ఆధారాలతో వస్తా..మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్దమా?

– గౌతమ్ సవాంగ్ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి
– జగన్ రెడ్డి అవినీతి బురదలో దొర్లుతుంటే మీరు కూడా బురదలో దొర్లుతారా?

– జగన్ రెడ్డి వేసే చిల్లరకు కక్కుర్తి పడి మన బిడ్డల ఉద్యోగాలను తెగనమ్ముతారా?
• గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటు
• అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసింది
• ఈ స్కాంపై మేమిచ్చిన ఆధారాలు చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారు
• ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంగ్ కి లేదు
• నేడు జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షలు సవాంగ్ చైర్మన్ గా పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలి?
• రాష్ట్రంలోని యువతంతా ఇదే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలని నినదిస్తున్నారు
• టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్ పై సీబీఐ విచారణ జరిపిస్తాం
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఇంకా బుకాయించటం సిగ్గుచేటని, బుకాయింపులు ఆపి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ద్వజమెత్తారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్హహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. గత ఐదేళ్లలో అనేక స్కాంలకు పాల్పడ్డ జగన్ ప్రభుత్వం చివరకు గ్రూప్ – 1 ఉద్యోగాల్ని సైతం తెగనమ్మకుంది. గ్రూప్ 1 ఉద్యోగాల్లో రూ. 150 నుంచి రూ. 200 కోట్ల అవినీతి జరిగింది. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసి 6 నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించి ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు చెప్పింది.

“They action of Respondent Nos. 1 & 2 in conducting second and third valuation of Group-I (Mains) Examination for Notification No.27/2018 is declared as illegal, irregular, arbitrary and violative of Rule 3(ix) of the A.P.P.S.C Rules” అని కోర్టు స్పష్టంగా చెప్పింది. మరో వైపు మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ స్కాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ స్కాం ఎలా జరిగిందో, ఏపీపీఎస్సీ సెక్రటరీగా సీతారామాంజనేయులు ఎలా అక్రమాలకు పాల్పడ్డారో, సవాంగ్ చైర్మన్ అయ్యాక 3వ సారి ఎలా మూల్యాంకనం చేశారో, తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను ఎలా మోసం చేశారో ఇవన్నీ ప్రజల ముందుంచారు. కానీ తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటు. కమిషన్ పై వచ్చిన ఆరోపణలపై సరైన సమయంలో వివరణ ఇస్తామంటున్నారు. సరైన సమయం ఎప్పుడు సవాంగ్ గారు? మీరు రిటైర్డ్ అయిన తర్వాతా? లేక గవర్నర్ మిమ్మల్ని డిస్మిస్ చేశాకనా?

లక్షలాది మంది యువతను రోడ్డున పడేసి ఇంకేం వివరణ ఇస్తారు? దీనిపై ఎంతోమంది తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పిల్లల్ని చదివిస్తే మీరు ఉద్యోగాలను డబ్బుకు అమ్ముకుంటారా? గవర్నర్ సైతం ఈ స్కామ్ పై ఆశ్చర్యపోయారు. ఎక్కడ తప్పు జరిగినా తప్పుచేసిన వారికి శిక్ష విధిస్తూ న్యాయాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీగా బాధ్యతాయుతమైన పదవి నిర్వర్తించిన సవాంగ్ తప్పు చేయటమేకాక నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతారా? ఒక్క క్షణం కూడా సవాంగ్ కి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. డిజిటల్ వాల్యూయేషన్ చేసిన తర్వాత, సీతారామాంజనేయులు మరో సారి వాల్యూయేషన్ చేశారని అనేక ఆధారాలున్నాయి. అయినా ఒక సారే వాల్యూయేషన్ చేశామని సవాంగ్ బుకాయించటం దిగజారుడుతనానికి పరాకాష్ట.

గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామని, అందుకు సంబందించిన కంట్రోల్ బండిల్ స్లిప్స్ ని మాకు సప్లై చేయండని డేటాటెక్ మెధడెక్స్ కి 2021 నవంబర్ 25న సీతారామాంజనేయులు లేఖ రాయటం వాస్తవం కాదా? వాళ్లు సప్లై చేసిన కంట్రోల్ బండిల్ స్లిప్స్ కి పేమెంట్స్ కి ప్రొసిడింగ్స్ కు (29.12.2021) ఇచ్చారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంకి తరలించాలని అందుకు తగిన పోలీసు భద్రత కావాలని నాటి గుంటూరు ఎస్పీకి 03.12.2021 సీతారామాంజనేయులు లేఖ రాయటం నిజంకాదా? అసలు మాన్యువల్ వాల్యుయేషన్ జరగకపోతే సీతారామాంజనేయులు ఈ లేఖలు ఎందుకు రాశారు? హాయ్ ల్యాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకు రూమ్స్ కి, లంచ్, బ్రేక్ పాస్ట్ వీటంన్నిటీ హాయ్ ల్యాండ్ (ఆవాస) రిసార్ట్ కి రూ. 20 లక్షలు చెల్లించటం నిజం కాదా?

ఈ వివరాలు ఏపీపీఎస్సీ అకౌంట్ బుక్స్ లో ఉంటాయి, వీటిని బయటికి తీయగలరా? స్ట్రాంగ్ రూం వద్ద భధ్రతకు కర్నూలు నుంచి 32 మంది కానిస్టేబుల్లు 05- డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 2022 వరకు పంపిన లిస్ట్ కూడా మా వద్ద ఉంది. వాల్యూయేషన్ జరగకపోతే అక్కడ కానిస్టేబుళ్లకు డ్యూటీ ఎందుకు వేశారు? వాల్యూయేషన్ జరిగిందో లేదో ఆ కానిస్టేబుళ్లను పిలిచి మాట్లాడుదామా? ఇవే కాకుండా మేం వాల్యుయేషన్ పూర్తి చేశామని దానికి సంబందించిన పోస్ట్ వాల్యుయేషన్ చేయడానికి రావాలని 2022 పిబ్రవరి 2-న డేటాటెక్ మెదడాలజీకి రామాంజనేయులు లేఖ రాశారు.

ఇవన్నీ నిజం కాదని చెప్పే ధైర్యం గౌతమ్ సవాంగ్ కి ఉందా? స్పష్టంగా ఇన్ని ఆధారాలుంటే తప్పు చేసి కూడా బుకాయించటం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి బురదలో దొర్లుతుంటే మీరు కూడా బురదలో దొర్లుతారా? జగన్ రెడ్డి వేసే చిల్లరకు కక్కుర్తి పడి మన బిడ్డల ఉద్యోగాలను తెగనమ్ముతారా? కోర్టు తీర్పు వెలవడిన నాడే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది. తక్షణమే సవాంగ్ రాజీనామా చేయాలి. గవర్నర్ తొలగించముందే సవాంగ్ రాజీనామా చేస్తే గౌరవ ప్రదంగా ఉంటుంది.

ఇన్ని అక్రమాలు జరుగుతున్నా నేడు జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షలు సవాంగ్ చైర్మన్ గా పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలి? నిన్న లక్షమందికి పైగా అభర్దులు హాజరై రాసిన ప్రిలిమ్స్ వాల్యూయేషన్ లో అవకతలు జరగవని గ్యారెంటీ ఉందా? వీటిని కూడా వేలం పాట నిర్వహించి అమ్ముకోరని యువత ఎలా నమ్మాలి? రాష్ట్రంలోని యువతంతా ఇదే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సవాంగ్ తక్షణమే రాజీనామా చేయాలని నినదిస్తున్నారు.

ఈ స్కామ్ పై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే ఉంటాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్ పై సీబీఐ విచారణ జరిపిస్తాం. ఏపీపీఎస్సీపై యువతకు నమ్మకం కలగాలంటే దీనికి భాద్యులైన వారిని శిక్షించాల్సిందే. రాష్ట్ర యువత జీవితాలతో ఆడుకున్న ఎవరినీ వదలిపెట్టబోమని పట్టాభిరాం హెచ్చరించారు.

Leave a Reply