాలు తెలిపారు.