Home » శ్రీ శివ మహాపురాణము

శ్రీ శివ మహాపురాణము

పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు. ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము.
సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు.
పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది. అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒక నెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు. దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకా సుర సంహారం చేశాడు. లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి. యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు.
అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు.
ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి. అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామివారే నేర్పారు. కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు.
సుబ్రహ్మణ్య స్వామి వారు అవతారములను స్వీకరించారు. ఇందులో ప్రధానమయిన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి.

Leave a Reply