Suryaa.co.in

Telangana

ఇక్కడ రోగమొస్తే పక్క రాష్ట్రంలో ట్రీట్ మెంట్ తీసుకోవాలా?

-ఇక్కడ యువకులకు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నరు
-తెలంగాణలో బాగుపడ్డదెవరు? ఎవరికి పదవులొచ్చాయో ఆలోచించండి
-తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా?
-ఒక కాలేజీ, ఆసుపత్రి కూడా కట్టివ్వలేని దుస్థితి మంత్రులది, ప్రభుత్వానిది
-కేసీఆర్ కేబినెట్ లో నేను మంత్రిగా ఉండి ఉంటే బావిలో దూకి చచ్చేటోడిని
-పైసలిస్తే పేదోళ్లు ఓట్లేస్తారనే భ్రమల్లో కేసీఆర్
-కేసీఆర్ ఫ్రభుత్వాన్ని కూల్చి బుద్ది చెప్పండి
-ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఫైర్….

‘‘ఇక్కడ రొగమొస్తే పక్క రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకోవాలి. ఇక్కడ పెద్ద చదువులు చదవాలంటే పక్క రాష్ట్రానికి పోవాల్సిన దుస్థితి. తెలంగాణ సాధించుకుంది ఇందుకునా? పక్క రాష్ట్ర ప్రజలు నిలదీస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి మారాలంటే… కేసీఆర్ ఫ్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ జల్లాపురం కు విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు….

నేను ఓట్ల కోసం రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. అబద్దాలాడటం నాకు రాదు. అన్ని విషయాలు చెప్పి వాస్తవాలు ఆలోచించాలని కోరేందుకే మీ వద్దకు వచ్చినం.కష్టాలతో తల్లిడిల్లుతున్న ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు ఎలాంటి పాలన కావాలో తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడానికే పాదయాత్ర చేస్తున్నా.

కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను వివరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకే పాదయాత్ర చేస్తున్నా.మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదొళ్లందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చాం. రెండో ప్రజా సంగ్రామ యాత్రలో ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నం. ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నరు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డీఎస్ ద్వారా నీళ్లు ఇచ్చి తీరుతాం.. కేసీఆర్ ఆడే పచ్చి అబద్దాల పుణ్యమా? అని ప్రజలు రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ గవర్న్ మెంట్ కాలేజీ లేదు. నేను టెన్తు చదివిన.. ఇంటర్ చదవాలంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఆ పాప బాధపడుతోంది.

ఒక కాలేజీ, ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఫ్రభుత్వం ఉంది. నేను కేసీఆర్ కేబినెట్ లో ఉండి ఉంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేటోడిని….. ఇక్కడ ప్రజలకు రోగమొస్తే పక్క రాష్ట్రానికి పోయి ట్రీట్ మెంట్ తీసుకునే దుస్థితి వచ్చిందంటే సిగ్గుతో తలదించుకోవాలి.

మీరు తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అని అడిగే ప్రశ్నలకు సమాధానమేది?ఇక్కడ యువకులకు ఉద్యోగాల్లేవు. ఎంతోమంది యువకులతో తెలంగాణ సాధిస్తే ఎవరికి పదవులు వస్తున్నాయో ఆలోచించండి. కేసీఆర్, ఆయన కుటుంబానికి తప్ప యువకులకు ఉద్యోగాలేవి?

పేదవాడు నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఈ రాష్ట్రానికి 1.4 లక్షల ఇండ్లను కట్టివ్వాలని నిధులు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని దుర్మార్గుడు కేసీఆర్. పక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లను కట్టిస్తున్నరు. తెలంగాణలో 1.4 లక్షల ఇండ్లను కట్టిస్తే మరో 2 లక్షల ఇండ్ల నిర్మాణానికి కేంద్రం ద్వారా మంజూరు చేయించే బాధ్యత నాది అని కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇల్లు కట్టిస్తే బీజేపీకి పేరొస్తుందనే అక్కసు కేసీఆర్ ది.

రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చేది కేంద్రమే… ఒక్క కిలో బియ్యానికి కేంద్రం రూ.30లు చెల్లిస్తోంది. ఈరోజు వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తోంది మోదీయే.పేదల ప్రాణాలు కోల్పోకుండా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన ఘనత నరేంద్రమోదీదే. గ్రామాల అభివ్రుద్ధికి ఇచ్చే నిధులన్నీ కేంద్రానివే. సర్పంచ్ సహా ఇక్కడి ప్రజా ప్రతినిధులను ఒక్కసారి అడగండి.

కేసీఆర్… గ్రామాలకు ఎన్ని పైసలు వచ్చారో నిలదీయండి. ఈ అంశంపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నం.గ్రామ పంచాయతీల్లో టాయిలెట్లు, ఇండ్లు, పల్లె ప్రక్రుతి వనాలు సహా చివరకు స్మశాన వాటికకూ నిధులిచ్చేది కేంద్రమే. ఒకవైపు ఫ్రీ కరెంట్ అంటున్నడు… ఇంకోవైపు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నడు.

ఫస్ట్ తారీకు తరువాత ఒక్కో ఇంటికి కరెంట్ ఛార్జీలు డబుల్ కాబోతున్నయ్… 500 రూపాయలు వచ్చే బిల్లు వెయ్యి కాబోతోంది. గజ్వేల్ ని కేసీఆర్ ఫాంహౌజ్ కు ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. ఆ ఫాంహౌజ్ కు ఇచ్చే కరెంట్ తో ఉచితంగా 30, 40 గ్రామాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వొచ్చు.

మంత్రుల ఫాంహౌజ్ లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. 20, 30 గ్రామాల ప్రజలు వాడుకునే కరెంట్ ను వారి ఫాంహౌజ్ లకు వాడుకుంటున్నరు. కరెంట్ ఛార్జీల పెంపును అడ్డుకుని తీరుతాం.వరి వస్తే ఉరేనంటూ ఇన్నాళ్లు మభ్యపెట్టిండ్రు. దొంగ దీక్షలు చేస్తున్నరు. రైతులను అరిగోస పెడుతున్నడు.

ఇక్కడ మిర్చి పండుతది. అమ్ముకునే దిక్కు లేదు. తెగుళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నరు. మార్కెట్ కూడా లేదు.గత 7 ఏళ్లలో తెలంగాణ రైతాంగాం అకాల వానలతో అల్లాడుతోంది. కానీ ఒక్క రైతు కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇచ్చిన దాఖలాల్లేవ్.తెలంగాణలో రైతులు లక్షాధికారి, కోటీశ్వరులు కావాలని వ్యవసాయం చేయడం లేదు… జరిగిన నష్టాన్ని పూరించడానికే వ్యవసాయం చేస్తున్నరు.

రైతుల ఉసురు పోసుకుంటున్నడు కేసీఆర్.ఇక్కడ దళిత బంధు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి… టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే దళిత బంధు ఇస్తారే తప్ప పేదలకు మాత్రం ఇవ్వరు.రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్న కేసీఆర్ ను ఏం చేయాలి.

కేసీఆర్ ఓట్ల కోసం తప్ప ఎన్నడూ ఇక్కడికి రాడు.బీజేపీ మాత్రమే ప్రజల కోసం పోరాడుతోంది. లాఠీ ఛార్జీలు తిన్నం. రాళ్ల దాడి భరించినం. కేసులు పెట్టిండ్రు. జైలుకు పంపుతున్నరు. సాక్షాత్తు న్ను కూడా జైలుకు పంపిండ్రు.

దళితులకు మూడెకరాల పొలం అడిగితే మమ్ముల్ని లాఠీలతో కొట్టించిండు. అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.ఈ ప్రాంతంలో కాలేజీ, ఆసుపత్రి రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి.మీరు.. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు… ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వండి.పేదల ప్రభుత్వం కావాలా…. పెద్దల ప్రభుత్వం కావాలా? ఆలోచించండి.పైసలిస్తే ఓట్లేస్తారనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నడు…. పేదలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి బుద్ది చెప్పాలి.

పెట్రోలు ధరల పెరుగుదలపై మాట్లాడుతున్న కేసీఆర్ కు నేను ఒక్కటే అడుగుతున్న… లీటర్ పెట్రోలుకు రూ.30 లు దొబ్బుకుతింటున్న కేసీఆర్ బీజేపీ గురించి మాట్లాడటం సిగ్గు చేటు.పక్కనున్న కర్నాటకసహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలుపై వ్యాట్ తగ్గించి 10 నుండి 20 రూపాయల వరకు తగ్గించినం. కేసీఆర్ కూడా తగ్గిస్తే లీటర్ పెట్రోలు 80 రూపాయలకే దొరికే అవకాశం ఉంది.

 

LEAVE A RESPONSE