– హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో జరిగిన ప్రజాపాలన
– ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి విద్య-వైద్యం రెండు కళ్ళు లాంటివి. వీటికి అత్యధికంగా నిధులు కేటాయించాం. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలను రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే రాష్ట్రం బాగుపడుతుంది.ప్రజలను రెచ్చగొట్టి అందులోంచి కొంత సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్న
బీఆర్ఎస్.
రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడితే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలోని బడుగు బలహీన పేద మధ్య తరగతి ప్రజల వైద్య అవసరాలు తీర్చడం కోసం ప్రజా ప్రభుత్వం కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నది. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా నిధులు విడుదల చేస్తూ ఆరోగ్యశాఖ పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్తున్నాం.
గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద కుటుంబాలు అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉండి చెట్టుకో పుట్టకో దండం పెట్టే పరిస్థితుల నుంచి మీరు డబ్బులు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఖర్చు చేసి బతికించుకుంటామని పేదలకు ధైర్యం చెబుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నది.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రంలోని పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు సంతోషంగా ధైర్యంగా జీవించ గలుగుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తు, డాక్టర్లకు, సిబ్బందికి ప్రతినెల జీతాలు ఇస్తూ, వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందిస్తూ ప్రజా ప్రభుత్వం వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతున్నదని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను, ఆరోగ్య శ్రీ గురించి పట్టించుకోలేదు, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, సిబ్బంది నియామకాన్ని విస్మరించారు.ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు తగుదునమ్మా అని బజారు మీదకొచ్చి ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం.
పదేళ్ల పరిపాలనలో గత బిఆర్ఎస్ పాలకులు చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులకు సంబంధించిన భారాన్ని ప్రజా ప్రభుత్వం ప్రతి నెల 6500 కోట్లు రూపాయలు చెల్లిస్తూ, ఆ భారాన్ని అధిగమిస్తూ, ఎక్కడ నెరవకుండా ప్రజల కోసం పనిచేస్తున్నది.
అధికారం పోయి సంవత్సరం కూడా ఉండలేక రోడ్డు మీదకు వచ్చి బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వం పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.దేశంలో 10 ఏళ్లకు పైగా పరిపాలన చేసిన బిజెపి, తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయలేని వారు ఏడాది పాలన చేసుకున్న ప్రజా ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేల్చడం విడ్డూరం.
పది సంవత్సరాల పైగా అధికారంలో ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారా? నోట్లు రద్దు చేసి మూడు నెలల్లో ఫలితాలు చూపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాటి ఫలితాలు ఎందుకు చూపించడం లేదు?నోట్ల రద్దుతో దేశంలో దొంగ నోట్లు, నకిలీ నోట్లు బయటకు తీసుకువస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు చూపించలేదు?
ప్రతి పేద వాడి ఖాతాలో పదిహేను లక్షలు రూపాయలు జమ చేస్తామని చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు?పదేళ్లకు పైగా పాలన చేస్తూ ప్రజలను మోసగించిన కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు గురించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గృహ జ్యోతి పథకం కింద పేదలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తును అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా 10 నెలల కాలంలో రైతులకు రుణమాఫీ కింద 21 వేల కోట్ల రూపాయలు నగదు అందించలేదు.
రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగానే దీపావళి నుంచి ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టాం.
రాష్ట్రంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పాం. 55 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.ఇన్ని మంచి పనులు చేసిన ప్రజా ప్రభుత్వంపై పని లేని బిజెపి నాయకులు రోడ్డు మీదకు వచ్చి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు పౌష్టికాహొరం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా మంత్రిమండలి సభ్యులందరం ఆలోచన చేసి ఒకేసారి 40% డైట్ చార్జీలు పెంచి అన్ని సదుపాయాలు అందిస్తున్నాం.
రెసిడెన్షియల్ ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న బాలికలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం.రాష్ట్రంలో పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి మొదటి విడతలో 30, రెండో విడతలో 30 రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు 5వేల కోట్ల రూపాయలు కేటాయించి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించింది. కాకతీయుల చరిత్ర చెప్పుకొని గొప్పగా బతికిన బీఆర్ఎస్ పాలకులు గత పది సంవత్సరాల్లో వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం 6వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.