మహిళా సాధికారతకు పటిష్ట కృషి

115

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– మహిళా కమిషన్ సభ్యుల ప్రమాణస్వీకారం

అమరావతి:
రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్‌ సభ్యులతో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకు విస్తృతంగా కృషిచేసేందుకు కమిషన్ తరఫున కంకణబద్ధులై ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు సభ్యులు ( గజ్జల వెంకట జయలక్ష్మి, కర్రి జయశ్రీ) ఉండగా.. ప్రస్తుతం మరో ముగ్గురుతో కమిషన్ బలోపేతమైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమపై ఉంచిన గురుతర బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని వాసిరెడ్డి పద్మ అన్నారు

ముగ్గురు సభ్యులచే ప్రమాణ స్వీకారం
మహిళా కమిషన్‌ సభ్యులుగా ఈనెల (ఫిబ్రవరి)2వ తేదీన మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం నియమితులైన ముగ్గురు సభ్యుల్లో గడ్డం ఉమ (విశాఖపట్నం), బూసి వినీత (తణుకు), డాక్టర్ షేక్ రుకియాబేగం (గుంతకల్లు) ప్రమాణ స్వీకారం చేశారు. చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి పద్మతో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. కార్యక్రమంలో కమిషన్‌ సీనియర్ సభ్యులుగా కొనసాగుతున్న గజ్జల వెంకట జయలక్ష్మి, కె. జయశ్రీ, కమిషన్ సెక్రటరీ శైలజ, డైరెక్టర్ ఆర్ సూయజ్ తదితరులు పాల్గొన్నారు.