– గిన్నెతో కొట్టి…కాలితోతన్ని..
( మార్తి సుబ్రహ్మణ్యం)
తాడేపల్లి: నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లి ఇప్పుడు ఎనభై ఏళ్ల వృద్ధురాలు. ఎముకల గూడులా మారి, ఆదరించేవారు లేక రేపో, మాపో అన్నట్లు ఉంటుంది. అలాంటి ఆ పండు ముదుసలిని కంటికిరెప్పలా చూడాల్సిన కన్నకొడుకు.. అత్యంత కిరాతకంగా, అత్యంత అమానుషంగా కాళ్లలో తన్నిన ఓ దృశ్యం చూస్తే మనిషన్నవారికెవరికయినా హృదయం ద్రవించదూ?! అయ్యో పాపమని కన్నీరుకారదూ? అంత పండుముదుసలిని కొట్టడానికి ఆ కొడుకుకు చేతులెలావచ్చాయని కడుపురగిలిపోదూ? అవును… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసినవారికెవరికయినా కలిగే భావోద్వేగం అదే.
తాడేపల్లిలో జరిగిన ఈ అత్యంత అమానవీయ ఘటన మానవత్వానికే కాదు, తల్లీకొడుకుల పేగుబంధానికీ మాయనిమచ్చలా మారింది. మంగళగిరి సమీపంలోని తాడేపల్లి బ్రహ్మానందపురంలో నాగమణి అనే వృద్ధురాలిని కొడుకు,కోడలు ఇంటి నుంచి గెంటేశారు. ఆస్థి కోసం ఆమెను వారిద్దరూ చాలాకాలం నుంచి వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే తాజాగా కొడుకు ఇంటికి వచ్చిన వృద్ధురాలు తాగేందుకు నీళ్లు అడిగితే, నీళ్లు ఇచ్చిన కొడుకు.. అదే గిన్నెతో ఆమె తలపై కొట్టాడు. దానితో పెద్దగా అరిచిన ఆమెను కొడుకు శేషు కాలితో తన్నాడు. ఆ
దెబ్బకు ఆ పండుటాకు వెనక్కి కూలిపోయింది. ఆ ముదుసలి ఆర్తనాదాలు అక్కడ ఎవరికీ వినిపించలేదు. ఎలాగో విషయం తెలుసుకున్న స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొడుకు శేషును అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.