– రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్దిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా అధికారుల పని తీరు ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహాకాలను సమర్ధవంతంగా నూతన పారిశ్రామిక వేత్తలు వినియోగించుకునే విధంగా ఎప్పటికప్పుడు పని చేయాలని, వారికి అవసరమైన చట్టపరమైన అనుమతులను జారీ చేసే విషయంలో జాప్యం చేయరాదని మంత్రి సూచించారు.
నూతన పారిశ్రామిక వాడల్లో నిర్మించిన తలపెట్టిన భవనాలు, ఇతర మౌలిక వసతులపై ఈ సమీక్షా సమావేశంలో మంత్రి దిశా నిర్దేశం చేసారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలకు అనుగుణంగా మన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం అవసరమైన మార్పులు చేర్పులతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కొండపల్లి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వ మనోహరన్, ఏపీఐఐసి అధికారులు పాల్గొన్నారు