Suryaa.co.in

Telangana

మోదీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు

– సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు?
– కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ
– ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ రాష్ట్ర మంత్రులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు క్రుషి చేస్తుండటమే కాకుండా తెలంగాణ అభివ్రుద్దికి ఎంతగానో సహకరిస్తున్న నరేంద్రమోదీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు.

తెలంగాణలోని గ్రామాలను అభివ్రుద్ధి చేసేందుకు, పేదలను ఆదుకునేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది ముమ్మాటికీ వాస్తవం. కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, పల్లె పక్రుతి వనాలు, డంపింగ్ యార్డులు వంటి అభివ్రుద్ధి పనులను చేస్తోంది వాస్తవం కాదా?

కేంద్రం పేదలను ఆదుకునేందుకు, తెలాంగాణను అభివ్రుద్ధి చేసేందుకు ముందుకు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పేదలకు అన్యాయం చేస్తోంది నిజం కాదా?

సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే ఎందుకు ముందుకు రాలేదు? తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని చెబితే నోరెందుకు మెదపరు?

కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిన మాట వాస్తవం కాదా? కేసీఆర్ ఇంట్లోనే 5 గురికి పదవులున్న మాట నిజం కాదా? పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటోంది నిజమే కదా… రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ఉద్యోగాలకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది వాస్తవమే కదా? మరి ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది?

ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారని తెలిసి కనీస మర్యాద పాటించకుండా పక్క రాష్ట్రానికి పారిపోయిన సీఎం కేసీఆర్ సిగ్గులేకుండా తన మంత్రులతో ఎదురుదాడి చేయిస్తున్నారు. మీరెన్ని జిమ్మిక్కులు చేసినా… ఎంతటి విష ప్రచారం చేసినా రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారు.

దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉంది.కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. ఈసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తాం.

LEAVE A RESPONSE