మెడిసిన్ లో చేరడం అంటే నిన్ను నువ్వే జైల్లో పెట్టేసుకోడం. నీకిష్టమైనవన్నీ కనబడుతున్నా, కొయ్యకి కట్టిన దూడలా పడుండడం. అయిదేళ్ళ పుస్తకాలతో మస్తకమంతా అస్తవ్యస్తంగా మారిపోవడం.
ఏదో ఒక అమృతం కురిసిన రాత్రిలో, ఎవడో ఒక సాహితీమిత్రుడు ఖడ్గసృష్టి చేస్తాడు. అది మనల్ని ఏ మహాప్రస్థానానికి తీసుకెళుతుందో ఆ క్షణం మనకి తెలీదు.
ఆ వేడిలోనే రావిశాస్త్రినీ, కారా మేష్టారినీ, బీనాదేవినీ చదివేసి రక్తాన్ని స్టవ్వుమీద మరిగించేసుకున్నాను.
మరికొన్నాళ్ళకి యండమూరినీ, యద్దనపూడినీ పలకరించి మనసుని లవ్వులో కరిగించేసుకున్నాను
అయితే…
ఒక శుభముహూర్తాన మావాడొకడు, నాకు సాహిత్యంలో తీపిని పరిచయం చేశాడు. కథల్లో కమ్మదనాన్ని రుచి చూపెట్టాడు.
లేత అరిటాకులో వేడివేడన్నంతో కలుపుకు తిన్న కొబ్బరిపచ్చడిలా ఘుమఘుమలాడే రచనలు!
శ్రావణమాసపు సాయంకాలం సాతాళించుకు తిన్న శనగలంత కమ్మనైన కబుర్లు!
ఎవరీయనా… అనిచూస్తే వీటన్నిటికీ కారణం శ్రీరమణగారని తెలిసింది.
శ్రీరమణ….
పంచదార కలిసలు తింటున్నట్టే వుంటుంది ఈయన రాసినవి చదివితే! తియ్యటి మాటల్తో తిరణాలలో తిప్పుకొచ్చేస్తారు. ఎవరి భుజాలమీదనో ఎక్కి కూర్చుని అవన్నీ చూస్తున్నంత ఉత్సాహంగా వుంటుంది అదంతా చదువుతోంటే!
జీవితసత్యాల్ని పీచుమిఠాయిలా ఓ చుట్ట చుట్టేసి చేతికందిస్తారు. చూడ్డానికి రంగూ బావుంటుంది. తీరా తిన్నాక తియ్యగా కూడా వుంటుంది. అయిపోయాక ‘ఓ! ఇది మనందరికీ తెలిసిందేకదా?’ అనిపించేస్తుంది.
కానీ చెప్పే విధానం వుంది చూశారూ? అదే అక్షరాలతో ఆ కర్షకుడు పండించే ఆకర్షణీయమైన పంట!
ఆ చేతినించి జాలువారిన ‘మిథునం’ కథలో ముత్యాల్లాంటి మాటల్ని రత్నాల్లా అలంకరించి పుస్తకంలో అద్దారు బాపు. తెలుగుసాహిత్యపు వినువీధిలో మిరుమిట్లుగొలిపే ఇంపైన నక్షత్రాల గుంపులా తోచే ఆ అందమైన దస్తూరీ చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా?
‘ఎంచక్కా ఒక్కొక్కటీ పట్టుకెళ్లి పదిలంగా పేర్చారా?’ అని?
ఆ కథలో అప్పదాసుతోపాటు పెరడంతా తిరిగేస్తూ,
పాదులకి సరిగా నీళ్లందుతున్నాయో లేదో చూస్తూ,
ఆయన తిట్టే తిట్లని ఆనందంగా మోస్తూ,
బుచ్చి ముఖాన వెలిగే సూర్యబింబంలాంటి కుంకంబొట్టులో తెలుగుదనానికి మనసారా పొంగిపోతూ,
ఆవు దూడల ఆకలిని గుర్తించే అతగాడి ఆప్యాయతకి కరిగిపోతూ, ఆయింట్లోనే పడేడిశాను చాలాకాలం….
ఆ మిథునం ఆ యింట లేకపోయినాసరే!
అప్పదాసు మాట కరుకు. మనసు చెరుకు.
బుచ్చి అతనికోసం సాతాళించి అందించే పేరంటం శెనగలంత కమ్మనైన కథ ‘మిథునం’!
శ్రీరమణ గారు పెళ్ళికి మూడురోజుల ముందే వచ్చి , వీధివాకిట్లో పడక్కుర్చీలో కూచుని బోల్డు కబుర్లుచెప్పే మావయ్యలా అనిపించారు.
చివరిదాకా నవ్వులతోనూ, చివరాఖరికి ఏడుపుతోనూ… మొత్తానికి ఏదోరకంగా కన్నీళ్ళు మాత్రం తెప్పిస్తారు.
అలా మన మనసు మూలల్లో ఎండిపోయి గుట్టుగా పడున్న జ్ఞాపకాల పాదులన్నింటికీ ఆ కన్నీటి తడితగిలి మళ్ళీ పచ్చిగామారి చిగురించేలా చేస్తారు.
ఇన్నినాళ్ళ ఈ జీవితానికీ ఒకటే కోరిక!
మనసుని తాకే రచనలు చేసిన ఆయన చేతిని తాకాలని!
కన్నీటితో పాదుల్ని తడిపిన అతగాడి పాదాల్ని తడమాలని!
స్వర్గీయ సోమరాజు సుశీల గారిని కలిసినపుడు, శ్రీరమణగారితో ఫోన్లో సంభాషించే అవకాశం లభించింది. అదొక అరుదైన అరగంట అదృష్టం. విద్యా వినయగుణ సంపన్నులని వివరించాల్సిన పనిలేదు.
ఆయనకసలు గర్వం అంటే తెలీదని సగర్వంగా చెప్పగలను.
“నన్ను కలవడానికి మీరెప్పుడైనా రావొచ్చు!” అన్నారు.
“లేదూ, నన్ను రమ్మన్నా సరే!” అనికూడా అనేశారు!
ఆ రెండోదానికంటే పాతకం మరోటి వుండదని మేమే బయల్దేరాం. ఆరోజు ఉదయం వారికి ఫోన్ చేస్తే రెండింటికి రమ్మన్నారు. మళ్ళీ సాయంత్రం ఎనిమిదికల్లా మేం వైజాగెళ్ళే బస్సెక్కెయ్యాలి.
కాలాతీతమైన వ్యక్తిని కలవడానికి , కాలం కలిసొచ్చింది కానీ కాలమే తక్కువుంది.
మా దంపతులిద్దరమూ బయల్దేరి, భక్తి టీవీ ఆఫీసు ముందు భక్తితో నిలబడివుండగా భగవంతుళ్లా మాకు ప్రత్యక్షమయ్యారు.
లోపలికి తీసుకెళ్ళి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నారు. అప్పటినుంచి మా దంపతులిద్దరికీ ఎన్నో కబుర్లు చెప్పారు.
అందులో స్వోత్కర్ష లేదు, స్వానుభవం తప్ప!
శాపనార్ధాలు లేవు, సాయమందించిన మనసుల పట్ల స్మారక వచనాలు తప్ప!
స్వర్గీయ బాపురమణలకీ శ్రీరమణగారికీ ఉన్న సంబంధం, లడ్డూలో జీడిపప్పులాంటిది. ఉండలో ఉండేది ఒక్కటే అయినా ఎక్కడో దాక్కుంటుంది. కానీ చాలా రుచినే ఇస్తుంది.
వారితో కలిసి పంచుకుతిన్న మమకారప్పూస రుచిని ఈయనింకా మర్చిపోలేదు.
నాగార్జున సిమెంట్స్ రాజుగారి పేరెత్తితే , ఆయన కనుబొమలు వాటంతటవే పైకెళిపోతున్నాయి. అన్నీ ఘనపంచరత్నాలే ఆయన్ని కీర్తిస్తోంటే!
పెళ్లి పుస్తకాన్ని కుట్టడానికి రాజుగారిచ్చిన దారం, ఆధారం ఏమిటంటే షూటింగ్ జరుపుకోండంటూ ఇచ్చిన విశాలమైన వారి తోటలు. సినిమాలో మనక్కనబడేది ప్రాకృతిక సౌందర్యం మాత్రమే!
కానీ రాజుగారి గొప్పమనసుకున్న అంతస్సౌందర్యాన్ని, మాకళ్ళముందు గోదారంత విశాలంగా చూపించారు శ్రీరమణగారు!
షూటింగుకి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేసేవారనీ, ఎవరడిగినా డబ్బులు అప్పెట్టేవారనీ, ఎదుటివాళ్ళ తప్పుల్ని కప్పెట్టేవారనీ చల్లటివేళ నోరారా కీర్తించారు. ఆయన మనసు వెన్నపూస.
ఇక సూర్యకాంతం గారితో వారి అనుభూతుల్ని, మాతో ఆవిడ పెట్టిన పులిహోరలా పంచుకున్నారు. చరమాంకంలో ఆవిడ పడ్డ బాధను వర్ణిస్తోంటే మాకు గుండె తడిసింది.
బాపు ఎంత బుద్ధిమంతుడో వివరించారు. వారిది ఆయనేసిన బొమ్మలంత అందమైన మనసుట! తను గీసినవాటితో రూపాయెలా సంపాయించాలో తెలీదని చెప్పారు.
అలాగే గడుసుపిల్లాడు బుడుగులాంటి రవఁణగారి లౌక్యం గురించీ చెప్పారు. వాళ్ళిద్దరి స్నేహధర్మాన్నీ బోధపరిచారు.
ఎమ్వీయల్ గారి గురించి మేమే అడిగాం.
బ్నింగారి దక్షతా, సానుకూల దృక్పథాల గురించి సోదాహరణంగా విశదపరిచారు.
రెండు గంటలపాటు ఏదో లైబ్రరీలో కూచుని.. పాత జ్యోతులు, విజయచిత్రలూ, సినిమారంగాలూ తిరగేసినట్టు అనిపించింది నాకయితే!
స్వల్ప అనారోగ్యం కొంత బాధిస్తున్నా, అనల్పమైన సంతోషాంబుధిలో మమ్మల్ని ఓలలాడించారు.
అలుపెరుగని ఆ మనసుకి ఎంత ఉత్సాహమో?
తట్టిలేపితే తేగలపాతరలా ఎన్నెన్ని జ్ఞాపకాలో?
మేలుచేసిన మనుషులంటే ఎంత మమకారమో?
నేను రాసినవాటిని పుస్తకరూపంలోకి తీసుకురమ్మని సలహా యిచ్చారు. ఆ క్షణాన నేను స్థిరమైన నిర్ణయం తీసేసుకున్నాను, పుస్తకమంటూ వేస్తే దానికి ముందుమాట శ్రీరమణగారే రాసితీరాలని. ఎందుకంటే ఆయన ముందొక మాటా, వెనకొక మాటా చెప్పే రకం కాదు. అనతికాలంలోనే ఆ కోరికా తీరింది. అందమైన మనసున్నవారి నోటివెంటే కాదు, చేతిలోంచీ మంచిమాటలే వస్తాయని ఋజువు చేస్తూ మా ఆరుగురినీ చక్కటి పరిచయం చేశారు.
బంగారు మురుగు కథలో రాసిన ఈ నాలుగు వాక్యాలూ భట్టీయం వేయించాలి పిల్లల చేత…
‘చెట్టుకి చెంబెడు నీళ్ళు
పక్షికి గుప్పెడు గింజలు
పశువుకి నాలుగు పరకలు
ఆకొన్నవాడికి పట్టెడన్నం…’
ఇదే జీవనవేదమని బోధించిన గురు‘వే మన’ శ్రీరమణగారు!
నివాళులు!
