– గోడ పత్రికను ఆవిష్కరించిన విశ్వ మనోహరన్
ఆంధ్రప్రదేశ్‌లోని సంప్రదాయ హస్తకళలు, చేనేత కళలకు ఆధునిక రూపమిచ్చే ఉద్దేశంతో ఆప్కో, లేపాక్షి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త డిజైన్ పోటీని నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థల ఎండి విశ్వ మనోహరన్ తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సైతం ఈ పోటీలో భాగస్వామిగా ఉందన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ హస్తకళలుగా గుర్తింపు పొందిన కొండపల్లి, ఎటికొప్పాక బొమ్మలు, కలంకారి ప్రింట్లు, లెదర్ పప్పెట్రీ, వుడ్ కార్వింగ్‌లు , నేత కళలుగా ప్రసిద్ధి చెందిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, బందరు ఇత్యాది – ఆధారంగా నూతనంగా రూపొందించిన వస్త్రాలు, సూక్ష్మ జ్ఞాపికల విభాగంలో నూతనత్వం ఉట్టిపడేలా కొత్త డిజైన్లను ఆహ్వానిస్తున్నారు. వినియోగ ప్రయోజనమున్న వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు.
పోటీకి 18 సంవత్సరాల పైబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కళాకారులు, నేతన్నలు, డిజైనర్లు, విద్యార్థులు పాల్గొనవచ్చు. సృజనాత్మకత, సంప్రదాయ నైపుణ్యం, స్థిరత్వం వంటి ప్రమాణాల ఆధారంగా విజేతలను నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రతి విభాగంలో మూడేసి బహుమతులు ప్రకటిస్తారు – మొత్తం 30 బహుమతులు. మొదటి బహుమతి ₹25,000, రెండో బహుమతి ₹15,000, మూడో బహుమతి ₹10,000. మొత్తం ప్రైజ్ మనీ ₹5 లక్షలను ఆప్కో, లేపాక్షి సంయుక్తంగా అందజేస్తున్నాయి.
పాల్గొనదలచిన వారు తమ రూపొందించిన నమూనాలను 2025 జూలై 16లోపు సమీప లేపాక్షి లేదా ఆప్కో షోరూమ్‌లలో అందించాలి. ఇది జూన్ 17న ప్రారంభమైన 30 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. వివరాలు, మార్గదర్శకాల కోసం ఈ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చని విశ్వ మనోహరన్ తెలిపారు.
🔹 https://lepakshihandicrafts.gov.in
🔹 https://www.apcofabrics.com