జంటహత్యల కలకలం

కాకినాడ: వివాహేతర సంబంధం కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతులు పొలం వద్ద కలిసి ఉన్నారనే పక్కా సమాచారంతో ప్రత్యర్థి లోక నాగబాబు పథకం ప్రకారం కత్తితో దాడి చేసి హతమార్చినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గత కొంతకాలం నుంచి లోక నాగబాబుతో సహజీవనం చేస్తున్న పెండ్యాల లోవమ్మ పోసిన శ్రీనుతో కొత్తగా అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది.

విషయం తెలుసుకొన్న లోక నాగబాబు పక్కా ప్లాన్‌తో పొలంలోనే ఇద్దరు కలిసి ఉన్నారనే సమాచారం తెలుసుకుని కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో పెండ్యాల లోవమ్మ, పోసిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడిలో పెండ్యాల లోవమ్మ తల్లి విసరపు రామలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. పెండ్యాల లోవమ్మ, పోసిన శ్రీను వివాహేతర సంబందానికి రామలక్ష్మి సహకరించిందన్న కారణంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంఘటనలో తీవ్రంగా గాయపడిన రామలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమో చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.

Leave a Reply