Home » సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

– లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షతన జరిగినవి.

ఈ సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ” గత 3 సం,, లుగా రాష్ట్రంలోని సర్పంచులంతా రాజకీయాలకతీతంగా అనేక ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, సర్పంచుల 16 డిమాండ్లు పరిష్కరించకపోవడం వలన రాష్ట్రంలోని 12,918 గ్రామాలలోని 3.50 కోట్ల మంది గ్రామీణ ప్రజలు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే సర్పంచుల 16 డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని” రాజేంద్రప్రసాద్ అన్నారు.

అలాగే రాష్ట్రంలోని 12918 గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపించిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు రూ,,8629 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, దొంగిలించి వేయడం గూర్చి మేము ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పలు గ్రామాల్లో తిరిగి పర్యటించి, కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు మింగేసిన విషయం వాస్తవమేనని, సాక్షాదారాలతో నిర్ధారించుకున్నది.

దానిపైన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు ఇచ్చినా తదుపరి ఇవ్వవలసిన 2022-23 సం,, నికి 936 కోట్లు, 2023-24 సం,, నికి 2031 కోట్ల నిధులు మొత్తం 2967 కోట్లు విడుదల ఆపివేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే కేంద్రానికి సంజాయిషీ ఇచ్చుకొని దొంగలించిన 8629 కోట్లు సర్పంచులకు తిరిగి ఇచ్చివేసి, క్రొత్తగా రావాల్సిన 2967 కోట్లు కూడా తీసుకురాకపోతే సహించేది లేదని అవసరమైతే మరలా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేస్తామని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ప్రసంగిస్తూ “సర్పంచులకు, ఎంపీపీలకు 15 వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ నిధులు గ్రామపంచాయతీలకే అప్పజెప్పాలని, గ్రామ వాలంటీర్లను, సచివాలయాలను గ్రామపంచాయతీల ఆధీనంలోకి తీసుకురావాలని, ఇలా మా సర్పంచుల 16 డిమాండ్లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకతీతంగా మా సర్పంచులు ఉద్యమం ఉధృతం చేస్తామని లక్ష్మీ ముత్యాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.

ఇంకా ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలకి, రాష్ట్రం నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన జిల్లా, రాష్ట్ర కమిటీల సర్పంచుల సంఘం నాయకులు ప్రసంగించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినారు.

Leave a Reply