రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నమన్న ఆర్బీఐ నివేదిక

– విద్య..వైద్య..సంక్షేమరంగం సహా వివిధ రంగాలు జగన్ పాలనలో అథోగతి పాలయ్యాయని తేల్చిన నివేదిక
• ప్రాథాన్యతా రంగాల వారీగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) అన్నిరాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు సమీక్షించాకే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని తేల్చింది
• విద్య.. వైద్యరంగాలు, సంక్షేమం.. పెట్టుబడిరంగాలకు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువేనని తేల్చిన నివేదిక
• జగన్ సర్కార్ 2024 మార్చి నాటికి రూ.5లక్షల కోట్ల అప్పులు (కేవలం ఆర్బీఐ ద్వారా) చేయనుందని ఆర్బీఐ నివేదిక తేల్చింది
• ఇతర కార్పొరేషన్లు.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలు, ఇతరత్రాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.11లక్షల కోట్ల పైచిలుకే.
• అప్పులకు గ్యారెంటీలు ఇవ్వడంలో ఏపీ దేశంలో తొలిస్థానంలో ఉందని తేల్చిన ఆర్బీఐ నివేదిక
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రాథాన్యతా రంగాల వారీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నిరాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను సమీక్షించి, ఏపీ ఆర్థిక స్థితి ఎంతఘోరంగా ఉందో వెల్లడించిందని, ‘స్టేట్ ఫైనాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ పేరిట 307 పేజీల నివేదికను రిజర్వ్ బ్యాంక్ గత వారం విడుదల చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ రాష్ట్రాల ఆదాయాలు.. చేసిన అప్పులు.. వాటికి కట్టేవడ్డీలు… బ్యాంక్ గ్యారెంటీలు.. ప్రజలపై వేసిన పన్నులు..ఇతర ఛార్జీలు..విద్యా, వైద్య, సంక్షేమ రంగాలకు చేస్తున్న ఖర్చులు సహా అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే రిజర్వ్ బ్యాంక్ ఈ నివేదికను వెల్లడించింది. ఏ రాష్ట్రం వివిధ రంగాలకు ఎంత ఖర్చు పెడు తోంది.. ఆయారంగాల పనితీరు.. ప్రజలకు అందుతున్న ఫలితాలను కూడా ఆర్బీఐ విశ్లేషించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తే.. ఆయన ప్రజల్ని ఉద్ధరించానని, వివిధ రంగాల్ని పటిష్టపరిచానని చెబుతున్న దానికి..వాస్తవ పరి స్థితులకు ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది.

వైసీపీ ప్రభుత్వం వివిధ రంగాలకు ఈ నాలుగేళ్లలో ఎంత ఖర్చుపెట్టింది.. చెప్తున్నమాటలకు, వాస్తవంలో పరిస్థితికి ఎంత తేడాఉందో నివేదికలోని అంశాలతో తేలిపోయింది. రాష్ట్రం చేసిన అప్పులు …వాటికి సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలు.. చెల్లిస్తున్న వడ్డీల వివరాల్ని కూడా నివేదిక బయటపెట్టింది. జగన్ పాలనలో రాష్ట్రఅప్పులు అదుపు చేయలేనిస్థాయి కి వెళ్లాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలకు పెట్టిన ఖర్చు..ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో నివేదికలోని అంశాల ద్వారా పరిశీలిద్దాం.

రాష్ట్ర విద్యారంగం పరిస్థితి …
నాడు-నేడు పేరుతో విద్యారంగంలో అద్భుతాలు సృష్టించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆర్బీఐ నివేదికతో తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో కేవలం 11.7శాతం నిధులు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి ఖర్చుచేసింది. గత ఆర్థిక సంవత్సరం 11.9శాతం నిధులు మాత్రమే కేటాయించింది. అదే టీడీపీ ప్రభుత్వంలోని పెట్టిన ఖర్చువివరాలు చూస్తే.. 2015-16లో మొత్తం బడ్జెట్లో 15.6 శాతం నిధులు చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగానికి ఖర్చుచేసింది. 2017-18లో 13శాతంనిధులు, 2018-19లో 12 శాతం నిధులు వెచ్చించింది.

దేశస్థాయితో పోలిస్తే … అస్సాం ప్రభుత్వం తమ మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి 16.3 శాతం ఖర్చుపెడితే, బీహార్ 16.2శాతం, చత్తీస్ ఘడ్ 18.2శాతం, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలు 14.9శాతం, రాజస్థాన్ 17శాతం, ఢిల్లీ 21శాతం నిధులు ఖర్చుపెట్టాయి. ఈ విధంగా ఇతర రాష్రాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా రంగానికి చేసిన ఖర్చు ఎంతో తక్కువనే చెప్పాలి. పాత పథకాలకు పేర్లు మార్చి కేవలం ప్రజల్ని మోసగించారు తప్ప.. విద్యారంగానికి జగన్ రెడ్డి సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదు. బైజూస్.. ఇతర సంస్థలతో ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకోవడం తప్ప ఆచరణలో వచ్చిన ఫలితాలు శూన్యం.

రాష్ట్ర వైద్యరంగం పరిస్థితికి వస్తే…!
ఇటీవలే ఆరోగ్య శ్రీ పరిధిలోని వైద్యచికిత్సల వ్యయపరిమితిని రూ.25లక్షలకు పెంచుతున్నట్టు.. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో పేదల్ని కాపాడుతున్నట్టు జగన్ రెడ్డి గొప్పలు చెప్పాడు. ప్రజారోగ్యం.. వైద్యం.. కుటుంబసంక్షేమానికి కలిపి జగన్ రెడ్డి 2022-23లో చేసిన ఖర్చు కేవలం 5.6 శాతం మాత్రమే. 2021-22లో పెట్టిన ఖర్చు 5.8శాతం మాత్రమే. దేశస్థాయిలో పోలిస్తే వైద్యరంగానికి ఏపీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రాలు 17 ఉన్నాయి. మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది.

ఆరోగ్యశ్రీ కింద పేదలకు అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నామని.. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజల్ని కాపాడుతున్నామని, 108-104 అంబులెన్సుల్ని అందుబాటులో ఉంచామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేశామని.. ఇలా ఈ ప్రభుత్వం వైద్యరంగానికి సంబంధించి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తోంది. కానీ వాస్తవంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎక్సైజ్ ఆదాయం ప్రభుత్వానికి 20శాతం వస్తుంటే.. ఆరోగ్యరంగానికి పెడుతున్న ఖర్చు కేవలం 5 శాతం మాత్రమే.

పెట్టుబడుల రంగం విషయానికి వస్తే..!
2022-23లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల రంగంపై పెట్టిన ఖర్చు రూ.16వేలకోట్లు మాత్రమే. అంతకు ముందు సంవత్సరం కూడా ఇంతే పెట్టారు. పెట్టుబడుల రంగంలో పెట్టిన ఖర్చుతో పోలిస్తే దేశస్థాయిలో ఏపీ 15వస్థానంలో ఉంది. మన కంటే తక్కువ పెట్టుబుడులు పెట్టిన రాష్ట్రాలజాబితాలో ఈశాన్యరాష్ట్రాలు ఉన్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడు.. గుజరాత్.. కర్ణాటక..తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితిలో ఏపీ లేదు. రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా .. పరిశ్రమలు లేకుండా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎలావస్తాయో ముఖ్యమంత్రి చెప్పాలి.

సంక్షేమ రంగం పరిస్థితి గమనిస్తే….!
జగన్ రెడ్డి పదేపదే చెప్పే మాట బటన్ నొక్కుడుతో ప్రజల్ని ముఖ్యంగా పేదల్ని ఉద్ధరిస్తున్నానని. బటన్ నొక్కితే చాలు.. అంతా అయిపోతుంది అన్నట్టు మాట్లా డుతున్నాడు. 2022-23లో వైసీపీప్రభుత్వం సంక్షేమానికి రూ.1,00,023 కోట్లు ఖర్చుపెట్టింది. దేశంలో మనకంటే 5 రాష్ట్రాలు సంక్షేమానికి ఎక్కువ ఖర్చుపెట్టాయి. ఈ రంగంలో ఏపీ దేశంలో 6వ స్థానంలోఉంది.

జీ.ఎస్.డీ.పీ వ్యాల్యూ విషయానికి వస్తే…!
జీ.ఎస్.డీ.పీలో ఏపీ మొదటిస్థానంలో ఉన్నట్టు బుగ్గన చెబుతుంటారు. కానీ దేశంలో ఏపీ టాప్ -10లో కూడా లేదు. అప్పుల్లో మాత్రం ఏపీ దేశంలోనే 3వ స్థానంలోఉంది. ఈ ఒక్క ఆర్థికసంవత్సరంలోనే (2023 ఏప్రియల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఆర్బీఐ నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పు 11.8శాతం. ( సుమారు 12శాతం) దేశంలోని మిగతా రాష్ట్రాలు అన్ని కలిపి 88శాతం అప్పులు తీసుకుంటే, ఏపీ ఒక్కటే ఆర్బీఐ నుంచి 11.8 శాతం రుణాలు తీసుకుంది. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తానన్న జగన్.. ఆ పని చేయలేదు కానీ, అప్పులకోసం మాత్రం కేంద్రం మెడలు బాగానే వంచాడు.

ఈ ఆర్థికసంవత్సరం మొదటి ఆరునెలల్లో దేశంలోని మిగతారాష్ట్రాలన్నింటినీ తలదన్ని కేవలం ఆర్బీఐ నుంచే రూ.41,500కోట్ల అప్పులు తీసుకుంది. కార్పొరేషన్ల అప్పులు వేరే. ఏపీ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న తమిళనాడు … జీడీపీతో పోలిస్తే మన రాష్ట్ర జీడీపీ తక్కువ. తమిళనాడు జీడీపీ 23లక్షల కోట్లు అయితే…ఏపీ జీడీపీ కేవలం 13లక్షల కోట్లే.

రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులు…. వచ్చిన ఆదాయం వివరాలు పరిశీలిస్తే…! (రెవెన్యూ సర్ ప్లస్)
దేశంలో మొత్తం 31 రాష్ట్రాలుంటే.. రెవెన్యూ సర్ ప్లస్ లో ఏపీ 27వ స్థానంలో ఉంది. కింద నుంచి నాలుగో స్థానం. మన తరువాత కేరళ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. 2024 మార్చినాటికి ఏపీ ప్రభుత్వం చేయనున్న మొత్తం అప్పు రూ.4,85,490 కోట్లు (దాదాపు రూ.5లక్షల కోట్లు) చేయనున్నదని ఆర్బీఐ నివేదికే తేల్చింది. కార్పొరేషన్ల అప్పులు… బ్యాంకుల నుంచి తీసుకున్న వివిధ రుణాలు.. డిస్కంల అప్పులు.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలు.. నీరుచెట్టు బకాయిల వంటివన్నీ కలిపితే ఏపీ ప్రభుత్వ మొత్తం అప్పు రూ.11లక్షల కోట్లు మించిపోతోంది. అప్పులు చేయడం ఒకెత్తు అయితే…వాటిని తీర్చడంలో ఏపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ 20 సంవత్సరాలు.. 30 సంవత్సరాలకు తీర్చేలా తీసుకుంది.

ఎక్కడా 5 ఏళ్లు, పదేళ్ల గ్యారెంటీలు లేవు. తరువాత వచ్చేవారు తీర్చుకుంటారులే అని జగన్ రెడ్డి అందినకాడికి విచ్చలవిడిగా అప్పులు చేశాడు. చేసిన అప్పులకు ఏపీ ప్రభుత్వం రోజుకి చెల్లిస్తున్న వడ్డీ రూ.85కోట్లు. ప్రభుత్వానికి రోజుకి వస్తున్న ఆదాయం రూ. 300 కోట్లు అయితే దానిలో అప్పుల తాలూకా వడ్డీకే రూ.85కోట్లు పోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరమే జగన్ ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులకే రూ28,626 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తం బడ్జెట్లో 14శాతం నిధులు వడ్డీలకే చెల్లిస్తున్నారు. వివిధ రంగాలు.. ప్రజల సంక్షేమానికి పెట్టిన ఖర్చు కంటే ప్రభుత్వం వడ్డీలకు చెల్లిస్తున్నదే ఎక్కువ. వడ్డీల చెల్లింపుల్లో ఏపీ దేశంలోనే 22వ స్థానంలో ఉంది. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్సులు కాకుండా… కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తున్న సొమ్ము, ఆదాయార్జనలో దేశంలో 9వ స్థానంలో ఏపీ ఉంది.

అప్పులకు గ్యారెంటీలు ఇవ్వడంలో మాత్రం ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది
ఒకే ఒక్క అంశంలో ఏపీ దేశంలో ముందుంది. రూ.2లక్షలకోట్లకు ఈ ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఆ విధంగా అప్పులకు గ్యారెంటీలు ఇవ్వడంలో మాత్రం ఏపీ దేశంలో నంబర్-1 స్థానంలో ఉంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఏపీ ఈ నాలుగున్నరేళ్లలో తీసుకొచ్చిన పన్ను సంస్కరణలు ఇలా ఉన్నాయి. భూముల మార్కెట్ ధరలు 5 నుంచి 75 శాతం పెంచడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం చేసిం ది.

ఆదాయం కోసం భూవిలువ పెంచడం తప్ప.. ఇతరత్రా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదాయార్జనలో వైసీపీప్రభుత్వం దిగజారడానికి ప్రధాన కారణం.. ప్రాధాన్యతా రంగాలకు తగిన కేటాయింపులు చేయకపోవడమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక జగన్ సర్కార్ అమలుచేస్తున్న మోసకా రీ సంక్షేమంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. జగన్ రెడ్డి బటన్ నొక్కుడు సీఎం నుంచి పానిక్ బటన్ సీఎంగా మారాడు.” అని విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

Leave a Reply