– ఆ మొవ్వ నేత వ్యవహారంపై దర్యాప్తు చేయండి
– సజ్జల పాత్ర ఏంటో తెలియాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్
మంగళగిరి: మొవ్వ వైసీపీ నాయకుడు, ముంబాయి సినీ నటి బాగోతం కేసును దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తెలియాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు.
జగన్ పరిపాలనంతా అరాచకం, అస్తవ్యస్తం. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి, నీరుగారిపోయాయి. పోలీసు వ్యవస్థతో జగన్ చెడుగుడు ఆడుకున్నాడు. పోలీసు వ్యవస్థను జగన్ దుర్వినియోగం చేసినట్టుగా దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేసియుండడు. మొవ్వ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకునికి, బాలీవుడ్ సినీ నటికి మధ్య జరిగిన చీకటి బాగోతానికి ఆనాడు అన్నీ తానై సజ్జల రామకృష్ణా కథ నడిపినట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకుడిని కాపాడటానికి సజ్జల చాలా తాపత్రయ పడ్డారు. ఆ నటిపై దొంగ కేసు పెట్టి, ముంబాయి నుండి విజయవాడకు తీసుకురండని పోలీసులతో సజ్జల ఆదేశించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదు. పోలీసు కమిషనర్ రాణా అంతగా స్పందించి, చిన్న కేసులో నిందితురాలైన ఆమెను విమానంలో ముంబాయి వెళ్లి అరెస్టు చేసి తీసుకుని రావలసిన అవసరం లేదు. ఈ కేసు విచారణకు ప్రత్యేక టీం ఐపీఎస్ అధికారి విశాల్ గన్ని నేతృత్వంలో విమానంలో ఆ నటి వద్దకు వెళ్లడంలో ఏదో మతలబు దాగుంది.
మహిళలను కించపరచే కేసులో సజ్జల ఎంట్రీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొవ్వలో సంఘటన జరిగితే ఇబ్రహింపట్నంలో కేసు రిజిష్టర్ చేయడం వింతగా ఉంది. ఇదంతా సజ్జల హనీ ట్రాప్ అని పలువురు పేర్కొంటున్నారు. కానిస్టేబుల్, ఏఎస్ఐతో కానిచ్చే పనిని ఫ్లైట్ లో ముంబాయి వెళ్లి, ఐఏఎస్ అధికారులు నటిని విజయవాడకు తీసుకొచ్చి విచారించాల్సిన అవసరం లేదు. ఈ బూతు బాగోతానికి సజ్జల క్యాప్టెన్ అనే అనుమానానికి తావిస్తోంది. రాణా టాటా ఎందుకింత చొరవ తీసుకొని విమానంలో తన టీంని విజయవాడ నుంచి ముంబాయికి పంపి ప్రజా ధనాన్ని వృథా చేశారు.
ఇలా వ్యవహరించిన ఆనాటి రాష్ట్ర పోలీసులు పోలీసులా? లేక సజ్జల తాబేదారులా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహిళా లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ కేసును ప్రస్తుత ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించాలి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ మళ్లీ యథాస్థితికి రావాలంటే అధికారులంతా కలిసి చాలా కష్టపడాల్సివుంది. వెంటనే ఈ కేసుపై సిన్సియర్ ఆఫీసర్, సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష జరపాలి. జగన్ ప్రభుత్వ బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. మొవ్వ వైసీపీ నాయకుడు, సినీ నటి ల బాగోతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి పాత్ర ఏమిటో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. మహిళా కమిషన్ అధ్యక్షురాలు మౌనంగా ఉండడంలో అర్థంలేదు. కావున మహిళా కమిషన్ ఈ కేసు విషయంలో నోరు విప్పి మాట్లాడాలి. జగన్ పాదాల కింద నలిగిన వ్యవస్థలన్నీ తిరిగి ఊపిరి పీల్చుకొని యధార్థ స్థితికి రావాల్సివుంది. ప్రభుత్వ ధనాన్ని విమానాల ద్వారా ఖర్చు పెట్టించిన కమిషనర్ నుండి డబ్బు వసూలు చేయాలి.
చంద్రబాబు పరిపాలనలో పాత్రికేయులకు స్వేచ్ఛ ఉంది. నిజాలను నిర్భయంగా రాయవచ్చు. వైసీపీ హయాంలో జగన్ జీవో 1ను తీసుకొచ్చి విలేఖరులను ఇబ్బంది పెట్టారు. రామోజీరావునే అరెస్టు చేయబానికి సిద్ధపడ్డ వ్యక్తి జగన్. విశాల్ గున్ని, డీసీపీ, ఏసీపీ, సీఐలు ఇంతమంది ముంబాయికి ఆ సినీ నటి కోసం వెళ్లి కాలాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచారు. కసబ్ ని, బిల్ లాడెన్ ను పట్టుకోవడానికి వెళ్లినట్లు ప్రత్యేక టీం, ప్రత్యేక విమానం దేనికి? ఒక సాధారణ సినీ నటిని పిలుచుకురావడానికి ఇంత హంగామా అవసరం లేదు. అంతర్జాతీయ క్రిమినల్స్ ను పట్టుకోవడానికి కూడా ఇంత హంగామా చేయరు.
ఒక అమాయక మహిళను తీసుకురావడానికి ఇంత మంది వెళ్లారు. వెళ్లేవారు ఆలోచించాలి. ఆదేశించిన అధికారికి, వెళ్లే అధికారికి మతి స్థిమితం లేదనిపిస్తోంది. పోలీసులు ఇది మా వ్యవస్థ కాదు సార్, ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ సార్ అని చెప్పుకోవాల్సిన ఖర్మ పోలీసులకు పట్టింది. చంద్రబాబు ఇటువంటి వ్యవహారాలు చచ్చినా ఒప్పుకోరు. వైసీపీ బూతు బాగోతాలన్నీ బయటికి రావాలి. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో సునిశితంగా దర్యాప్తు చేయాలి. పోలీసు కమిషనర్ పాత్ర ఏమిటో బయటికి రావాలి. ఒక మహిళను విమానంలో ముంబాయికి వెళ్లి పట్టుకొస్తే మహిళా కమిషనర్ వైసీపీ పట్ల పక్షపాతంతో వదిలేశారు. మహిళా సంఘాలు కూడా మొవ్వ వైసీపీ నాయకుడి బాగోతం గురించి అడగాలి. సజ్జల పాత్రపై కూడా ప్రశ్నించాలి. మహిళా సంఘాలు అడగాలి. సినీ నటి ఫిర్యాదు చేయాలి, మొవ్వకు చెందిన వైసీపీ నాయకుడిని అరెస్టు చేయాలి. ఇలా చేయాల్సింది పోయి కథ అడ్డం తిరిగింది. ఈ కేసును విచారణకు ఆదేశించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.