Suryaa.co.in

Features

స్మరణాదరుణాచలే – ముక్తి

“స్మరణాదరుణాచలే – ముక్తిః” అనే పురాణ వాక్యం ఎంత నిజమో ఈ విధంగా ఊహించవచ్చు.

నేను సంకల్పించనూ లేదు, స్మరించనూ లేదు..
మా అల్లుడు గారు కీలకమైన ఉద్యోగ బాధ్యతలో రాజస్థాన్ ప్రవాసంలో ఉన్నారని కొద్ది రోజులు తోడుగా ఉండటానికి బెంగళూరు వెళ్ళినప్పుడు నా ప్రమేయం లేకుండానే మా అమ్మాయి అల్లుడు కలిసి వేసిన plan ప్రకారం మరపురాని అరుణాచల యాత్ర చేసి వచ్చాను.
నిజానికి ఆ యాత్ర నేను చేశానా, లేక భగవదనుగ్రహం వల్ల అదే జరిగిందా (did I do it, or did it happen by God’s grace?) – నాకు తెలియదు.
నా సమయాభావ పరిస్థితి వల్ల ఆ plan ప్రకారం – 05-03-2022 అర్థరాత్రి బెంగళూరుకు తిరిగి వచ్చిన మా అల్లుడు గారిని receive చేసుకుని నేరుగా airport నుంచే తిరువణ్ణామలై ప్రయాణం అయ్యాము. తెల్లవారుజామున తిరువణ్ణామలై చేరగానే కొద్ది విరామం, కాలకృత్యాల తరువాత మొదటగా సూర్యోదయానికి
balu1 ముందే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. “అక్కడ పర్వతంగా కనపడేది నిజానికి సాక్షాత్ సద్వస్తువైన శివుడే” అని అరుణాచల మాహాత్మ్యం చెప్తుంది. 14 కిలోమీటర్ల నడకలో ఆ సద్వస్తువు మనకు కుడివైపు ఉండేలా నడుస్తూ చేసే గిరి ప్రదక్షిణ అత్యుత్తమమైన ‘సత్సంగము’ అని భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉద్బోధించేవారుట.

“కొండే కదా” అనుకున్న ఓ సామాన్యుడి తలని తన ఉత్తరీయంలో కప్పి అతన్ని ఆ ‘కొండ’వైపుకి తిప్పి ‘ఇప్పుడు చూడు’ అని శేషాద్రి మునివారు ఆదేశించారుట. ఉత్తరీయంలోపల నుంచి కళ్ళు తెరచి చూసిన అతనికి కళ్ళు మిరిమిట్లుగొలిపే అనేకానేక కాంతులతో వెలిగిపోతూ అనంతంగా ప్రకాశిస్తున్న మహాతేజోలింగ దర్శనం కలిగిందట. “మానవ మాత్రులు తట్టుకోలేరు” అని తన ప్రభను తగ్గించి కేవలం పర్వతం లాగా కనిపిస్తాడట భక్తవత్సలుడైన ఆ అరుణాచలేశ్వరుడు.

కాలి నడకన చేయవలసిన ఈ గిరిప్రక్షిణను అరుణాచలేశ్వరుడితో పాటు ఆ పర్వతాన్ని ఆలవాలంగా చేసుకున్న లెక్కలేనన్ని తీర్థాలు, అనేకమంది భౌతిక సూక్ష్మ అదృశ్య రూపాలలో ఉండే సిద్ధపురుషులు, స్వీకరించి అపారమైన అనుగ్రహాన్ని వర్షిస్తారుట. మొదటి అడుగు సంచిత కర్మని, రెండవ అడుగు ప్రారబ్ధాన్ని, పూర్తిగా నశింపజేయగా మూడవ అడుగు ఆగామి కర్మనూ నిశ్శేషంగా చేస్తుందిట. అదుపరి అడుగులన్నీ శివానుగ్రహ సంపదనే పెంచుతాయని పురాణోక్తి. ఈ గిరి ప్రదక్షిణలో నాచేత 30 వేల అడుగుల వేయించాడు ఆ పరమేశ్వరుడు – అని నా smart watch record చేసింది!

గిరి ప్రక్షిణలో అరుణాచల పర్వత సౌందర్యం వివిధరీతులలో మారుతూ కనిపిస్తుంది. నంది ముఖ దర్శనం, త్రిశిఖర దర్శనం, పంచముఖ దర్శనం, ఉత్తర ముఖ దర్శనం ఇలా.. అరుణాచలానికి ఉత్తర ముఖం కనపడే ప్రదేశంలో ఓ పిల్ల కాలవ వంతెనలాంటిది ఉంటుంది. శిఖరం మీద ఓ మహా వటవృక్షం కింద పరమేశ్వరుడు మహాయోగీశ్వరుడి రూపంలో ఇటు తిరిగి కూర్చుని ఉంటాడు అని భగవాన్ శ్రీ రమణులు ఆ వంతెన గట్టు మీద కూర్చుని తదేకదీక్షగా గిరి శిఖరాన్ని దర్శిస్తూ ఉండేవారుట. ఇప్పటికీ దానిని “రమణర్ bund” అంటారు.

తొంభైశాతం సమయం మానసిక శివనామస్మరణతో, మిగిలిన సమయం శివనామోచ్చారణతో సుమారు అయిదు గంటలసేపట్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము. కొద్ది సేపు విశ్రాంతి తరువాత రమణాశ్రమంలో మాతృభూతేశ్వర రమణేశ్వర సన్నిధులను దర్శించుకుని అక్కడి విశేషాలన్నిటినీ దర్శించుకున్నాము. భగవాన్ సన్నిధిలో ఆయన కరస్పర్శను పొంది మోక్షగాములైన ఆవు లక్ష్మి, కాకి, జింక మొదలైన వాటి సమాధుల దర్శనం చేసుకున్నాము. భగవాన్ శ్రీ రమణులు దర్శనం, మౌన ప్రబోధం, అప్పుడప్పుడు క్లుప్తంగా అలతి పదాలతో ఆత్మవిచార మార్గోపదేశం చేసిన గదులలో ధ్యానమే చేయక్కరలేదు.

నిశ్శబ్దంగా కూర్చున్నా కృతకృత్యులమవగలం. భగవాన్ రమణేశ్వర మహాలింగానికి ఎదురుగా hall బయట నిలబడితే కుడి పక్క అరుణాచలేశ్వర పర్వత శిఖరం, ఎదురుగా గురుసార్వభౌములైన రమణులు, ఆ దర్శనానుభవంలో ‘తాను’ ఉంటాము – ఆ దర్శనంతో “ఈశ్వరోగురురాత్మేతి..” అనే శ్లోకం యొక్క అర్థంగా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఆ విధంగా నిలబడి నమస్కరించుకున్నవారికి ఉపాధిగతమైన దేహాత్మభావం పోకపోయినా జన్మధన్యమవటానికి కావలసిన అనుగ్రహం, సత్సంగం, భగవాన్ ప్రసాదిస్తారు.

రమణులు స్వయంగా రకరకాల వంటలు చేసి చేయించిన వంటగదిలోనే నేటికీ ఆశ్రమ భోజన ప్రసాదం తయారవుతుంది. ఆయన ఆజ్ఞానుసారమే మొదట ఆశ్రమ ఆవరణలో సాధువులకు భిక్షుకులకు ఆహారం ఇవ్వబడుతుంది. తరువాత పూర్వాహ్నంలో 11:30 కి భక్తులకు భోజన ప్రసాదం. ఇదే భోజనశాల గదులలో భగవాన్ భిక్ష స్వీకరించేవారని తలచుకుంటూ తీసుకునే ప్రతి ముద్దా అమృతతుల్యమే. అలా భోజన ప్రసాదం స్వీకరించాక అరుణాచలేశ్వర దేవాలయ దర్శనానికి వెళ్ళాము.

తెలిసిన ఒక అర్చకస్వామి (గురుక్కళ్)ని తోడురాగా గర్భాలయంలో పది నిమిషాలు గడపే అదృష్టం నందీశ్వర అనుగ్రహంతో కలిగింది. సాధారణంగా రాతి దేవాలయాల లోపల చల్లగా ఉంటుంది – కానీ గర్భాలయంలో అగ్నిలింగ స్వరూప సాన్నిధ్యంలో ఎప్పుడూ ఒక వింత వేడి వాతావరణం ఉంటుంది.
అలాగే అపీతకుచాంబికా అమ్మవారి సన్నిధిలో కుడా తృప్తిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మరో పరిచయస్తురాలు ఎదురుపడి – “నేను కదా మీకు దర్శనం చేయించాలి, వారెవరితోనో వెళ్ళటం ఏమిటి” అని పంతం పట్టి మరీ మరోసారి అదేవిధంగా దర్శనాలు చేయించారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని సేవించుకుని ‘ఇంత అడిగితే అంత ఇచ్చే’ శివయ్యకి వేలవేల నమస్కారాలు సమర్పించుకున్నాము.

సాయంత్రం మరోసారి రమణాశ్రమ సందర్శనం. భగవాన్ రమణులు కుమారస్వామి అవతారమని చెప్తారు. అందుకేనేమో – రమణాశ్రమంలో ఎప్పుడూ నెమళ్ళ సంచారం ఉంటుంది. వాటి క్రేంకణాలు
balu సందర్శకులకు సందడి, వాటి అందం కన్నులపండుగ.భగవాన్ సన్నిధిలో పూజ, ఆరతి, పారాయణం దర్శించుకోవటంతో మనసులు పరమానందభరితములవగా – ఎలా మొదలయిందో అలా ముగిసింది మా మరపురాని అరుణాచల క్షేత్ర యాత్ర.
౹౹ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ౹౹
౹౹ ఓం నమో భగవతే శ్రీ రమణాయ ౹౹

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం, ఢిల్లీ

LEAVE A RESPONSE